తిరువళ్ళూరు శ్రీ వీరరాఘవేంద్ర స్వామి పుష్య బహుళ అమావాస్య
తిరువళ్ళూరు శ్రీ వీరరాఘవేంద్ర స్వామి
పుష్య బహుళ అమావాస్య
త్రిమూర్తులలో స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు వివిధ రూపాలలో...వివిధ పేర్లతో కొలువుతీరిన అత్యంత మహిమాన్వితమైన దివ్య క్షేత్రాలకు-‘దివ్యతిరుపతులు’,‘దివ్య దేశములు’ అని పేరు. మొత్తం 108 దివ్య తిరుపతులు వున్నాయి. 108 దివ్య తిరుపతులలో ఒకటైన ‘తిరువళ్ళూరు’లో శ్రీ మహావిష్ణువ ‘శ్రీవీరరాఘవస్వామి’ పేరుతో శయనరూపం నయన మనోహరంగా కొలువుతీరి పూజలందుకుంటున్నాడు. కృతయుగంలో బదరికాశ్రమంలో ‘పురుపుణ్యర్’ అనే మహర్షి నివసిస్తుండేవాడు. ఆయన భార్య సత్యవతి. శ్రీ మహావిష్ణువు భక్తులైన ఈ దంపతులకు చాలా కాలం సంతానం కలగలేదు. దీనితో వారు పుత్ర సంతానం కోరుతూ ఒక సంవత్సర కాలం పుత్రకామేష్టీ యాగం చేసారు. ఫలితంగా వీరికి కొంతకాలానికి ఒక కుమారుడు జన్మించగా, శ్రీ మహావిష్ణువు ప్రసాదంగా భావించిన ఆ పిల్లవాడికి ‘శాలిహోత్రుడు’ అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచసాగారు. తల్లిదండ్రుల మాదిరే శాలిహోత్రుడికీ చిన్నతనంనుంచే విష్ణు భక్తి అలవడింది.
అటువంటి శాలిహోత్రుడు యుక్తవయసు రాగానే దేశ పర్యటనకు బయలుదేరి దేశంలోని పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటూ ప్రస్తుతం ‘తిరువళ్ళూరు’ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడి ‘హృత్తాపనాశని’ తీర్ధం చూసి...అది ఎంతో పవిత్రమైనదని గుర్తించి, అందులో స్నానమాచరించి, దైవప్రార్దనలు చేసాడు. ఈ సమయంలో ఇక్కడే వుండి తపస్సు చేయాలనే కోరికతో తపస్సును ప్రారంభించాడు. ఒక సంవత్సరం పాటు తపస్సు, యజ్ఞయాగాలు చేసాడు. సంవత్సరం పూర్తవుతూనే పూర్ణాహుతి చేసి నైవేద్యం సమర్పించాడు. అనంతరం నైవేద్యాన్ని మూడు భాగాలు చేసాడు. ఒక భాగాన్ని దేవునికి సమర్పించాడు. ఇక రెండో భాగాన్ని ఆహుతుడి కొరకు, మూడవ భాగాన్ని తనకోసం వుంచుకుని ఆహుతుడి కోసం ఎదురు చూడసాగాడు. ఈలోగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆ దారిన వెడుతూ కనిపించడంతో దేవుడుపంపిన ఆహుతుడుగా భావించిన శాలిహోత్రుడు ఆ వృద్ధుడిని ఆహ్వానించి ఆహుతుడి కోసం వుంచిన ప్రసాదాన్ని వడ్డించాడు. దానిని భుజించిన వృద్ధుడు తనకు ఆకలి తీరలేదని తెలపడంతో శాలిహోత్రుడు తనకోసం వుంచుకున్న భాగాన్ని కూడా ఆయనకే వడ్డించాడు. ఆయన తృప్తిగా భుజించి వెళ్లిపోయాడు. అయితే శాలిహోత్రుడికి మాత్రం ప్రసాదం లభించలేదు. దానితో తన తపస్సులో ఏదో లోపం వుండడంవల్లనే తనకు ప్రసాదం లభించలేదని భావించిన శాలిహోత్రుడు మరో సంవత్సరం పాటు తపస్సు చేసాడు. కానీ ఇంతకుముందులాగా ఒక పండు ముసలి బ్రాహ్మణుడు ఆశ్రమానికి రాగా...ఆయనను సాదరంగా ఆహ్వానించి ప్రసాదాన్ని వడ్డించాడు. శాలిహోత్రుడు వడ్డించిన ప్రసాదాన్ని తృప్తిగా భుజించిన ఆయన ‘‘నాకు భుక్తాయాసంగా వుంది. ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి?’’ అని శాలిహోత్రుడిని అడగ్గా... ‘‘ఇక్కడనే పవళించండి’’ అని శాలిహోత్రుడు సమాధానం ఇచ్చాడు. దీనితో బ్రాహ్మణుడు దక్షిణంవైపు తలపెట్టి, ఉత్తరంవైపు కాళ్లు వుంచి తూర్పువైపు చూస్తూ పవళించాడు. ఈ విధంగా పవళించిన ఆయనకు బ్రాహ్మణుడి రూపం పోయి శ్రీ మహావిష్ణువు రూపం ప్రత్యక్షం అవడంతో శాలిహోత్రుడు సంతోషించి పరిపరి విధాలుగా స్వామివారిని ప్రార్ధించాడు.
శాలిహోత్రుని కోరిక ప్రకారం తాను విశ్రాంతికోసం పవళించిన శయన రూపంలోనే ‘శ్రీ వీర రాఘవస్వామి’గా కొలువుతీరినట్టు స్థలపురాణ కథనం. అత్యంత ప్రాచీన కాలంనుంచే వున్న ఈ ఆలయాన్ని క్రీశ 8,9 శతాబ్దాల కాలంలో పునర్నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. చోళ వంశస్తులు ఈ ఆలయాన్ని వివిధ మండపాలను నిర్మింపచేసారు. తర్వాతి కాలంలో విజయనగర చక్రవర్తులు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్టు చరిత్ర చెప్తోంది. ప్రధాన గర్భాలయంలో ఐదు శిరస్సుల శేషతల్పంపై శ్రీ వీరరాఘవస్వామివారు శయనించి దర్శనమిస్తారు. భారీ రూపంతో ద్విభుజాలతో కొలువుతీరివున్న స్వామివారు ఒక చేయిని కిందికి ముని శిరస్సుపై వుంచి మరోచేయి పైకి ఎత్తి గర్భాలయ వెనక గోడకు ఆనించి దర్శనమిస్తారు. స్వామివారి తలకు దగ్గర శాలిహోత్ర మహర్షి పద్మాసన స్థితిలో కూర్చుని ఉంటాడు. స్వామివారి గర్భాలయంపై వున్న గోపురం విభిన్నంగా ఉంటుంది. మామూలుగా గర్భాలయాలపై ఏక కలశ గోపురం వుంటుంది. అయితే ఈ క్షేత్రంలో గాలిగోపురం లాగా ఐదు కలశాలను కలిగిన గోపురంవుండడం విశేషం. తిరువళ్లూరులోని శ్రీ వీరరాఘవస్వామికి ఉప్పు, మిరియాలు అంటే ప్రీతి. శ్రీ వీరరాఘవస్వామి వారిని దర్శించి ఉప్పు, మిరియాలను సమర్పించడంవల్ల వివిధ వ్యాధులు ప్రధానంగా చర్మవ్యాధులు నయమవుతాయని చేపట్టిన పనులు విజయవంతమవుతాయని చెబుతూ ఉంటారు.
కోరిన కోర్కెలు తీర్చే స్వామి శ్రీ వీరరాఘవేంద్ర స్వామి. పుత్రసంతానము లేని వారు పుష్య బహుళ అమావాస్య నాడు వరిపిండి మరియు బెల్లంతో కూడిన చలివిడి చేసి, ఆ చలివిడి మధ్యలో ఆవునెయ్యి - ప్రత్తితో దీపం వెలిగించి, ఆ దీపం ఘనం అయ్యాక ముగ్గురు లేక మన స్థోమతను బట్టి కొంతమంది ముత్తైదువులకు దక్షిణ - తాంబూలాలను ఇచ్చుకోవాలి. దీపము వెలిగించిన వత్తిని చలివిడి లేక పాలు లేక నీళ్ళతో మింగినట్లయితే పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారని నానుడి. పిల్లలు లేనివారికి ఇచ్చిన పుణ్యమే. పిల్లలు ఉన్నవారు మింగితే కడుపుచలువ అంటారు. 'వీరరాఘవుడు' ని 'వైద్య రాఘవుడు' అని కూడా అంటారు. రాఘవేంద్రుడు ఔషధుల మూటని తన తలక్రింద ఉంచుకొని పడుకుంటాడని, బాధలతో (అనారోగ్యంగా) ఉన్నవారు అతనిని కొలిస్తే, వారి బాధలని తొలగించుతాడు అని అంటారు.
పుష్యబహుళ అమావాస్య రోజున మరొక విశేషము ఉంది. ఈరోజున సింహాచలంలో వెలసిన లక్ష్మీ వరాహ నృసింహ స్వామికి కొండ దిగువనున్న వరాహ పుష్కరిణిలో తెప్పోత్సవం జరుగుతుంది. దీనినే 'తెప్ప తిరునాళ్ళు' అని కూడా అంటారు. సింహాద్రి అప్పన్న శ్రీకృష్ణుని అలంకరణలో, ఉభయ దేవేరులతో కలసి తెప్పలో వాహ్యాళి చేసి, అనంతరం గోపికల రథంపై కొండ దిగువున తిరువీధి తిరిగుతాడు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం.
- sweta vasuki