Read more!

దేవునితో `తాతా` అని పిలిపించుకున్నవాడు!

 

 

దేవునితో `తాతా` అని పిలిపించుకున్నవాడు!


భక్తుడు భగవంతుని ఆర్తిగా పలురకాలుగా పిలుచుకుంటాడు. తన మనసుకి తోచిన బంధంతో పరమేశ్వరుని కొలుచుకుంటాడు. కానీ భగవంతుడే భక్తుని తాతా అని పిలుచుకున్న ఓ అరుదైన సందర్భం ఉంది. ఆ భగవంతుడు శ్రీనివాసుడైతే, భక్తుడు `తిరుమలనంబి`! తిరుమలనంబి ఎవరో కాదు… రామాను జాచార్యులకి మేనమామ! రామాను జాచార్యులు జన్మించగానే, వారిని చూసి ఇతడు సాక్షాత్తూ లక్ష్మణుని అవతారమనీ, కలియుగంలో అద్భుతాలు సాధిస్తాడనీ ఊహించినవారు తిరుమలనంబి. తిరుమలనంబి అసలు పేరు `శ్రీశైలపూర్ణుడు`. ఒకవైపు తన మేనల్లుడైన రామానుజాచార్యుల భవిష్యత్తుకి తగు సూచనలు అందిస్తూనే, ఆయన శ్రీరంగంలో ఉన్న యమునాచార్యులు అనే గురువుగారి వద్ద ఆధ్మాత్మిక జ్ఞానాన్ని అభ్యసించసాగారు. గురువుగారు తరచూ తిరుమల శ్రీనివాసుని తల్చుకోవడం గమనించారు తిరుమలనంబి. దాంతో కొన్నాళ్లపాటు తిరుమలలో గడిపి రావాలన్న కోరిక ఏర్పడింది.

 

అలా తిరుమలకు చేరుకున్న తిరుమలనంబి, ఏడుకొండల మధ్య కొలువైన శ్రీనివాసుని వైభవం చూసి ఇక వెనక్కి వెళ్లలేదు. ఆయన జీవితాంతమూ శ్రీవారి ఆలయంలో జరిగే సేవలకు తన వంతు సాయాన్ని అందిస్తూ గడిపేశారు. తిరుమలనంబి ప్రతిరోజూ శ్రీవారి

అభిషేకం కోసమని ఎంతో దూరంలో ఉన్న పాపవినాశనం అనే తీర్థం నుంచి జలాలను తీసుకువచ్చేవారట. ఏళ్లు గడుస్తున్నా, ఒంట్లో సత్తువ తగ్గిపోతున్నా తిరుమలనంబి తన దినచర్యను మార్చుకోలేదు. జోరున వర్షాలలో, జారిపోయే రాతిగుట్టల మీద నడుస్తూ జలాన్ని తెచ్చేవారు. రాళ్లు ముళ్లల్లా గుచ్చుకుంటున్నా మనసులో శ్రీనివాసుని తలచుకుని నడకని సాగించేవారు. పాపవినాశనం నుంచి తీర్థాన్ని తెచ్చి శ్రీవారి పాదాలను కడిగితే కానీ ఆయనకు రోజు గడిచినట్లు ఉండేది కాదు.

అలాంటి తిరుమలనంబిని ఓసారి ఆటపట్టిద్దామనుకున్నారట శ్రీవారు. లీలామానుషరూపునికి ఆటలంటే మహా ఇష్టం కదా! ఒకరోజు యథావిధిగా తిరుమలనంబి ఒక మట్టికుండలో పాపవినాశనం నుంచి జలాన్ని నింపుకొని వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఆ సమయంలో ఆయనకు వేటగాని రూపంలో ఎదురుపడ్డాడు శ్రీనివాసుడు. `తాతా! కుండునిండా నీళ్లు మోసుకుపోతున్నావు కదా, నాకు కాసిని నీళ్ల ఇయ్యవా?` అని అడిగాడట.

 

`కాస్త నడిస్తే నీకే ఎక్కడో ఓ చోట నీళ్లు దక్కుతాయి. పోయి తాగు! నాకు అభిషేకానికి వేళ మించిపోతోంది.` అని బదులిచ్చాడట తిరుమలనంబి. ఒకటికి రెండుసార్లు ఈ సంభాషణ గడిచిన తరువాత, తిరుమలనంబి ఆ వేటగాని దాటుకుని ముందుకు సాగాడు. వేటగానిలా ఉన్న వేంకటేశుడు అక్కడితో ఊరుకోలేదు. తిరుమలనంబి వెనకే చేరి అతని కుండకి తన బాణంతో బెజ్జం చేసి హాయిగా అందులో నీటిని తాగేశాడు. జరిగింది తెలుసుకున్న తిరుమలనంబి కుప్ప కూలిపోయాడు. ఏళ్లకు ఏళ్లుగా జరుగుతున్న అభిషేకానికి విఘ్నం వాటిల్లిందే అని బాధపడుతూ, తిరిగి తీర్థాన్ని తీసుకువచ్చేందుకు పాపవినాశనానికి బయల్దేరాడు.

`తాతా! తీర్థజలం కోసం అంత దూరం మళ్లీ ఏం పోతావు. ఇక్కడికి దగ్గరలోనే మరో తీర్థం ఉంది. చూపిస్తాను రా!` అంటూ తన వెంట తీసుకుపోయాడు వేటగాడు. అటూఇటూ ఎంత తిరగినా తీర్థం కనిపించడాయే! అభిషేకానికి ఓ పక్క వేళ మించిపోతోంది. అలా కాసేపు తిరుమలనంబిని అడవిలోనే తిప్పించిన శ్రీవారు `ఇక్కడ ఏ తీర్థమూ ఉన్నట్లు లేదు. ఉండు నేనే ఏదో ఒక ఏర్పాటు చేస్తాను` అంటూ తన బాణాన్ని ఒక కొండ మీదకు సంధించారు. అప్పుడు ఏర్పడిన తీర్థమే `ఆకాశగంగ`! ఆ సంఘటనకు గుర్తుగా ఇప్పటికీ తిరుమలనంబి వారసులు ఆకశగంగ జలాలతో శ్రీవారి పాదాలను అభిషేకిస్తుంటారు. తిరుమలనంబికీ శ్రీవారికీ ఉన్న అనుబంధానికి గుర్తగా, శ్రీవారి ఆలయానికి చేరువలోనే ఆయనకు కూడా ఒక చిన్న గుడిని నిర్మించారు.

 

 

 

- నిర్జర.