మీ షాంపూలో ఉప్పు ఉందా...
మీ షాంపూలో ఉప్పు ఉందా!
అందంగా కనిపించేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.... జుట్టు కనుక ఆరోగ్యంగా లేకపోతే, కష్టమంతా వృధా అయిపోతుంది. జుట్టుకి ఇంత ప్రాముఖ్యత ఉంది కనుకనే టీవీల్లో కనిపించే ప్రకటనల్లో ఎక్కువశాతం షాంపూలవే ఉంటాయి. కానీ ఓ చిన్నపాటి చిట్కాను పాటిస్తే ఖరీదైన షాంపూలతో కూడా పొందలేని అందమైన జుట్టు మన సొంతమంటున్నారు. అదే- షాంపూతో పాటుగా సముద్రపు ఉప్పుని (రాతి ఉప్పు) కూడా ఉపయోగించడం!
డాండ్రఫ్ తొలగిపోవాలంటే..
పొల్యూషన్, జిడ్డు చర్మం, ఒత్తిడి... ఇలా డాండ్రఫ్ వచ్చేందుకు ఎన్ని కారణాలన్నా చెప్పవచ్చుగాక! కానీ అది ఒకరకమైన ఫంగస్ వల్ల ఏర్పడుతుందన్నది అందరూ ఒప్పుకునే మాటే! షాంపూ చేసేముందు జుట్టుని పాయలు పాయలుగా విడదీసి మాడుకి కాస్త ఉప్పుని పట్టించి, ఓ పదినిమిషాల పాటు రుద్దితే డాండ్రఫ్ సమస్య తీరిపోతుందంటున్నారు. ఉప్పుతో రుద్దినప్పుడు ఫంగస్ ఎలాగూ తొలగిపోతుంది. మాడు మీద ఉండే మృతకణాలన్నీ కూడా వదిలిపోతాయి. దాంతో డాండ్రఫ్ దూరమైపోతుంది.
జుట్టు ఒత్తుగా పెరగాలంటే...
జుట్టు రాలిపోతుంటే కాస్తంత ఉప్పుతో మర్దనా చేసే చిట్కా చాలా ఏళ్ల నుంచి కనిపించేదే! జుట్టు కుదుళ్ల దగ్గర తగినంత రక్తప్రసారం లేకపోవడం కానీ, ఆ రక్తప్రసారంతో పాటుగా తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల కానీ అనేక సమస్యలు ఏర్పడతాయి. జుట్టు ఊడిపోవడం, వెంట్రుకలు సన్నగా మారిపోవడం, తెల్లబడటం వంటి ఇబ్బందులు మొదలవుతాయి. షాంపూకి ముందు ఉప్పుతో కాస్త మసాజ్ చేయడం వల్ల మాడు మీద రక్తప్రసారం మెరుగవుతుంది.
మృదువైన జుట్టు కోసం...
కొంతమంది అసలు నూనె రాయకపోయినా కూడా నిరంతరం జుట్టు జిడ్డోడుతూ ఉంటుంది. దీనివల్ల డాండ్రఫ్ లాంటి సమస్యలు ఎలాగూ తప్పవు. చూసేందుకు కూడా వారి జుట్టు అంత ఆరోగ్యంగా ఉండదు. షాంపూలో సగందాకా ఉప్పుని కలిపి రుద్దుకోవడం వల్ల మురికి, జిడ్డు అన్నీ వదిలిపోతాయని అంటున్నారు. పైగా మాడు మీద ఉండే నూనెగ్రంధులలోని జిడ్డునంతా ఈ ఉప్పు లాక్కుని వచ్చేస్తుందని భరోసా ఇస్తున్నారు.
షాంపూ చేసేటప్పుడు ఉప్పుని కూడా ఉపయోగించడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయన్నమాట. అయితే ఇలా ఉప్పుని మాడుకి రుద్దేటప్పపుడు అది మరీ గరుగ్గా లేకుండా చూసుకోమని హెచ్చరిస్తున్నారు. పైగా షాంపూ చేసే ప్రతిసారీ ఇలా ఉప్పుతో రుద్దుకుంటూ ఉండే అసలుకే మోసం వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. మనకి కనిపిస్తున్న ఫలితాన్ని బట్టి ముందూవెనుకగా అప్పుడోసారి, అప్పుడోసారి ఈ చిట్కాను పాటించి చూస్తే తప్పకుండా ఫలితం దక్కుతుంది.
- నిర్జర.