Shivatandavam - Comedy Serial 34

 

34వ భాగం 

గబగబా గంట స్థంభం దగ్గరికి పరుగెత్తాడు డేవిడ్.

వసుంధరని చూచి గట్టిగా అరిచాడు.

"ఇందాకే తొమ్మిది కొట్టాను దిగూ!" నాలుగోగంట వినిపించింది.

డేవిడ్ గంట స్థంభం ఎక్కుతున్నాడు. అయిదోసారి వినిపించింది. శివుడు గోడ గడియారం వైపు చూశాడు. అది తొమ్మిది అయిదు నిమిషాలు చూపెడుతోంది. మరోసారి చర్చి గంట వినిపించింది. శివుడు లేచి గోడగడియారాన్ని సరిగ్గా తొమ్మిదికి అడ్జెస్టు చేశాడు. ఏడోసారి మోగింది. డేవిడ్ అరుస్తూ వసుంధరని పట్టుకోబోయాడు.

ఎనిమిదోసారి ...తొమ్మిదోసారి కూడా గంట కొట్టేసింది వసుంధర. డేవిడ్ ఆమెను పట్టుకున్నాడు. వసుంధర అతన్ని వదిలించుకుని గబగబా గంట స్థంభం దిగుతోంది. డేవిడ్ ఆమెను వెంబడిస్తున్నాడు. వసుంధర గంట స్థంభం దిగేసి ఆవరణలో పరుగెడుతోంది. డేవిడ్ ముక్కుపుటాలు ఎగురవేస్తూ ఆమెతో పాటు పరుగెడుతున్నాడు పట్టుకోవడానికి. చివరకి వసుంధరను పట్టుకున్నాడు డేవిడ్.

"ఎక్కడికి పోతావిప్పుడు ? నడు ! నీ పుణ్యమాని మొత్తం పద్దెనిమిది గంటలు వినిపించావేం. ఊరోళ్ళేమనుకుంటారో...నా ఉద్యోగమేమౌద్దో ! తెలిసే కొట్టావా గంటలు ! పద ! ఫాదర్ తో చెప్పి నీకు శిక్ష వేయించకపోతే నాపేరు డేవిడే కాదు, ఊ...నడు !" అంటూ లాక్కుపోతుంటే వసుంధర విడిపించుకోడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తోంది!

ఇంతలో మళ్ళా గంట మోగింది! డేవిడ్ పిచ్చెక్కిపోయింది. గంట స్థంభం వైపు చూశాడు. ఇప్పుడు కిష్టుడు గంట కొడుతున్నాడు. డేవిడ్ ఆకస్మాత్తుగా వసుంధరని వదిలేసి గంట స్థంభం వైపు చూశాడు.

ఇప్పుడు కిష్టుడు గంట కొడుతున్నాడు. డేవిడ్ ఆకస్మాత్తుగా వసుంధరని వదిలేసి గంట స్థంభం వైపు పరిగెడుతూ "కొట్టకూ, కొట్టకూ" అని అరుస్తున్నాడు. రెండోసారి కొట్టాడు కిష్టుడు.

డేవిడ్ చెవులు మూసుకుని మెట్లెక్కుతున్నాడు. ఈలోగా వసుంధర పారిపోయింది కుష్డుడికి చెయ్యూపుతూ. మూడోసారి కూడా గంట మోగేసరికి శివుడు తత్తరపడ్డాడు. గోడ గడియారం వైపూ, తన రిస్టు వాచీ వైపూ చూసుకుని తల గోక్కున్నాడు. నాలుగోసారి మోగింది. ఆ వేళకి డేవిడ్ గంట దగ్గిరికి వచ్చేశాడు. కిష్టుడ్ని అమాంతం వాటేసుకోబోయాడు. కిష్టుడు అంత ఎత్తునుంచీ అమాంతం దూకేసి పారిపోతున్నాడు.

డేవిడ్ కూడా దూకాలనే అనుకున్నాడుగానీ, అంత సాహసం చేయలేక గంటని కావలించుకుని ఆయాస పడిపోతున్నాడు. కిష్టుడూ వసుంధర నవ్వుకుంటూ వెడుతుంటే, దారిలో ఒకాయన రిస్టు వాచీని చేతులో పట్టుకుని కిష్టుడ్ని 'టైమెంతయింది బాబూ!" అని అడిగాడు.

"ఇరవై రెండు !" అన్నాడు కిష్టుడు. టైమగిన పెద్దమనిషి ఆ జవాబుకి బిత్తరపోయేడు. ప్రేమికులిద్దరూ ఝూమ్మని వెళ్ళిపోయారు.

శివుడు ఫోన్లో మాట్లాడుతున్నాడు "చూడండి ఫాదర్ ! మీ చర్చిలో గంటలు కొట్టే మనిషి పరాకుగా ఉన్నట్టున్నాడు. నేను తప్పు చెప్పక పోతే అతను ఇందాక మొత్తం ఇరవై రెండు గంటలు కొట్టాడు...యస్...ప్లీజ్ చెక్ హిమ్! బై ది వే కరెక్టు టైమెంతో చెప్పగలరా! థాంక్యూ!" అంటూ శివుడు ఫోన్ పెట్టేశాడు.

వాచీ దిద్దుకుంటూ..గోడగడియారం వైపు కదిలాడు. వసుంధరా, కిష్టుడూ క్రాస్ రోడ్స్ చేరుకున్నారు. అక్కడ క్షణం సేపు ఆగారు.

"కాలేజీ అవగానే నీ కోసం ఇక్కడే నిలుచుంటా! నువ్వు త్వరగా రావాలి! ఓ.కె?" అన్నాడు కిష్టుడు.

"ఒకవేళ నాకు లేటైపోతేనో!"

"ఎంత లేటైనా సరే! నువ్వు వచ్చేవరకూ ఇక్కడే నించుంటా! ఒకవేళ నువ్వే ముందు వస్తేనో?"

"నువ్వొచ్చెంత వరకూ నీ కోసం ఇక్కడే నించుంటా!"

"ఎంత లేటైనా!"

"గంటలూ రోజులే కాదు. నెలలు సంవత్సరాలైనా సరే నువ్వు రానిదే ఇక్కడ్నించి కదలను.