మహాగణాధిపతికి మూషిక వాహనమా

 

మహాగణాధిపతికి మూషిక వాహనమా...?

 


గణాలకు ఒక నాయకుడు ఉంటాడు కదా. మరి గణనాయకులందరూ కలిస్తే...వారికి ఒక నాయకుడు కావాలి గదా. ఆ గణనాయకులకు నాయకుడే మన  వినాయకుడు. అందుకే ఆయనను ‘మహాగణాధిపతి’ అన్నారు. వినాయకుని పూజిస్తే సకల దేవతలనూ పూజించినట్లే.., వారి దీవెనలు అందుకున్నట్లే.  వినాయకునకు మహాగణాధిపత్యం వచ్చాక..విఘ్నగణాలన్నీ ఆయనకో మంచి బహుమతి ఇవ్వాలనుకున్నాయి. వారికో ‘ఎలుక’ కనిపించింది.దీన్ని  బహుమతిగా ఇవ్వాలనుకుని, దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించారు. ఆ ఎలుక పరుగెత్తుకుంటూ వెళ్ళి ఓ పర్వతాన్ని దొలిచి ఆ కలుగులో దాక్కుంది.  అయినా దాన్ని వాళ్ళు వెతికి పట్టుకున్నారు. ఆ ఎలుకను.., వినాయకునకు బహూకరించారు. దాన్ని చూసి, వినాయకుడు నవ్వుతూ, ‘కొండను త్రవ్వి  ఎలుకను పట్టి తెచ్చారన్న మాట. సరే..భక్తిగా తెచ్చారు కనుక దీన్ని నా వాహనంగా స్వీకరిస్తున్నాను’ అన్నాడు. అంతటి మహానాయకునికి ఇంత చిన్న ఎలుకా వాహనం అని ఆశ్చర్యపోవద్దు. - అడివంతా కార్చిచ్చు వ్యాపించి దహించుకు పోతూంటే ..ఎలుక మాత్రం భూమిని దొలుచుకుంటూ సొరంగం చేసుకుని ప్రాణాలతో బయటపడగలదు. - ఎంత పెద్ద పర్వతాన్నైనా తన పళ్ళతో పిండి పిండిగా చెయ్యగల ప్రాణి ‘ఎలుక’. - ఎంతో వేగంగా..అలుపు, అలసట లేకుండా పరుగెత్తగల ప్రాణి ‘ఎలుక’. - ఎంత తిన్నా క్షణంలో జీర్ణం చేసుకోగల ప్రాణి ‘ఎలుక’.    అందుకే అది వినాయకుని వాహనమైంది..ప్రతి ఇంటికీ చేరువైంది.

- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం