కోరినవారికి వరాలిచ్చే విజయవాడ కనకదుర్గమ్మ
కోరినవారికి వరాలిచ్చే విజయవాడ కనకదుర్గమ్మ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెజవాడ కనకదుర్గమ్మ కొలువైన (ఇంద్రకీలాద్రి) శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి.. అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. ఇక్కడ శ్రీచక్ర అధిష్టాన దేవత దుర్గమ్మగా వెలసింది! కోరినవారికి వరాలిచ్చే కొంగు బంగారంగా ‘బెజవాడ కనకదుర్గ’గా వాసికెక్కింది.
ఈ దుర్గ గుడి క్షేత్ర పాలకుడు. ఆంజనేయస్వామి. అందుకే ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా హనుమను దర్శించుకొని.. ఆపై అమ్మవారిని.. మల్లేశ్వరస్వామివారిని దర్శించుకుని.. ఆశీస్సులు పొందుతుంటారు.
ఇంద్రకీలాద్రి స్థలపురాణం.
త్రైలోక్యమాత.. దుర్గాదేవి లోకకంటకుడైన మహిషాసురుడిని సంహరించిన అనంతరం.. ఇంద్రాది దేవతల కోరికపై పరమ పవిత్రమైన ఇంద్రకీలాద్రి మీద మహామహిమాన్వితమైన మహిషాసుర మర్దిని రూపంలోనే స్వయంభువుగా వెలిసింది. ఇక్కడే 12వ శతాబ్దంలో విష్ణువర్దన మహారాజు అమ్మవారిని కొలిచినట్లు శాసనాలు చెబుతున్నాయి. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణ దేవరాయలు అమ్మవారిని దర్శించుకున్నట్లు చరిత్రలో ఉంది. ఉగ్ర స్వరూపిణిగా ఉన్న అమ్మవారిని శంకరాచార్యులు దర్శించుకుని శ్రీచక్రం వేసి శాంతి స్వరూపిణిగా మార్చారని స్థలపురాణంలో ఉంది.
పరిసరాల్లోని ఉపాలయాలు:
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వరాలయం, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరాలయం, నటరాజస్వామి ఆలయం ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాలను సందర్శించి భక్తితో పూజలు చేస్తారు.
దర్శన సమయాలు:
వేకువజామున 4 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం భోజన సమయంలో కాసేపు దర్శనాన్ని నిలిపివేస్తారు.
ఆలయంలో చేసే ప్రధాన పూజలు:
ఇంద్రకీలాద్రిపై ఖడ్గమాల, లక్ష కుంకుమార్చన, స్వర్ణపుష్పాలతో అర్చన, శ్రీ చక్రార్చన, చండీహోమం, శాంతి కల్యాణం ప్రధానపూజలు.
ఖడ్గమాల పూజ తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సేవలో పాల్గొనే భక్తులు రూ. 516 చెల్లించి వేకువజామున 4 గంటలకు ఆలయానికి చేరుకోవాలి. రెండుగంటల పాటు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ పూజ జరుగుతుంది. ఒక టిక్కెట్టుపై దంపతులను అనుమతిస్తారు.
మిగతా పూజలకూ రుసుం.. రూ. 516 మాత్రమే. ఈ పూజలు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి. ఒక టిక్కెట్టుపై దంపతులు పాల్గొనవచ్చు. ఈ పూజల కోసం ఉదయం 8 గంటలకే ఆలయానికి చేరుకోవాలి. ప్రధానమైన పూజల్లో స్వర్ణపుష్ప పూజ ఒకటి. ప్రతి గురువారం సాయంత్రం 5.15 గంటల నుంచి 6.30 గంటల వరకు అమ్మవారి అంతరాలయంలో 108 స్వర్ణపుష్పాలతో జరిగే ఈ పూజలో భక్తులు రూ. 2,500 చెల్లించి పాల్గొనవచ్చు. కేవలం ఏడు టిక్కెట్లు మాత్రమే ఇస్తారు.
రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 6.30 గంటల వరకు హారతుల సమయం. ఈ సమయంలో అమ్మవారి హారతులు తిలకించేందుకు రూ. 200 టిక్కెట్టు తీసుకుంటే.. ఒక టిక్కెట్టుపై ఇద్దరు చొప్పున అనుమతిస్తారు. స్థలాభావం కారణంగా కేవలం 20 టిక్కెట్లు మాత్రమే రోజూ సాయంత్రం 4 గంటల నుంచి దేవస్థానం అధికారులు కౌంటరులో విక్రయిస్తారు. దసరా ఉత్సవాలు, భవానీదీక్షలు, బ్రహ్మోత్సవాల సమయంలో కాకుండా ఈ పూజలు నిర్వహించుకోవచ్చు. పూజలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేషవస్త్రం, రవిక, లడ్డూప్రసాదం అందజేస్తారు.
దేవస్థానంలో నిర్వహించే పూజలు:
ఇంద్రకీలాద్రిపై దేవస్థానంలో పరిమిత దినాల్లో నిర్వహించే ప్రత్యేక పూజల్లో భక్తులు ఉచితంగా పాల్గొనవచ్చు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్బారు సేవ, ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రత్యేక సేవలు జరుగుతాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కృష్ణానదీ తీరాన దుర్గాఘాట్‌లో కృష్ణమ్మకు పంచహారతులు ఇస్తారు. ఈ హారతులను భక్తులంతా తిలకించవచ్చు. దసరా రోజుల్లో భవానీలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తారు.
అన్నప్రసాద వితరణ:
1991 నుంచి ఇంద్రకీలాద్రిని దర్శించుకునే భక్తులకు శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహిస్తోన్నారు. భక్తులు అందించిన విరాళాలను బ్యాంకుల్లో డిపాజిట్ చేసి వాటిపై వచ్చే ఆదాయంతో రోజూ 5 వేల మందికి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అన్నప్రసాద వితరణ చేస్తున్నారు.
రవాణా సౌకర్యాలు:
విజయవాడ.. రైలు.. రోడ్డు.. విమాన మార్గాల్లో అనుసంధానమై వుంది. కోల్‌కతా- చెన్నై జాతీయరహదారిపై ఉన్న నేపథ్యంలో విజయవాడకు దేశం నలుమూలల నుంచి రోడ్డుమార్గంలో చేరడం చాలా సులభం. ఆపై ఇక్కడి పండిట్ నెహ్రూ సెంట్రల్ బస్‌స్టేషన్ నుంచి ఇంద్రకీలాద్రిపైకి ప్రతి 10 నిమిషాలకో సిటీ/ మెట్రో బస్సు చొప్పున ఉన్నాయి. అలాగే ప్రైవేటు ఆటోలు.. క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. సొంత వాహనాల ద్వారా అమ్మవారి సన్నిధికి చేరుకోవచ్చు. అలాగే విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ఆర్టీసీ మెట్రో బస్సులతో పాటు ప్రైవేటు ఆటోలు.. క్యాబ్‌లు విస్తృతంగా లభిస్తాయి. గన్నవరం విమానాశ్రయం ద్వారా కూడా సుదూర ప్రాంతాల వారు సులభంగా విజయవాడ-ఇంద్రకీలాద్రిని చేరవచ్చు.