అమ్మో అమ్మాయిలు 9
“నా పేరు వెనుక యింత కథ వుంది" అంటూ అబ్బులు ముగించి కళ్ళజోడులోంచి జయచిత్రను అమాయకంగా చూశాడు.
“మీ పేరు మీద ఓ పెద్ద కథ రాయొచ్చు" అంది జయచిత్ర.
“నిక్షేపంగా కథ రాసుకోండి. మాకు మాత్రం మీ యింట్లో నివశించటానికి అనుజ్ఞ యివ్వండి చాలు" అన్నాడు అబ్బులు అసలు విషయానికొస్తూ.
“మీకన్నా ముందే మా ఫ్రెండ్స్ కిచ్చానని చెప్పాగా!” అంది జయచిత్ర.
“మరి వాకిట్లో టులెట్ బోర్డ్ ఎందుకుందండి?” అంటూ సాగదీశాడు వ్యాకర్ణ.
“తియ్యలేదు కాబట్టి.”
“ఎందుకు తియ్యలేదు?”
“టైమ్ లేక"
“ఎందుకు టైమ్ లేక?”
“సినిమా కెళ్ళాం కాబట్టి.”
ఏడు చేపల కథలాగా వ్యాకర్ణ జయచిత్ర మాట్లాడుకుంటుంటే బామ్మగారు అడ్డు తగిలింది. “అబ్బాయిలు చూడబోతే చాలా మంచివాళ్ళు లాగున్నారు. అద్దెకిస్తానని మాట ఇచ్చాను. బ్రహ్మచారులయినంత మాత్రాన కోతుల్లా అల్లరి చేస్తారనుకోను. పెద్ద పెద్దవాళ్ళకే బుద్దులు సరిగా లేవు" అదనీ ఇదనీ జయచిత్ర చెప్పి కుంటిసాకులన్నింటికి అడ్డు తగిలి కొట్టిపారేసింది బామ్మగారు. సమయం చూసి తామెంత బుద్దిమంతులమయింది చెపుతున్నారు వ్యాకర్ణ అబ్బులును.
అయితే జయచిత్రకి ముక్కుమీద కోపం, ఆత్మాభిమానం, గడుసుదనం, అల్లరితనం, పొగరు లాంటివి వున్నాయి కాబట్టి ఆ అబ్బాయికి చాలా చాలా జాగ్రత్తలు వివరాలు చెప్పాలంది జయచిత్ర.
“అద్దెకివీళ్ళు రావటం ఒప్పుకున్నావు కాబట్టి యిహ నీ యిష్టం" అంది బామ్మగారు నెత్తిన ముళ్ళకిరీటం సరి చేసుకుని.
ఆ తర్వాత వాళ్లనక్కడే వదిలేసి పనుండబట్టి లోపలికెళ్ళింది బామ్మగారు. “హు....హ్హూ" అని హూంకారం లాటిది చేసి "నే చెప్పేది జాగ్రత్తగా వినండి. ఏ మాత్రం వూరుకోను. ఇంట్లో అడుగు పెట్టింతర్వాత పొరపాట్లు చేసినా వూరుకోను. తక్షణం వెళ్ళగొట్టేస్తాను" అంది జయచిత్ర.
అబ్బులు భూతద్దాలలోంచి జయచిత్రను చూస్తూ 'మీ ఇష్టం" అన్నాడు.
వెంటనే వ్యాకర్ణ "వీడిష్టమే నా యిష్టం. నా యిష్టమే వీడిష్టం. మీ యిష్టమే మా యిద్దరి యిష్టం" అన్నాడు వినయ విధేయతలతో చేతులు కట్టుకుని.
జయచిత్ర రెండు కుర్చీలు వాళ్ళిద్దరికీ వేసి కూర్చోండని చెప్పి తానో కుర్చీలో బాసి పట్టేసుకుని కూర్చుంది. 'పిల్ల మనకి కుర్చీ లేసి కూర్చోమని గౌరవించందిరోయ్ అన్నాడు వ్యాకర్ణ అబ్బులు చెవిలో నోరు పెట్టి.
“మర్యాదా లేదు మన్నూ లేదు. ఈవిడగారేదో చిన్న సైజు ఉపాన్యాసమో తెలుగు పంతులమ్మ యిచ్చే లెచ్చర్, బలవంతపు నీతిబోధ ఏదో చేయబోతున్నది. నుంచుంటే కాళ్ళు పీకుతాయని తను కూర్చుని మనం నుంచుంటే బాగుండదేమోమని కుర్చీలేసి కూలేసింది" అంటూ అబ్బులు వ్యాకర్ణ చెవి కొరిక కొరికాడు.
'అంతే నంటావురా అబ్బూ! నీళ్ళూ కారిపోతూ అన్నాడు వ్యాకర్ణ.
“అంతేగాక...!” అన్నాడు అబ్బులు
నీళ్ళలా కారిన చెమట కర్ చీఫ్ తో తుడుచుకుంటూ. జయచిత్ర లోపలికెళ్ళి తనకో కుర్చీ తెచ్చుకుని లోపల అబ్బులు వ్యాకర్ణ చెవులు కొరుక్కుని నోరు మూసుకున్నారు. తాపీగా కుర్చీలో కూర్చున్న జయచిత్ర అందమైన పంతుకమ్మలా ముఖంపెట్టి అబ్బులుని వ్యాకర్ణని రెండోక్లాసు పిలకాయల్ని చూసునట్లు చూసి 'ఆ... ఎంతవరకొచ్చాను?” అంది. అర్థంగాని అబ్బులు భూతద్దాలలోంచి వ్యాకర్ణని చూశాడు. అబ్బులుగాడు
ముఖం తిప్పేశాడని గ్రహించిన వ్యాకర్ణ ఏ మాత్రం తడుముకోకుండా "మీరు మాకు కుర్చీలు తెచ్చి వేసి మీరు మరో కుర్చీ తెచ్చుకుని వేసుకున్నారు. అంతవరకూ వచ్చామండీ జయగారూ!” అన్నాడు.
“ఏడ్చినట్లే వుంది" అంది జయచిత్ర.
“ఏంటండీ? యిలా కూర్చోటమా?” అన్నాడు వ్యాకర్ణ.
“మీరు చెప్పింది" టకీమని అంది జయచిత్ర.
'నులకతాడు దిబ్బనంతో ఈ పిల్ల నోరు కుట్టాలి' కసిగా అనుకున్నాడు వ్యాకర్ణ.
“దొండపండులాంటి పెదవులు ఎంత ముద్దొస్తున్నాయో చూడు. వాటిని కుట్టటానికి ఎలా మనసొప్పిందిరా రాక్షసుడా!” అంటూ అంతరాత్మ లోపలినుంచే కేకేసింది.
“సరే, పెదవులు దొండపండ్లే! నాలుక మాటేంటి? అది నాలుకా! తాటిపట్టా? ఎంత యిది? ఎంత యిది? ఇల్లు ఈవిడ గారిదని మేమద్దెకొస్తున్నామని అంట యిది పనికిరాదు. అయిన నీ గోలేంటి మధ్యలో!” అంటూ అంతరాత్మని కోప్పడ్డాడు వ్యాకర్ణ.
“ఏమండీ అబ్బూ! మీరేం సబ్బు వాడతారు?” అంది జయచిత్ర డైంట్ వీల్ లా వున్న టినోపాల్ ఏజెంట్ దుస్తులు ధరించిన భూతద్దాల కళ్ళజోడు అబ్బుల్తో.