Varalakshmi Vratham Naivedyam Recipes
Varalakshmi Vratham Naivedyam Recipes
పూర్ణాలు
కావలసిన వస్తువులు:
మినప్పప్పు - ఒక కప్పు.
బియ్యం - రెండు కప్పులు.
పచ్చిశనగపప్పు - ఒక కప్పు.
బెల్లం - ఒక కప్పు.
పంచదార - ఒక కప్పు.
ఏలకుల పొడి - ఒక టీ స్పూను.
నెయ్యి - రెండు టీ స్పూన్లు.
నూనె - సరిపడినంత.
తయారు చేసే విధానం:
బియ్యాన్ని, మినప్పప్పును విడివిడిగా నానబెట్టాలి. మూడు గంటల తర్వాత రెండింటినీ
కలిపి అందులో చిటికెడు ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. రుబ్బేటప్పుడు నీళ్లు ఎక్కువ కాకుండా
జాగ్రత్త పడాలి. దోసెల పిండిలాగా మెత్తగా రావాలి. కాని అంత పలుచగా ఉండకూడదు.
గారెల పిండికంటే కొంచెం లూజుగా ఉండేటట్లు చూడాలి. రుబ్బిన తరువాత ఈ మిశ్రమం
ఒక రాత్రంతా నానాలి. పూర్ణాలు చేయడానికి ముందురోజు నుంచే ప్రిపరేషన్
మొదలవ్వాల్సి ఉంటుంది. శనగపప్పును కడిగి పది నిమిషాల సేపు నానిన తర్వాత ప్రెషర్
కుక్కర్‌లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడికిన పప్పులో ఉన్న నీటిని
వడపోయాలి. శనగపప్పులో బెల్లం పొడి, పంచదార వేసి చిన్న మంట మీద ఉడికించాలి.
బెల్లం, పంచదార ముందు కరిగి నీరవుతాయి. అవి తిరిగి దగ్గరయ్యే వరకు అడుగుకు
పట్టకుండా గరిటతో తిప్పుతూ ఉడికించాలి. కొద్ది సేపటికి శనగపప్పు, బెల్లం, పంచదార అన్నీ
కలిసిపోయి ముద్దయిన తరువాత దించేయాలి. దించిన తరువాత ఏలకులపొడి, నెయ్యి
వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూలుగా చేయాలి. నూనె మరిగిన
తరువాత ఒక్కొక్క లడ్డూను ముందు రోజు రుబ్బి సిద్ధంగా ఉంచిన మినప్పిండి
మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి. పూర్ణాల తయారీలో నైపుణ్యం ఇక్కడే ఉంటుంది.
లడ్డూ నలగకుండా మినప్పిండిలో ముంచి తీసి నూనెలో వేయాలి. ఇలా వేసేటప్పుడు
మినప్పిండి మిశ్రమం అన్ని వైపులా సమంగా పట్టాలంటే మూడువేళ్లతో వేయాలి. ఇలా
చేస్తే పూర్ణం చక్కటి రౌండ్‌లో చూడడానికి అందంగా ఉంటుంది. నూనెలో అన్ని వైపులా
సమంగా వేగేటట్లు తిప్పుతూ దోరగా వేగిన తరువాత తీసుకోవాలి.
గారెలు
కావలసిన వస్తువులు:
మినపప్పు - 1 డబ్బా.
అల్లం - చిన్న ముక్క.
పచ్చి మిర్చి - 8.
ఉల్లిపాయలు - 2.
నూనె - వేయించటానికి సరిపడినంత.
ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం:
మినపప్పు శుభ్రంగా కడిగి, గట్టిగా, ఎక్కువ నీరు వెయ్యకుండా, మెత్తగా లేక కొంచం
పొలుకుగా కావలనుకునే వారు పొలుకుగా పిండి వేయించుకోవాలి. ఆ తరువాత పొయ్యి
మీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన తరువాత ఒక కవర్ తీసుకొని దానిమీద గారెల
పిండిని ముద్దగా పెట్టి వెడల్పుగా వత్తి నూనెలో వెయ్యాలి. అవి బాగా కాలిన తరువాత
తియ్యాలి, అలానే ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం ముక్కలుగా చేసి అందులో
కలపుకొని గారెలు వేసుకోవచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు క్యాబేజి కూడా వేసుకోవచ్చు చాలా
రుచిగా ఉంటాయి.
పరమాన్నం
కావలసిన వస్తువులు:
బియ్యం - 1కప్పు.
పాలు - ఒక లీటరు.
బెల్లం లేదా పంచదార - 1/4 కిలో.
యాలకుల పొడి - 1/2 చెంచా.
జీడిపప్పులు, కిస్ మిస్ - 10 నెయ్యి - 1గరిటెడు.
తయారు చేసే విధానం:
బియ్యం బాగా కడిగి పెట్టుకోవాలి. రెండు కప్పుల నీళ్ళు మరిగించి బియ్యం అందులో వేసి
ఉడికించాలి. నీళ్ళు ఇంకుతున్నప్పుడు లీటరుపాలు పోసి బాగా ఉడికించాలి.
ఉడుకుతున్నప్పుడే నెయ్యి వేసుకోవాలి. పాలు బాగా చిక్కబడి దగ్గరికి అయిన తరువాత
బెల్లం పొడివేసి మరికాసేపు ఉడికించాలి. నేతిలో వేయించిన జీడిపప్పువేసి, యాలకుల పొడి
కూడా వేసి స్టౌమీద నుంచి దించాలి.
పులిహోర
కావలసిన వస్తువులు:
బియ్యం - 1 cup
చింతపండు,
పసుపు - 1 tablespoon
వేయించిన వేరుశెనగపప్పు - 2 - 3 tablespoons
ఉప్పు నూనె పోపు కొరకు ఆవాలు - 1 teaspoon
పచ్చి శెనగపప్పు - 1 tablespoon
జీల కర్ర - 1 tablespoon
ఎండు మిరపకాయలు - 4
తయారు చేసే విధానం:
ముందుగ బియ్యం ని 2 cups నీళ్ళు పోసి ఉడక పెట్టుకోవాలి. ఉడికించిన అన్నం ని
పక్కన చల్లారి పెట్టుకోవాలి పసుపు , ఉప్పు వేసి కలుపుకోవాలి. చింతపండు ని వేడి నీళ్ళల్లో
నాన పెట్టి రసం తీసి పెట్టుకోవాలి వేరే బౌల్ తీసుకొని అందులో చింతపండు రసం పోసి
చిక్కగా అయ్యే వరకు ఉడక పెట్టుకోవాలి వేరే పాన్ తీసుకొని తగినంత నూనె పోసి కాగాక
ఆవాలు వేసుకోవాలి. తరువాత పచ్చి శెనగపప్పు ని వేయించాలి. వేగాక జీలకర్ర ని,
వేరుశెనగపప్పు ని, ఎండు మిరపకయాలని వేసి ఒక నిముషం పాటు వేయించాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని అన్నం లో కలపాలి. తరువాత చింతపండు రసం ని బాగా
కలపాలి.
బొబ్బట్లు
కావలసిన వస్తువులు:
శెనగపప్పు - అరకేజీ
ప౦చదార - అరకేజీ
మైదాపి౦డి - అరకేజీ
యాలకులు - పదిహేను
నూనె - పావుకేజీ
నెయ్యి - పావుకేజీ
తయారు చేసే విధానం:
బొబ్బట్లు చెయ్యడానికి మూడు నాలుగు గంటల ముందే చోవికి మైదా పిండి కలుపుకొని
పెట్టుకోవాలి. మైదా పిండిలో నీరు పోసి మామూలుగా మనం పూరీలకి, చపాతిలకి పిండి
కలుపుకున్నట్టే కలుపుకోవాలి. పిండి కలుపుకున్నాక అందులో వంద గ్రాములు పైగానే
నూనె పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నూనెలో పిండి ఎంత నానితే అంత మెత్తగా
బొబ్బట్లు వస్తాయి. ఇప్పుడు ఒక గిన్నెలో శెనగ పప్పు వేసి పప్పు మునిగే దాక నీరు పోసి
గాస్ మీద పెట్టాలి. పప్పు మెత్త పడే దాకా ఉడికించాలి. ఉడికే లోపు నీరు అయిపోతే మళ్ళీ
పోసుకోవచ్చు. పప్పు ఉడికాక మాత్రం గిన్నెలో నీరు ఉండకుండా చూసుకోవాలి. ఒక వేళ
నీరు ఉండిపోతే అవి ఇగిరిపోయే వరకు పప్పుని గాస్ మీదే ఉంచి కదుపుతూ ఉండాలి.
ఇప్పుడు పప్పుని ఒక ప్లేట్ లో తీసుకోవాలి . అర కిలో బెల్లం తీసుకొని తరుగుకోవాలి. తీపి
ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక వంద గ్రాములు బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు తరిగిన బెల్లాన్ని
పప్పులో వేసి రెండు ఆర నివ్వాలి. యాలకుల పొడి అందులో కలుపుకోవాలి. పప్పు
చల్లారాక మిక్సీ లో వేసి బాగా మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి.రుబ్బిన పిండిని తీసి
చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి . ఇప్పుడు నానిన మైదా పిండిని తీసుకొని, చిన్న
పూరి అంత వత్తుకొని ( చేత్తోనే ) ఇందాక మనం చేసి పెట్టుకున్న పూర్ణం ఉండలు పూరి
మద్యలో పెట్టాలి.ఆ ఉండని మొత్తం చుట్టూరా ఉన్న పిండి తో మూసెయ్యాలి. ఇప్పుడు ఒక
పాలిథిన్ షీట్ కానీ అరటి ఆకు ఉన్న వాళ్ళు ఆకుని కానీ తీసుకొని, దానికి నూనె లేదా
నేయ్యి రాసి ఇందాక చేసిన ఉండని దాని మీద పెట్టి చేత్తో చపాతీ లాగా వత్తుకోవాలి.అలా
వత్తుకున్న దాన్ని పెనం మీద వేసి, కాస్త నెయ్యి వేసి కాల్చుకోవాలి.
వడపప్పు
కావలసిన వస్తువులు:
పెసరపప్పు - 1 కప్పు
కారం పొడి 1/2 tsp
ఉప్పు చిటికెడు కొబ్బరి తురుము 1 tbsp
పచ్చిమిర్చి తురుము1/2 tsp
కొత్తిమిర తురుము 1 tsp
తయారు చేసే విధానం:
పప్పును గంట సేపు నానబెట్టి నీరంతా వడకట్టి అందులో కారం, ఉప్పు, క్యారట్ తురుము,
పచ్చిమిర్చి తురుము,కొత్తిమిర తురుము మీకు కావలసినంత వేసి కలపండి. అంతే
వడపప్పు నైవేద్యం రెడీ.
చలివిడి
కావలసిన వస్తువులు:
బియ్యం - రెండు కప్పులు బెల్లం లేదా పంచదార- కప్పు
కొబ్బరి ముక్కలు - రెండు టేబుల్ స్పూన్లు
ఏలకులు- 5
నెయ్యి - నాలుగు టేబుల్ స్పూన్లు
నీళ్ళు - రెండు కప్పులు
జీడిపప్పు - 10
తయారు చేసే విధానం:
ముందుగా బియాలి నీళ్ళలో 8 గంటల పాటు నానబెట్టి, నీళ్ళు వంచి బియ్యాన్ని ఒక్క
పొడి వస్త్రం పై ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత గ్రైండర్ లో మెత్తని పిండిలా చేసుకోవాలి. 2
కప్పుల నీళ్ళు, పంచదార లేదా బెల్లం వేసి తీగ పాకంలా చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఆ
పాకంలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. నెయ్యివేసి దగ్గరగా
అయ్యేదాకా ఉడికించాలి. వేరే పాన్ లో నెయ్యి వేసి కొబ్బరి ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చే
వరకు వేయించాలి. ఏలకుల పొడిని చలివిడిలో కలుపుకోవాలి. చివరగా వేయించిన
కొబ్బరిముక్కలు, జీడిపప్పుతో చలివిడి అలంకరించుకోవాలి.