అందరూ ధరించే భస్మం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..

 

అందరూ ధరించే భస్మం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..

పరమేశ్వరుడిని పూజించే ప్రతి ఒక్కరు నొసటన భస్మం ధరించడం పరిపాటి. అయితే భస్మ ధారణ గురించి, భస్మ రకాల గురించి, భస్మం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి...

మొట్టమొదటగా భస్మం ఎన్నిరకాలు? అవి ఏవి అనే విషయన్ని తెలుసుకుంటే… భస్మం మూడు రకములు. అవి ఒకటి లౌకికాగ్ని రెండు వైదికాగ్ని మూడు శివాగ్ని. ఈ మూడు భస్మములను వాటిని ధరించే అర్హతలు ప్రకారంగా ధరిస్తారు.  అయితే సాధారణంగా నొసటన ధరించడానికి  ఎటువంటి భస్మం శ్రేష్టం అనే సందేహం అందరికీ కలుగుతుంది. అందరూ ధరించడానికి గోమయం అంటే వు పేడతో చేసిన పిడకల ద్వారా చేసే హోమాగ్ని నుండి లభించే భస్మం అత్యుత్తమమైనది.  

ఇకపోతే భస్మాన్ని నేరుగా నొసటన పెట్టుకుని హమ్మయ్య అయిపోయింది అనుకోకూడదు. ఈ భస్మాన్ని ధరించేటపుడు పఠించాల్సిన మంత్రం ఒకటుంది. అదేమిటంటే… "ఈశానతే తత్పురుష నమో ఘోరయతే సదా వామదేవ నమస్తుభ్యం సద్యోజాతాయ వై నమః" అనే మంత్రాన్ని తప్పని సరిగా చెప్పుకుంటూ భస్మాన్ని ధరించాలి. 

చాలామంది భస్మం అంటే కాలిన బూడిద అని అనుకుంటారు.  కానీ భస్మం అంటే అర్థం ఏమిటో తెలుసుకుంటేనే దాని విశిష్టత ఏంటో అర్థమవుతుంది.  భస్మానికి ఒక విశిష్ట అర్థం ఉంది.. భస్మం అంటే ఐశ్వర్యం తేజస్సు

భస్మాన్ని ధరించడానికి కూడా ఒక నియమం ఉంది. భస్మాన్ని ఎప్పుడూ  త్రిపుండ్రాలుగా ధరించాలి. అంటే మూడు అడ్డు వరుసలుగా ధరించాలన్నమాట.  ఇలా ధరించడంలో కూడా ఒక్కొక్కరికి ఒకో పద్ధతి ఉంది. మగవారు కనుబొమలు దాటకుండా దసరించాలి.  ఆడవారు ముంగురులు దాటకుండా ధరించాలి.

అయితే అసలు ఈ భస్మాన్ని ధరించడం వల్ల కలిగే ఉపయోగం ఏమిటి అని అందరికీ సందేహం కలుగుతుంది. భస్మాన్ని ధరించడం వల్ల  సర్వ పాపాలు తొలగిపోతాయి.

భస్మాన్ని మూడు అడ్డు వరుసలుగా ధరిస్తారు అనే విషయం తెలిసిందే… దీన్నే  త్రిపుండ్రం అని అంటారు. త్రిపుండ్రంలో దేవతలు కొలువై ఉంటారు అనే విషయం చాలా మందికి తెలియదు. ఇందులో ఒక్కొక్క రేఖకి తొమ్మిది మంది చొప్పున మొత్తం  ఇరవై ఏడు మంది దేవతలు కొలువై వుంటారు.

భస్మాన్ని కేవలం నొసటన మాత్రమే కాకుండా వివిధ ప్రాంతాలలో ధరిస్తారు. శిరస్సు, లలాటం, కంఠం, రెండు భుజస్కందములు, రెండు భుజములు, రెండు మోచేతులు, రెండు మణికట్లు, హృదయం, నాభి, రెండు పార్శ్వములు మరియు వెనుక భాగం. ఇలా భస్మాన్ని శరీరంలో వివిధ ప్రాంతాలలో ధరిస్తారు. 

త్రిపుండ్రంలో ఇరవై ఏడుమంది దేవతలు కొలువై ఉంటారు. ఆ ఇరవై ఏడుమంది దేవతలకు  అధిదేవతలు ఉంటారు.  వారిలో అశ్విని దేవతలు, శివుడు, శక్తి, రుద్రుడు, ఈశానుడు, నారదుడు, వామ, జ్యేష్ఠ, రౌద్ర మొదలగు పదహారుమంది అధిదేవతలు ఉంటారు. 

ఇక మనిషిని వెంటాడేది పాపం. పరిహారం లేని పాపాలు కొన్ని ఉంటాయి. అలా పరిహారం లేని 3 పాపములు ఏవంటే… శివ ద్రవ్యాపహరణ, శివ నింద, శివ ధర్మ నింద, శివ భక్త నింద. ఈ మూడు పాపాలకు పరిహారం లేదు. కాబట్టి జాగ్రత్త.

ఇలా పరమేశ్వరుడిని తలుస్తూ మనం ధరించే భస్మం వెనుక ఇన్ని అసక్తకర విషయాలు ఉన్నాయి.

                                     ◆నిశ్శబ్ద.