అధిక బరువు తగ్గడానికి ఆహార మార్గాలు ఇవిగో!
అధిక బరువు తగ్గడానికి ఆహార మార్గాలు ఇవిగో!
ఈ కాలంలో బరువు తగ్గడం పట్ల చాలామంది చాలా రకాల మార్గాలు అనుసరిస్తారు. వాటిలో ఎక్కువ మంది అనుసరించే మార్గం తిండి తగ్గించుకోవడం. శరీరానికి ఆహారాన్ని తక్కువగా అందిస్తే బరువు తగ్గుతామనే ఆలోచన వల్ల ఆహారాన్ని తగ్గించుకుంటారు. అయితే ఇలా ఆహారాన్ని తగ్గించుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాల కొరత ఏర్పడిపోతుంది. బరువు తగ్గాలంటే అప్పటి వరకు శరీరంలో ఉన్న కొవ్వులను కరిగించాలి తప్ప తినే తిండిని ఆపుకోకూడదు. నిజానికి ఇలా తిండి ఆపుకోవడం వల్ల అది తాత్కాలికంగా మాత్రమే ఉండటం జరుగుతుంది. ఆ తరువాత సాధారణంగా ఉన్న ఇష్టం కంటే ఎక్కువగా దూరం పెట్టిన ఆహార పదార్థాల మీదకు మనసు మల్లుతుంది. అందుకే బరువు తగ్గాలంటే ఆహారాన్ని మైంటైన్ చేయడం చాలా ముఖ్యం. ఫిట్నెస్ సీక్రెట్ మొత్తం ఆహారాన్ని ఎలా మైంటైన్ చేస్తున్నాం అనేదాని మీదనే ఆధారపడి ఉంటుంది. నోరు కట్టేసుకుని ఆకలికి నకనకలాడకుండా, ఆరోగ్యవంతంగా శరీర కొవ్వును తగ్గించుకునే మార్గాలున్నాయి.
ప్రోటీన్స్!
ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి సంతృప్త భావన పెరుగుతుంది. దానివల్ల ఆహారం తీసుకోవడం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఎక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారాన్ని తీసుకునే విధానాన్ని ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల నివారించవచ్చు. అలాగే అధిక కొవ్వు కలిగిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండచ్చు. కార్బోహైడ్రేట్ లలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఆ కేలరీలు తగ్గించుకోవచ్చు. కేలరీలు తక్కువగా ఉంటే సహజంగానే బరువు పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ఫైబర్!
ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉన్నవి రోజూ తీసుకుంటూ ఉంటే బరువు తగ్గడం సులభం అవుతుంది. ఫైబర్ వల్ల ఆకలి వేయడం తక్కువ. ఈ కారణం వల్ల ఆహారాన్ని పదే పదే తీసుకోవాలనే కోరిక కూడా తగ్గుతుంది. తాజా పండ్లు, కూరగాయలలో ఎక్కువగా ఫైబర్, నీటి శాతం ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు, మలబద్దకం నివారణకు, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉన్న ఆహారం చాలా ముఖ్యం.
పిండి పదార్థాలు!
వీటిలో రెండు రకాలు ఉంటాయి. శుద్దిచేయబడినవి, శుద్ధి చేయబడనివి. సహజంగా పూర్తిస్థాయి కార్బోహైడ్రేట్ లు కేలరీలు ఎక్కువ కలిగి ఉంటాయి. అదే ఫైబర్ తో కూడుకున్న పిండిపదార్థాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు పాస్తా, నూడుల్స్ వంటివి ఒక కప్పుడు తినడం కంటే ఓట్స్ సగం కప్పు తిన్నా పుష్టి కలిగిన భావన వస్తుంది. దీనివల్ల ఆకలి తీరడం మాత్రమే కాదు కండరాల పుష్టికి, వాటి పనితీరుకు కూడా ఉపయోగపడుతుంది.
ఆహారంలో ఉన్న కొవ్వులు!
సహజంగా ఆహారంలో కొవ్వులు ఉంటాయి. అవి ఆకలి నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి కూడా. కొవ్వులు ఉన్న ఆహారం తీసుకుంటే ప్రోటీన్స్, పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల లభించే కేలరీల కంటే ఎక్కువ శరీరానికి అందుతాయి. అయితే ఈ సమస్య అంతా ప్రాసెసింగ్ ఫుడ్ లో ఉంటుంది. అంతకు ముందే పాక్ చేయబడిన ఆహారాలు, బేకరీ ఫుడ్ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిలో ఈ కొవ్వు శాతం గణనీయంగా ఉంటుంది. కానీ ఇంటి ఆహారంలో ఇది అంత మోతాదులో ఉండదు. కారణం ఇంటి ఆహారంలో కల్తీ ఎక్కువ ఉండదు. పైగా నూనెలు మళ్ళీ మళ్ళీ ఎక్కువ సార్లు కాచడం, వాటిని ఉపయోగించడం వంటివి ఉండవు.
ఆహారం ఎంపిక!
చాలామంది బరువు తగ్గాలని అనుకునేవారు ద్రవపదార్థాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కారణం ఏమిటంటే వాటి వల్ల కేలరీలు తాత్కాలికంగా ఉంటాయి, ఇంకా కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఈ కారణం వల్ల అధికశాతం బరువు తగ్గాలని అనుకునేవారు ద్రవాల వైపు వెళతారు. కానీ ఇది చాలా తప్పు. ద్రవాలు కేవలం తాత్కాలిక ఉపశమనంలా పని చేస్తాయి. అదే ఘనమైన ఆహారం కొంచెం తీసుకున్నా ఆకలిని చాలా సేపటి వరకు నియంత్రించుకోవచ్చు. అందుకే ఘనమైన ఆహారం తీసుకున్నా చిన్న చిన్న మొత్తాలలో తీసుకుంటే బరువు తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని చెబుతారు.
ఇలా బరువు తగ్గడానికి ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలికాని ఆహారాన్ని వదిలిపెట్టి కడుపు కాల్చుకోకూడదు.
◆నిశ్శబ్ద.