నురగ వినాయకుడు ( వినాయక చవితి ప్రత్యేకం )
నురగ వినాయకుడు (వినాయక చవితి ప్రత్యేకం
వినాయక చవితికి వినాయకుడికి చక్కగా పూజ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కదా? మరి ఈ సందర్భంగా ఒక విశేష వినాయక ఆలయాన్ని గురించి చెప్పనా?
ఈ మధ్య వినాయక చవితి ఉత్సవాల్లో స్వీట్స్ తో, కాయగూరలతో, పూలతో, చెరుకుగళ్ళతో, డబ్బులతో, .....ఇలా ఒకటేమిటి అనేక రకాల వినాయక విగ్రహాలను ఎంతో అందంగా మలచటం చూస్తున్నాం కదా. ఇప్పుడేమో పర్యావరణ పరి రక్షణ దృష్టిలో వుంచుకుని మట్టి వినాయకుళ్ళనే పూజించమంటున్నారు. ఈ పర్యావరణ పరి రక్షణ అనేది ఇప్పుడే కాదు, పూర్వం వాళ్ళూ అనుసరించినట్లున్నారు. అందుకేనేమో మరి సముద్ర నురగతో కూడా వినాయకుణ్ణి తయారు చేశారుట. ఆయన గురించే నేను చెప్పబోతున్నాను.
సముద్ర నురగతో వినాయకుణ్ణి తయారు చేయటం ఏమిటి, మరీ ఇంత అతిశయోక్తులు పనికిరావంటారా!? ఇది, ఇవాళ నేను చెప్పింది కాదండీ. ఎన్నో వేల ఏళ్ళనుంచి వస్తున్న పురాణగాధ, అనేక తరాలనుంచీ భక్తులు నమ్మి కొలిచిన దైవ చరిత్ర. నిజ నిరూపణ ఇప్పుడు మనం చెయ్యలేకపోయినా విశేషాలను తెలుసుకోవచ్చుకదా. మరి చదవండి.
తమిళనాడులో, కుంభకోణానికి 6 కి.మీ. ల దూరంలో, స్వామిమలై వెళ్ళే మార్గంలో వున్నది తిరువలన్ జులి. ఇది తంజావూర్ జిల్లా, కుంభకోణం తాలూకాలోని ఒక గ్రామం. ఇక్కడే, తన తల్లి తండ్రులతో సహా కొలువు తీరాడు పాల సముద్ర నురగతో తయారు చేయబడిన శ్వేత వినాయకుడు. వైట్ వినాయగర్ కోవెల అంటే ఆ ప్రాంతంలో ఎవరైనా చెబుతారు.
విశాలమైన ఆవరణలో వున్న చిన్న గుడి ఇది. ఈ ఆలయం ఇక్కడ విలసిల్లటానికి వెనుక కధ చెప్పుకోవాలి కదా. దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని మధించిన కధ మీకు తెలుసుకదా. అయితే ఏ కార్యక్రమం మొదలు పెట్టటానికైనా చేయవలసిన వినాయక పూజని చెయ్యటం దేవతలు మరిచి పోయారుట. అందుకే సముద్ర మధనంలో ముందు హాలాహలం పుట్టిందిట. శివుడిని ప్రార్ధించిన దేవతలు ఆయన సహాయంతో తమ కష్టాన్ని దాటి, ఆయన ద్వారా తమ పొరపాటును తెలుసుకుని, పాల సముద్రం నురగతో వినాయకుణ్ణి తయారు చేసి, పూజించారుట. తర్వాత కధ కూడా మీకు తెలిసిందే.
తర్వాత ఇంద్రుడు అహల్య సంఘటనతో వచ్చిన శాపాన్ని పోగొట్టుకోవటానికి ఈ శ్వేత వినాయకుడితో అనేక ప్రదేశాలలో శివార్చన చేస్తూ ఇక్కడికి వచ్చాడుట. శ్వేత వినాయకుడికి ఇక్కడ వుండాలనిపించి దాని కోసం తన తండ్రి సహాయం అడిగాడుట. శివుడు చిన్న పిల్లాడి రూపంలో ఇంద్రుడి దగ్గరకు వచ్చాడుట. ఇంద్రుడు శ్వేత వినాయకుణ్ణి ఆ బాలుడి చేతికిచ్చి తాను శివార్చన ముగించుకు వచ్చేదాకా కింద పెట్టవద్దని చెప్పి వెళ్ళాడు. కానీ ఆ బాలుడు శ్వేత వినాయకుణ్ణి అక్కడ వున్న బలిపీఠం కింద పెట్టి వెళ్ళి పోయాడుట. తిరిగి వచ్చిన ఇంద్రుడు శ్వేత వినాయకుణ్ణి అక్కడనుంచి తీసుకెళ్ళాలని అనేక ప్రయత్నాలు చేసి భంగ పడ్డాడు. దేవ శిల్పిని రప్పించి రధం తయారు చేయించి, వినాయక విగ్రహం వున్న ఆ ప్రదేశాన్నే తీసుకు వెళ్ళాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో అశరీరవాణి ద్వారా శ్వేత వినాయకుడు అక్కడే వుండ దల్చుకున్నాడని, ప్రతి వినాయక చవితికీ వచ్చి ఆయనని పూజించమని, దానితో ఆయనని రోజూ పూజించిన ఫలితం వస్తుందని చెప్పింది. అందుకే ప్రతి వినాయక చవితికి ఇంద్రుడు ఇక్కడికి వచ్చి వినాయకుణ్ణి పూజిస్తాడని భక్తుల నమ్మకం.
శ్వేత వినాయకుడిది చిన్న విగ్రహమే. ఈ వినాయకుడి విగ్రహం సముద్ర నురగతో తయారుకాబడటంతో ఈ విగ్రహానికి వస్త్రాలు కట్టరు, పూలు పెట్టరు, అభిషేకాలు వగైరా ఏ విధంగానూ విగ్రహాన్ని తాకరు. కేవలం పచ్చ కర్పూరం పొడి మాత్రం చల్లుతారు, అదీ చెయ్యి తగలకుండా.
వినాయకుడు ఇక్కడ ఇంద్రదేవి కమలాంబాల్ (మహా విష్ణువు కళ్ళనుంచి పుట్టింది), బుధ్ధి దేవి (బ్రహ్మ వాక్కునుంచి పుట్టింది) అనే వారిని వివాహం చేసుకున్నాడుట. అందుకే ఇక్కడ ఈ స్వామిని సేవిస్తే వివాహ విషయాలలో వున్న అడ్డంకులు తొలగి పోతాయని భక్తుల నమ్మకం.
ఈ ఆలయం వెనుక కపర్దీశ్వరార్, బృహన్నాయకిల ఆలయాలు వున్నాయి. బహుశా ఆ ఆలయాలు వినాయకుడి ఆలయంకన్నా ముందునుంచీ వున్నాయి. వాటి గురించి ఇంకోసారి.
పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)