భాద్రపద మాసం విశిష్టత ఏమిటి
భాద్రపద మాసం విశిష్టత ఏమిటి
శ్రావణమాసం వెళ్లిపోయింది. మంగళగౌరి నోము, వరలక్ష్మి వ్రతాలతో సందడిగా ఉన్న ఇళ్లన్నీ ఒక్కసారి నిశ్శబ్దంగా మారిపోయాయి. కానీ శ్రావణం తర్వాత వచ్చే భాద్రపదమూ ప్రత్యేకమే! భాద్రపదంలో ఒకో రోజు గడిచేకొద్దీ ఊరంతా హోరెత్తిపోతుంది. మరి వినాయక చవితి వచ్చేది ఈ నెలలోనే కదా! ఆ చవితి రోజున స్వామి రూపాన్ని మట్టితో రూపొందించి, ఆ రూపాన్ని పత్రితో పూజిస్తాం. సర్వ శుభాలనూ కలిగించే ఆ విఘ్నాధిపతిని పూర్తిగా ప్రకృతితోనే పూజించి, ప్రకృతిలోనే నిమజ్జనం చేయడం ఈ పండుగకే ప్రత్యేకం.
ఒక్క చవితే కాదు, భాద్రపదంలో ప్రతి తిథీ ప్రత్యేకమే! వినాయక చవితి తర్వాత వచ్చే పంచమిని రుషిపంచమి అని పిలుస్తారు. ఆ రోజున స్త్రీలంతా సప్తర్షులని పూజిస్తూ ఉపవాసం ఉంటారు. అలా చేస్తే... రుషుల అనుగ్రహంతో వారిలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఆ తర్వాత వచ్చే సూర్యషష్టి, లలితా సప్తమి, రాధాష్టమి తిథులలో ఆయా దేవతలని పూజిస్తారు. ఇలా ఒకో తిథినీ దాటుతూ పరివర్తన ఏకాదశి వస్తుంది.
తొలిఏకాదశి రోజున శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తి, పరివర్తన ఏకాదశి రోజున మరోపక్కకి ఒత్తిగిలుతాడని అంటారు. అందుకే ఈ రోజుకి ‘పరివర్తన ఏకాదశి’ అన్న పేరు వచ్చింది. కానీ ఈ పేరు వెనక చాలా నిగూఢ అర్థాలే కనిపిస్తాయి. ఆనాటికి రుతువులలో వచ్చే మార్పునీ, మనుషులలో పరివర్తన రావల్సిన అవసరాన్నీ అది సూచిస్తుంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తే... గృహస్థు జీవితంలో చేసిన పాపాలన్నీ నశించిపోతాయని చెబుతారు.
పరివర్తన ఏకాదశి మర్నాడే వామన జయంతి వస్తుంది. విష్ణుమూర్తి అవతారమైన వామనుడు ఉద్భవించింది ఈ రోజునే! వామనుడే కాదు, బలరాముడు, వరాహస్వామి కూడా ఈ మాసంలోనే అవతరించారని చెబుతారు. భాద్రపదమాసంలో మరో ప్రత్యేకత మహాలయ పక్షం. భాద్రపద పౌర్ణమి మర్నాడు నుంచి పదిహేను రోజుల పాటు ఈ మహాలయ పక్షం వస్తుంది. పితృదేవతలందరినీ ఈ కాలంలో తల్చుకోవడం ఆనవాయితీ.
భాద్రపదంలో పండుగలే కాదు... నోములు, వ్రతాలకి కూడా కొదవ లేదు. భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున వచ్చే అనంతపద్మనాభస్వామి వ్రతం ఇందులో ముఖ్యమైనది. ఈ రోజున ఆ పద్మనాభస్వామిని కొలిచినవారి కష్టాలన్నీ తీరిపోతాయని అంటారు. ఇదే కాకుండా ఉండ్రాళ్ల తద్ది నోము, ఉమామహేశ్వర వ్రతం కూడా గుర్తుంచుకోదగ్గవే!
ఇదీ భాద్రపదంలోని కొన్ని ప్రత్యేకతలు. ఇంత విశేషమైన మాసం కాబట్టే కొందరు అసలు కలియుగమే భాద్రపదంలో మొదలైందని నమ్ముతారు. భాద్రపదం అన్న పేరు కేవలం నక్షత్రాన్ని మాత్రమే సూచించదు. ఆ మాసంలో ప్రజలంతా ‘భద్రంగా’ ఉండాలన్న ఆలోచనతో ఆ పేరు పెట్టినట్లు తోస్తుంది.
- నిర్జర.