Read more!

వామన జయంతి ...

 

వామన జయంతి ...

 

 

వ్యాసుడు చేత రచింపబడ్డ పద్దెనిమిది పురాణాలలొ వామన పురాణం ఒకటి. శ్రీమహావిష్ణువు త్రివిక్రమ స్వరూపుడైన బలి చక్రవర్తిని పాతళ లోకానికి పంపిన ఐదవ అవతారమైన వామన అవతారంపై ఆధారమైనది ఈ పురాణం. ఈ పురాణం పూర్వ భాగం ఉత్తర భాగం అంటే రెండు భాగాలుగా విభజింపబడింది. పూర్వభాగంలొ 10 వేల శ్లోకాలు ఉన్నాయి, ఉత్తరభాగం ఇప్పుడు లభించడం లేదు. ఈ పురాణంలో శ్లోకాలే కాకుండా గద్య భాగాలు కూడా ఉన్నాయి. పూర్వభాగంలొ 97 అధ్యాయాలు ఉన్నాయి. కురుక్షేత్రంలోని బ్రహ్మ సరోవరాన్ని విశేషంగా 28 అధ్యాయలలొ సరో మహత్యంగా అనే పేరుతో వర్ణింపబడుతుంది. బలి చక్రవర్తి జరిపిన యజ్ఞం కురుక్షేత్రంలొ జరిపినట్లు చెప్పబడింది. ఈ పురాణానికి ప్రధాన వక్త పుల్యస్తుడు శ్రోత నారదుడు.

వామన అవతారం

 

 

 

పఙ్చదశమ్ వామనకమ్ కృత్వాగాద్ అధ్వరమ్ బకేః |
పదత్రయమ్ యాచమానః ప్రత్యాదిత్సుః త్రిపిష్టపమ్ ||

ధర్మానికి భంగం కలిగినప్పుడల్లా తాను అవతరించి ధర్మసంస్థాపన చేస్తానని శ్రీ కృష్ణుడు గీతలో ప్రబోధించాడు. ఈ గీతావాక్కుకు ప్రతిబింబమే దశావతారాలలో ఒకటైన వామనావతారం. వామనుడి అవతార చరితలో బలి, వామనుల సంభాషణలో దురాశ పడకూడదని, తృప్తే మోక్షానికి సాధనమని తెలిపే చక్కటి సందేశం ఇమిడి ఉంది.

 

 

పూర్వం యుద్ధంలో దైత్యరాజైన బలిచక్రవర్తి, ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుడిని శరణువేడుకున్నాడు. కొంతకాలము గడిచిన తర్వాత గురుకృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించాడు. దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అదితిదేవిని శరణుకోరాడు. ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితిదేవి దుఃఖించి పయోవ్రతానుష్టానము చేసింది. ఆ వ్రతం చివరిరోజున భగవానుడు ప్రత్యక్షమై అదితితో "దేవీ.. చింతించవద్దు నీకు నేను పుత్రునిగా జన్మించి, ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభము చేకూరుస్తానని" పలికి అదృశ్యమవుతాడు.

 

 

ఇలా అదితి గర్భంలో భగవానుడు వామన రూపంలో జన్మించాడు. భగవంతుణ్ణి పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదు. భగవానుని వామనుడిగా బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించారు. వామనమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు. ఒకసారి బలి చక్రవర్తి భృగుకచ్ఛమను చోట అశ్వమేధ యజ్ఞము చేస్తున్నాడని వామనభగవానుడు విని అక్కడికి వెళ్ళాడు. బ్రహ్మ తేజస్సు, దివ్య యశస్సులతో వెలిగే వటుడైన వామనుడు దండాన్ని. గొడుగును, కమండలాన్ని ధరించి ఒకవిధమైన రెల్లుగడ్డితో మొలత్రాడుని, యజ్ఞోపవీతాన్నీ ధరించి, శరీరముపై మృగచర్మము, శిరస్సున జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపమున యజ్ఞమండపంలోకి ప్రవేశించాడు. అలాంటి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపాన్ని చూసిన బలి హృదయము గద్గదమై... వామన భగవానుడిని ఉత్తమ ఆసనముపై కూర్చొండబెట్టి పూజించాడు. ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరమని అడిగాడు ... "వామనుడు మూడు పాదముల భూమి"ని అడిగాడు. 

 

 

శుక్రాచార్యుడు భగవానుని లీలలను గ్రహించి, దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు. అంతేగాకుండా దానం చేయడానికి సంకల్పము చేసేందుకు జలపాత్రను ఎత్తాడు.  శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్రలో ప్రవేశించి జలము వచ్చే దారిని ఆపేశాడు. కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని చేధించాడు. దీంతో శుక్రాచార్యునికి ఒక కన్ను పోయింది.  సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు పోతన గారు ఇలా వర్ణించారు..

 

 

 

వామనుడు బ్రహ్మాండ రూపం పొందిన వర్ణన...

        ఇంతింతై వటు దింతయై మరియు తానింతై
        నభో వీధిపై నంతై తోయదమండలాగ్రమున కల్లంతై
        ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై
        ధ్రువునిపై నంతై మహార్వాటిపై నంతై
        సత్యపదోన్నతుం డగుచు
        బ్రహ్మాండాంత సంవర్ధియై

అన్నట్టు  ఒక పాదాన్ని పృథ్విపై, రెండవ పాదముతో స్వర్గలోకాన్ని కొలిచాడు. మూడవ పాదానికి బలి తనకు తానే సమర్పితుడయ్యాడు. బలి సమర్పణ భావమునకు భగవానుడు ప్రసన్నుడై బలికి సుతలలోక రాజ్యాన్ని యిచ్చాడు. ఇంద్రునికి ఇంద్ర పదవి అప్పగించాడని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి మహిమాన్వితమైన వామనుడు పుట్టిన రోజున శ్రీ మహావిష్ణువును నిష్టతో ప్రార్థించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. అంతేగాకుండా... ఆరోజున వైష్ణవ దేవాలయాలను సందర్శించుకునేవారికి సకల సంపదలతో పాటు పుణ్యఫలము సిద్ధిస్తుందని పండితులు సూచిస్తున్నారు.

 

 

వామన పురాణంలో ఇదే గాథను పోలిన మరో వృత్తాంతం విశదీకరించబడింది. దుంధుడు అనే రాక్షసుడు దేవతలపై దండెత్తి బలాన్ని సమకూర్చుకోవడానికి దేవికా నదీ తీరంలో అశ్వమేధ యాగం చేయసాగాడు. దుంధుణ్ణి యుక్తితో జయించాలని శ్రీహరి వామన రూపంలో దేవికా నదిలో ఓ దుంగలాగా తేలుతూ కొట్టుకుపోసాగాడు. దుంధుడు, అతని అనుచరులు ఆ బాలుణ్ణి రక్షించారు. తన పేరు గతి భానుడనీ, తాను మరుగుజ్జ అయినందుకు ఆస్తి వివాదాల్లో తనను దాయాదులు నదిలో పడేశారని చెప్పాడు. అతని దీనగాథను విని దుంధుడు ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆ సంవిధానంలోనే దుంధుణ్ణి భూమిలోకి తొక్కి సమాధి చేశాడని పురాణగాథ.