ఇవి తెలిస్తే ఫ్యాషన్ ప్రపంచంలో మీరు ఐకాన్ అవుతారు!!

 

ఇవి తెలిస్తే ఫ్యాషన్ ప్రపంచంలో మీరు ఐకాన్ అవుతారు!!


ఫ్యాషన్ ప్రపంచం చాలా పెద్దది. ఏదో ఒక కొత్తదనం ఆవిష్కారమవుతూనే ఉంటుంది. కొత్తదనం కోసం అమ్మాయిలు ఒక అడుగు ముందుగానే ఉంటారు. అయితే ఈ కొత్తదనం పాతదనంగా మారడానికి కూడా ఎంతోసేపు పట్టదు. ఫ్యాషన్ అభివృద్ధి చెందుతున్న వేగానికి నిన్న మార్కెట్ లోకి వచ్చినవి వారం తిరగకనే పాతదనం ఖాతాలో చేరిపోతున్నాయి. అలాంటప్పుడు అందరికీ అన్ని రకాలు కొనడం సాధ్యం కాకపోచ్చు. అలాగని కొత్తగా, అట్రాక్షన్ గా కనిపించాలి అనే ఆరాటం ఆగదు. అందుకే పోగైపోయిన బట్టల వైపు ఓ లుక్కేయమంటున్నాం.


పోగైపోయినవి అన్నీ పాత ఇనప్పెట్టెలో సరుకులాంటిదే అని మూతి తిప్పుతారేమో. పాత ఇనప్పెట్టె బరువు, దాని క్వాలిటీ చాలా గొప్పవండోయ్. అందుకే దుస్తుల విషయంలో కూడా పాతబట్టల్లో నాణ్యత మెండుగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. అలాగని మరీ చిరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నవాటిని ఎవరూ ఎంపిక చేసుకోరు కదా!! చెక్కుచెదరకుండా ఉన్న పాతబట్టలతో అద్భుతమైన ఆవిష్కరణలు చేయచ్చు. దీనివల్ల మీలో ఉన్న నైపుణ్యం బయటకొస్తుంది. మీదగ్గరున్నవాటిని మీరు అద్భుతంగా మార్చడం వల్ల ఎంతో ఇష్టం ఏర్పడుతుంది. కొన్నాళ్లపాటు బట్టలు కొనాల్సివ అవసరం ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా మీ వార్డ్ రోబ్ కొత్తగా మెరుస్తుంది.


మీదగ్గర పొడవైన స్కర్ట్ లు ఉంటే వాటిని వేసుకోవడం అంతగా ఇష్టం లేదనిపిస్తే వాటిని మూలన పెట్టేసి ఉంటే ఇప్పుడు బయటకు తీయాల్సిన సమయం వచ్చేసింది. పొడవైన స్కర్ట్ లను మధ్యలోకి కట్ చేసి వాటిని తగినవిధంగా కుడితే నేటి ట్రెండ్ లో హాల్ చల్ చేస్తున్న ప్లాజో సిద్ధమైపోయినట్టే. వదులుగా ప్యాంట్ టైప్ లో ఉండే ఈ ప్లాజో ఎంతో ఫ్యాషన్ లుక్ ఇస్తాయి. టీషర్ట్, కుర్తీలతో వేసుకోవడానికి ఇవి ఎంతో బాగుంటాయి. 


టూ మచ్ పొడవుగా ఉండే కుర్తాలు ఎప్పుడూ వేసుకోవడం బాగుండదు. ఎంతైనా ఫ్యాషన్ ప్రపంచంలో రొటీన్ అనేది చాలా విసుగైపోతున్న పదం. అందుకే పెద్దగా ఉన్నవాటిని షార్ట్ గా చేసుకుని ఎంచక్కా జీన్స్లోకి వేసుకోవచ్చు. అలాగే పైన చెప్పుకున్న ప్లాజో లోకి కూడా ఈ టైప్ కుర్తీస్ బాగుంటాయి. వీటి పొడవైన చేతులకు క్రియేటివిటీని జోడించి ఎంబ్రాయిడింగ్ లేదా ఇతర హ్యాండ్ వర్క్ చేస్తే మరింత అట్రాక్షన్ అవుతాయి.


మనదగ్గరున్న ఈ కుర్తాలు ఇలా మార్చేసుకోవడం వల్ల ఆ డ్రెస్ లకు సంబంధించిన దుపట్టాలు అలాగే వార్డ్ రోబ్ లో వెక్కిరిస్తున్నట్టు కనిపిస్తాయి. వాటిని కూడా ఓ పట్టు పట్టచ్చు. వాటిని స్టోల్స్ లాగా మార్చచ్చు. ఇంకా మందం పాటి దుపట్టాలను షాల్స్ లాగా వాడొచ్చు. చలికాలంలో మఫ్లర్స్ లాగా కొన్ని ఉపయోగపడతాయి. మొత్తానికి ఇవేమీ వృధా అయిపోవు. 


కొన్ని డ్రెస్సులకు ఇచ్చిన దుపట్టాలు భళే అందంగా ఉంటాయి. షిఫాన్, జార్జిట్, కాటన్ మొదలైన క్లాత్ లు అయితే ఇంకా బాగుంటాయి. వాటిని హాయిగా చిన్న టాప్స్ లాగా మార్పులు చేసుకోవచ్చు. ఈ టాప్స్ లోకి జీన్స్, ప్లాజో కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. ఇంకా వీటి మీదకు మీరే తయారుచేసుకున్న స్టోల్స్ వేసుకుంటే వారెవ్వా అని మిమ్మల్ని మీరు ముద్దాడేసుకుంటారు అద్దంలో చూసుకుని.


కొన్ని పొడవాటి కుర్తాలు ఎంతో బాగుంటాయి. చూసి చూసి వాటిని కుదించాలంటే మనసు గిలగిలా కొట్టేసుకుంటుంది. అలాంటి కుర్తాలను హాయిగా స్కర్ట్ లుగా మార్చేసుకోవచ్చు. అప్పుడు అవి ఎంతో బాగుంటాయి. స్కర్ట్ ల మీదకు టాప్స్ లేదా టీషర్ట్ లు అధిరిపోతాయి. బొమ్మరిల్లు హసినిలా ముద్దుగుమ్మలైపోతారు.


ఇప్పటి వరకు మనతో ఉండే బట్టల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అమ్మ దగ్గరుండే అద్బుతాల వైపు చూడాలి. అమ్మల దగ్గర బోలెడు చీరలు ఉంటాయి. బరువున్నాయనో, రంగు నచ్చకో మరింకేకారణంతోనో అమ్మల దగ్గర చీరలు పోగుపడతాయి. ఒక చీర ఉందంటే ఓ డ్రస్సే తయారైపోద్ది. ముఖ్యంగా కొంగు దగ్గరున్న అట్రాక్షన్ తెచ్చి టాప్ ముందు వేస్తే అధిరిపోతారు.


మీ దగ్గర చిన్న స్కర్ట్ లు ఉన్నాయా?? పెద్దోళ్లయిపోయారని వాటిని మూలన వేశారా?? వాటితోనూ ఒక కళాఖండం సృష్టించచ్చు అదే టోట్ బ్యాగ్. బయటకు వెళ్ళినప్పుడు షాపింగ్ కోసం ఇతర వస్తువులు తీసుకెళ్లడానికి స్కర్ట్ లతో టోట్ బ్యాగ్స్ తయారుచేసుకుంటే బావుంటుంది.


ఇలా మనదగ్గరున్న వాటిని మరింత కొత్తగా ఆకర్షణగా మార్చుకుంటే మనమే ఫ్యాషన్ డిజైనర్లు, మనమే ట్రెండ్ సెట్టర్లు కూడా. మరింకెందుకు ఆలస్యం మొదలెట్టేయండి.


                                   ◆నిశ్శబ్ద.