కాశీ కబుర్లు - 19 త్రివేణీ స్నానం .. ప్రయాగ (అలహాబాద్)

 

 

కాశీ కబుర్లు - 19 త్రివేణీ స్నానం .. ప్రయాగ (అలహాబాద్)

 

 

 

సాధారణంగా కాశీ వెళ్ళి 9 రోజులు వుండేవాళ్ళు మధ్యలో గయ, ప్రయాగ వగైరా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వస్తారు.  ఇంకా ఆసక్తి వున్నవాళ్ళు అయోధ్య, నైమిశారణ్యం కూడా వెళ్తారు.   వీటికోసం దాదాపు అన్ని సత్రాలు, హోటల్సుకి అనుసంధానమై టూర్ ఆపరేటర్లు వుంటారు.  వాళ్ళే వచ్చి అడుగుతూంటారు.  లేకపోతే మీరు కనుక్కోవచ్చు.  కొత్త ప్రదేశాలు, అంతా, అన్నీ కొత్తే కనుక వాళ్ళ ద్వారా వెళ్తే వాళ్ళూ కొంత బాధ్యత వహిస్తారని మన నమ్మకం.   టూర్ వివరాలు ముందే  పూర్తిగా కనుక్కుని, మీరు ఏమి చూడదల్చుకున్నారో, ఏ కార్యక్రమాలు చెయ్యదల్చుకున్నారో వాళ్ళకి తెలియజేయండి.  చేతనయితే కొంచెం బేరం కూడా చెయ్యండి.

సాధారణంగా ఈ టూర్లు రాత్రి 12 గంటల తర్వాత మొదలవుతాయి.  మళ్ళీ మరునాడు రాత్రి 12 గంటల లోపు కాశీ చేరుకుంటాము.  వసతినుంచి పికప్, డ్రాప్ వుంటుంది.  ఇలా ఎందుకంటే, కాశీలో కొందరు తొమ్మిది రాత్రులు నిద్ర చెయ్యాలనుకుంటారు.  దానితో తల్లి గర్భంలో తొమ్మిది నెలలు మల మూత్రాలలో వున్న దోషం పోతుందని అంటారు.  అందుకని 12 గంటల దాకా మీరు నిద్ర పోయినా పోకపోయినా ఆ రోజు కాశీలో నిద్ర చేసినట్లే లెక్క.  అలాగే మర్నాడు రాత్రి 12 గంటల లోపు వచ్చేస్తారు గనుక ఆ రోజు కూడా కాశీలో నిద్ర చేసినట్లే లెక్క.

మేము ఒక రోజు ప్రయాగ, సీతామడి, మరొక రోజు గయ, సారనాధ్ చూశాము.  వాటి వివరాలు...


27-3-2010 ఉదయం 5 గంటలకల్లా  సుమో లో బయల్దేరి ఉదయం 10 గంటలకు ప్రయాగ చేరాము. ఇక్కడే త్రివేణీ సంగమం .. గంగ, యమున, సరస్వతి .. మూడు నదుల కలయిక.  ఇక్కడ స్నానం చెయ్యటం ఎంతో ఫలప్రదమంటారు.  కాశీ యాత్ర చేసినవారు గంగా తీర్ధం ఇంటికి తీసుకు వెళ్ళాల్సింది ఇక్కడినుంచే.  అందుకని ఖాళీ బాటిల్స్ తీసుకెళ్ళటం మర్చిపోకండి.  ఇక్కడి ఇంకొక విశేషం వేణీదానం.  దాని గురించి కూడా చెబుతాను.  

 

 

ముందుగా ప్రయాగలో అశోకుడు కట్టించిన కోట దగ్గర నది ఒడ్డున మమ్మల్ని దింపి అక్కడ బోటు వాళ్ళని, పాండాలనీ మాట్లాడుకోమని మా సుమో డ్రైవరు వీలయినంత దూరం పారిపోయాడు.  కాశీలో సత్రం వాళ్ళు తెలుగు బ్రాహ్మడిని మాట్లాడుకోమని చెప్పారు.  వాళ్ళు చెప్పినట్లు తెలుగు బ్రాహ్మణుడి దగ్గరకి తీసుకెళ్ళమంటే మీ కార్యక్రమాల్లో  పిండ ప్రదానం వగైరాలు  లేవుకదా, ఇక్కడ మాట్లాడుకోండి, తొందరగా అవుతుందని ఓ ఉచిత సలహా పారేశాడు మా డ్రైవరు.  అంటే సమయానుకూలంగా షరాలు మార్చబడతాయి అని అర్ధం అయిపోయిందికదా.    ఇంక చూడండి మా తిప్పలు.  ఎందుకులెండి...మీరెళ్ళినప్పుడు ఎటూ పడతారుగా... మాకా అవస్తలు వద్దు, జాగ్రత్తలు చెప్పండి అంటారా...   బుధ్ధిగా మీరు దిగిన సత్రం వాళ్ళు చెప్పిన తెలుగు బ్రాహ్మలు ఎవరైనా వుంటే వారి దగ్గరకు వెళ్ళండి.  వాళ్ళు ఎలా వుంటారో మనకి తెలియదుగానీ కనీసం మన భాష, మన పధ్ధతులు చెప్పటానికి, వాళ్ళు చెప్పినవి అర్ధం చేసుకోవటానికి వీలుగా వుంటుంది.  పైగా,  మీరు నేరుగా పండాలతో మాట్లాడుకునేదానికన్నా సమయం, శ్రమ, డబ్బు ఆదా అవుతాయి.  నేను సేకరించిన ఒక అడ్రసు కింద ఇస్తున్నాను.  కేవలం మీకు సమాచారం ఇవ్వటం తప్ప నాకూ వీరికీ ఎటువంటి పరిచయమూ లేదు.  నేను కనీసం వీరిని చూడలేదుకూడా.  గయ వెళ్ళినప్పుడు మా వాన్ డ్రైవరు ఇచ్చాడు.  తెలుగు వాళ్ళు సాధారణంగా ఇక్కడికే వెళ్తారు అని.  ఇంక మా కధలోకి వస్తాను.

బ్రాహ్మణుడిని, బోట్ నీ మాట్లాడుకుని ఎక్కాము.  బోట్ ఎందుకంటే నీళ్ళల్లో కొంచెం దూరం తీసుకెళ్తారు.  అక్కడ మూడు నదులూ, గంగా, యమునా, సరస్వతి (అంతర్వాహిని) సంగమ ప్రదేశమని.  అన్నిరకాల కార్యక్రమాలు, స్నానాలు అక్కడే.  పిండ ప్రదాన కార్యక్రమం చేయిస్తే బ్రాహ్మణుడికి రూ. 850, సంకల్పం, వేణీ దానాలకి రూ. 250 కి మాట్లాడాము.

 

 

ఇంక బోటు తమాషా చూడాలి.  ఒకతను తీసుకెళ్ళి, కార్యక్రమం అయ్యేదాకా అక్కడవుండి తిరిగి తీసుకు రావటానికి ఐదుగురికి రూ. 2000 అడిగాడు, మేము రూ. 1200కి బేరం కుదుర్చుకున్నాము.  అప్పుడు మొదలయింది అసలు  విడ్డూరం. ఇంకో ఇద్దరు ముగ్గురు పడవల వాళ్ళు మాకు హితబోధ చెయ్యటం మొదలు పెట్టారు.  అతను మళ్ళీ తీసుకు రాడు, ఒక సారికే ఆ డబ్బు, తీసుకురావటానికి మళ్ళీ అంత అడుగుతాడు, మేము చాలా చౌకగా రూ. 2000 కే తీసుకెళ్ళి తీసుకొస్తామని, మమ్మల్ని పెద్ద ఆపదనుంచి కాపాడే ధీరోదాత్తుల్లా మాట్లాడటం అనటంకన్నా మా బుఱ్ఱలు తినెయ్య సాగారు అంటే సరిగ్గా వుంటుంది.   మేము ఆ ప్రదేశానికి కొత్తవాళ్ళం, అందరూ ఒక్కసారి గందరగోళంగా మాట్లాడటంతో  తలవాచిపోయింది.  మేము మాట్లాడుకున్న పడవతను మాత్రం అవేవీ తనకి సంబంధం లేనట్లు మౌనంగా వున్నాడు.  వాళ్ళందరూ అలా మాట్లాడటంతో మాకు కొంచెం అనుమానం వచ్చింది.  ఎందుకైనా మంచిదని మా పడవ బుధ్ధుడితో  మళ్ళీ ఇంకొకసారి గట్టిగా చెప్పాము.  మాట్లాడుకున్న డబ్బు తీసుకెళ్ళి, అక్కడ హడావిడి చెయ్యకుండా ఆగి, తిరిగి తీసుకు రావటానికనీ, తిరిగి  వచ్చాకే డబ్బు ఇస్తాము, ముందు ఇవ్వమనీ  గట్టిగా చెప్పాము.

 ఏ మాటకామాటే చెప్పాలి.  మా బోటతను చాలా నెమ్మదస్తుడు.  ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు.  పైగా నీళ్ళల్లో దిగేటప్పుడు, పైకి రావటానికి సహాయం చేశాడు.  అతనికి ఫోటోగ్రాఫీ కూడా తెలుసు, అక్కడ మా ఫోటోలు అతనే తీశాడు.  చివరిగా ఒడ్డుకి చేర్చాకే డబ్బు తీసుకున్నాడు.  మేము సంతోషంగా ఎక్కువ ఇచ్చింది సంతోషంగా తీసుకున్నాడు.  మిగతా పడవల వాళ్ళ మాటల మాయలో పడనందుకు మమ్మల్ని మేము అభినందించకున్నాము.

 

 

 

ప్రయాగలో తెలుగు బ్రాహ్మణుడి అడ్రసు, ఫోన్ నెంబరు

బ్ర.వే. హరి జగన్నాధ శాస్త్రి, వారి కుమారులు శ్రీ లక్ష్మణ శాస్త్రి

110/105, బక్షీ దారాగంజ్, అలహాబాద్—211006

ఫోన్  మొబైల్  94152 38615  మరియు  93891 95851

లేండ్ లైన్   0532  2501729  మరియు  0532  2506058

 

-పి.యస్.యమ్. లక్ష్మి

 (తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)