Antera Bamardee 4
నాలువ భాగం
బసవరాజు గారి మేడ. పూజ గదిలో జానకి పూజ పూర్తి చేసుకుంది.జానికీ...జానకీ అంటూ ఆర్తనాదం చేస్తున్న భర్తకి ఏమి అవసరమయ్యిందోనని గది బయటికి వచ్చి అడిగింది. “ఎందుకు అరుస్తున్నారు?ఏమైంది ?”
“ఏమైందా ?వనజ పెళ్లవుతోంది !”
“మంచిదేగా?ఆ మాట అరిచి చెప్పాలా చోద్యం కాకపొతే?”
“చోద్యం కాదే!నీ కూతురు పెళ్ళెప్పుడు చేస్తావని అడుగుతున్నాను!అచ్చెప్పు నాకు !”
“దాని పెళ్లికేం తొందర ?” ఆ మాట వినగానే బసవరాజు ఉగ్రుడయ్యేడు.అంచేత తారస్థాయిలో గొంతు పెంచేడు.
“అంతేనే !అంతే !వనజా వాళ్ళు తొందరపడి పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు.మనం మన అమ్మాయికీ మాత్రం తొందర పడకుండా తాపీగా పదీ పదిహేనేళ్ళు ఆగి ఆ తర్వాత చేద్దాం!అంతేనా ?”అన్నాడు.
అప్పటికి అక్కడికి ఉమ కూడా వచ్చేసింది.ఉమని చూడగానే తల్లికి కోపం వచ్చింది.అంచేత ఉమతో కోపంగానే అన్నది.
“ఏమే!వనజ పెళ్లి గురించి నాన్నగారితో ఎందుకు చెప్పేవ్ ?”అని.
“ఆ పెళ్ళికి వెళ్ళాలి కదా!పర్మిషన్ కోసం "అంది ఉమ.
“పర్మిషనా!నేను వెళ్ళమని చెప్పేనుగా!మళ్ళా ఆయన్నేందుకు అడగడం ?” ఆ మాట వినగానే బసవరాజు తట్టుకోలేకపోయాడు.తననొక ఆప్టరాల్ పెద్ద మనిషిగా జానకి భావిస్తోందని అర్ధం చేసుకున్నాడు.
ఇల్లాంటి సందర్భల్లో తెలివైన భర్త ఎట్లా రియాక్టు అవుతాడో,ఏం చేస్తాడో 'సంసారం...సంసారం'అనే పుస్తకంలో చెప్పే వుంటారు! ఆ పుస్తకం తనకి అందుబాటులో లేని కారణంగా సొంత బాణీ ఉపయోగిస్తూ అరిచేడు.
“అంటే...ఆడపిల్ల...అందునా పెళ్లి కావాల్సిన పిల్ల...తండ్రిని సంప్రదించకుండా...పర్మిషన్లనీ పొందకుండా..ఇష్టమొచ్చినట్లు విహారయాత్రలు చేయమని నీ కూతురికి సలహా యిస్తున్నావా ?అచ్చెప్పు నాకు !” అని గట్టిగా.
విహారయాత్రలనే మాట వినగానే జానక్కి కూడా రోషం తన్నుకు వచ్చేసింది.గట్టిగా అరవకపోయినా కొంచెం మంటగానే చెప్పింది.
“అదేమి విహర యాత్రలకు వెళ్లడం లేదు.పెళ్ళికి...ప్రండు పెళ్ళికి వెడుతోంది!అంతేగా ?”అంది.
“నో !నాకిష్టం లేదు !”అన్నాడు బసవరాజు.
“పెళ్ళికి వెళ్లడం కూడా తప్పేనా ?”అడిగింది జానకి.
“తప్పే!నా దృష్టిలో తప్పే!తనకి పెళ్లి కాకుండా తన ఈడు పిల్ల పెళ్ళికి వెళ్లడం తప్పున్నర తప్పు.ఈ విషయం సంసారం...సంసారంలో చెప్పే వుంటారు.ముందు ఉమకి పెళ్లి చెయ్యాలి.ఆ తర్వాతనే పెళ్ళిళ్ళకు పంపించాలి "అన్నాడు బసవరాజు.
“బాగానే వుంది చోద్యం.ఉమకి పెళ్లి చేయాలంటే మంచి సంబంధం దొరకాలి.అల్లాంటి సంబంధం ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతుంది ?”అన్నది జానకి.
“ఎందుకు దొరకదు?తప్పకుండా దొరుకుతుంది.ఉమకి ఏమి తక్కువని ?వెతకాలే గాని బోలెడు సంబంధాలు !ఎవరో యోగ్యుడు రెడీగానే వుండి ఉంటాడు.ఈ విషయమై అర్జంటుగా మీ అన్నకి ఉత్తరం రాయి.ఆ ఆ ఉత్తరాలు టెలిగ్రామ్ లూ వద్దులే.ఫోన్లో మాటాడు.అతను కూడా నీకు మల్లె ఉమకి అప్పుడే పెళ్ళా అని ఆక్రందన చేస్తే నాతో మాటాడమను!/'” అని జానకి మాట వినిపించుకుకుండానే "రంగా...రంగా...”అంటూ కారు డ్రైవర్ను పిలుస్తూ ఇంట్లోంచి బయటపడుతున్నాడు.
తల్లీ కూతుర్లీద్దరూ మొహమొహాలు చూసుకుంటున్నారు. విషయం వరాన్వేషణ వేపు మళ్ళింది కనుక ఈ కథ కూడా వరుడ్ని పరిచయం చేయడానికి సిద్ధ పడింది.
అతని పేరు వేణు.
అతను చాలా అందంగా వున్నాడు.
గొప్ప దర్జాగా వున్నాడు. ఎంతో ఠీవీగా వున్నాడు. ప్రస్తుతం వేణు ఆ రైల్లో టూ టైర్ ఏ.సి.లో ప్రయాణం చేస్తున్నాడు.కాఫీ తాగడం పూర్తి చేసేడు. డబ్బులిచ్చేందుకు పర్సు తీసేడు! ఆ పర్సులోంచి పదినోటు లాగబోతుంటే పర్సులో వున్నా ఉమ కనిపించింది. ఆ పదినోటు మనిషికిచ్చి ఉమ ఫోటోను చూసుకుంటూ మురిసిపోతున్నాడు.
ఉమ!
అందమైన పేరు.
ఆ పేరతనికిష్టం.
ఆ పేరు పెట్టుకున్న ఉమ ఎంతో యిష్టం.
పెళ్ళంటూ చేసుకుంటే ఈ భూలోకంలో ఒక్క ఉమనే చేసుకుంటానని అద్దం ముందు నిలబడి
ప్రతిరోజూ ప్రతిజ్ఞ చేయడం కూడా చాలా చాలా చాలా యిష్టం.
(ఇంకావుంది)
(హాసం సౌజన్యంతో)