కొత్త బట్టలకు పసుపు ఎందుకు!

 

 

 

కొత్త బట్టలకు పసుపు ఎందుకు!

 


పసుపు విశిష్టత గురించి కొత్తగా చెప్పుకోవలసిన పనిలేదు. చర్మరోగాల నుంచి క్యాన్సర్‌ వరకూ పసుపు ఎన్నో రోగాలకు దివ్యౌషధం అంటూ పరిశోధనలన్నీ తేటతెల్లం చేస్తున్నాయి. ఇలాంటి పసుపుని భారతీయులు తమ జీవితంలోనే ఒక భాగంగా మార్చేసుకున్నారు. మరీ ఎంత గొప్ప పదార్థమైతే మాత్రం... కొత్తబట్టలకు కూడా పసుపుని రాసుకుని తిరగాలా అని చిరాకుపడిపోతుంటారు కుర్రవాళ్లు. మరి ఆ చిరాకు ఎంతవరకు సబబో చూద్దాం..

 

- కొత్త బట్టలని ఉతకకుండానే ధరించేస్తాం. ఇప్పటి బట్టల తయారీలో రకరకాల రసాయనాలని వాడేస్తున్నారు. అలాగే పూర్వకాలంలోనూ గంజి, అద్దకాలతో బట్టలను రూపొందించేవారు. ఇటు రసాయనాలైనా, అటు గంజి వంటి పదార్థాలైనా నిలువ ఉన్నప్పుడు తప్పకుండా క్రిములకు ఆస్కారం ఇచ్చేవే. కొత్తబట్టలకు పసుపుని రాయడం వల్ల వాటి మీద ఉన్న సూక్ష్మక్రిములను కొంతవరకైనా నాశనం చేసే అవకాశం ఉంటుంది.

 

- కొత్త బట్టలు ధరించడం ఒక యోగం. చేతిలో డబ్బులు ఆడుతున్నాయి కాబట్టి ఈ మధ్య ఎప్పుడు కావాలన్నా బట్టలు వేసుకోగలుగుతున్నాము. కానీ ఒకప్పుడు పండుగలు, పెళ్లిళ్లు, పుట్టినరోజులు వంటి శుభసందర్భాలలో మాత్రమే బట్టలను కొనుగోలు చేసే అలవాటు ఉండేది. మరి పసుపు లేనిదే మన సంప్రదాయంలో ఏ శుభకార్యమూ గడవదు కదా! పూజ చేయాలన్నా కూడా పసుపు ముద్ద ఉండాల్సిందే! అలాంటి ఓ శుభసందర్భంలో భాగంగా బట్టలను కూడా చేరుస్తున్నాము కాబట్టి... అందుకు సూచనగా శుభప్రదమైన పసుపుని ముట్టించేవారు.

 

- కొత్త బట్టలలు గంజివాసన వేస్తాయి. గోదాముల్లో నెలల తరబడి ఉన్నా ముక్కవాసన వస్తాయి. ఈ వాసనను పసుపు కొంతవరకూ నిలువరిస్తుంది.

 

- కొత్త బట్టలకు పసుపు రాయడం అనేది ఇంట్లోని ఆడవారి చేతుల మీదుగా జరుగుతుంది. అలా వారి ఆశీర్వచనం, ప్రేమ కూడా అందించినట్లు అవుతుంది.

 

- ఒకప్పుడు పసుపుని కూడా బట్టలకు అద్దకంగా వాడేవారు. అంటే ఇది బట్టలకు అంటుకుంటే ఒక పట్టాన పోదన్నమాట. కాబట్టి బట్టలను జాడించిన ప్రతిసారీ పసుపు కాస్త కాస్తగా కరుగుతూ తనలోని క్రిమిసంహారక లక్షణాన్ని బట్టలకు అందిస్తుంది.

 

- కొత్త బట్టలు, అందునా తెల్లబట్టలు వేసుకుని వెళ్తే అందరి కళ్లూ వారి మీదే ఉండటం ఖాయం. అందుకని బట్టలకు పసుపుని తాకించడం వల్ల పలువురి దృష్టి పడటం వల్ల కలిగే దోషాలను నివారిస్తుందని పెద్దల నమ్మకం.

 

- పసుపంటే బంగారు వర్ణం. అది వైభవానికీ, భగవంతుని మహిమకూ చిహ్నం. అందుకే పెళ్లి చేసుకునేటప్పుడు, దైవదర్శనానికి వెళ్లేటప్పుడు పసుపు బట్టలు (పీతాంబరాలు) ధరించి వెళ్లాలంటారు పెద్దలు. కొత్తబట్టలకు కాసింత పసుపుని జోడిస్తే అది కూడా పీతాంబరంగానే మారిపోతుంది. జీవితమనే వైభవానికి తీపి గుర్తుగా మిగిలిపోతుంది.

 

- నిర్జర.