ఆ లోపం దైవానిదా
ఆ లోపం దైవానిదా ?
విజయాన్ని వరించిననాడు.. తనంతటివాడు లేడని విర్రవీగుతాడు మానవుడు.
పరాజయం రుచి చూసిననాడు.. పరమాత్ముని నిందిస్తాడు.., అదే మానవుడు.
గెలుపుకు, నీవు బాధ్యుడవైనప్పుడు.. ఓటమికి కూడా నీవు బాధ్యత వహించాలికదా. మరి ఈ దైవదూషణ ఎందుకు? ఓ మనిషీ...ఒక్కసారి ఆలోచించు. ఈ సృష్టిలోని అన్ని ప్రాణులలాగే., నిన్ను పుట్టించాడు. కానీ ఏ ప్రాణీ..ధైవాన్ని ప్రశ్నించదు.., నిందించదు. ఈ జబ్బు ఒక్క మనిషికే. మనకు దైవాన్ని దర్శింపజేసే ఆధ్యాత్మిక గ్రంధాలు ఎన్నో ఉన్నాయి. రామాయణ, భారత, భాగవత, భగవద్గీత వంటి గ్రంథాలు, దైవం ఉనికిని మనకు పరిచయం చేస్తూనే ఉన్నాయి. అన్ని గ్రంథాలు మనం చదువుతాం, అర్థం చేసుకుంటాం. పూజలు, వ్రతాలు, నోములు, యాగాలు చేస్తూనే ఉంటాం. విజయాన్ని వరించిననాడు., ‘నేనే’ అని మీసం మెలేస్తాం.. ఓటమి వెక్కిరించినవేళ, అంతా ‘వాడే’ చేసాడని వాపోతాం. ఇదెంతవరకు న్యాయం? లోపం నీదా? లేక.. లోపం దైవానిదా ? ఏనాడైనా ఆలోచించావా? ఇప్పుడైనా ఆలోచించు.
తక్కిన ప్రాణులకు ఇచ్చినట్టే.. నీకు అన్ని అవయవాలు ఇచ్చాడు. వాటిని ఉపయోగించుకనే తెలివితేటలు, బుద్ధి కూడా ఇచ్చాడు. జీవనక్షేత్రంలో యుద్ధం చేయాల్సింది నీవు. నీకోసం నీవు యుద్ధం చేస్తున్నావు. మరొకరి కోసం కాదు. ఈ సత్యాన్ని నీవెప్పుడు మర్చిపోకూడదు. ఇది మంచి.. ఇది చెడు.. అనే ఙ్ఞానం నీకుంది. ఏది చెయ్యాలో... ఏది చెయ్యకూడదో.. మన ఋషులు ఎప్పుడో చెప్పారు. అవన్నీ పుక్కిటి పురాణాలని ప్రక్కన పెట్టి.. నీ మనస్సు ఎలా పరుగెత్తమంటే.. అలా పరుగెత్తి.., నీ బుద్ధి ఎలా చెప్తే.. అలా చేసి..ఫలితం తారుమారైనప్పుడు..దైవాన్ని నిలదీయడం ఎంతవరకూ న్యాయం..? నీ స్థితి నీవు మరచి..స్థాయికి మించిన కోరికల వెంట నిన్ను పరుగులు తీయమన్నాడా.. ఆ దేవుడు? ఆశయం ఎప్పుడూ ఆకాశమంత ఎత్తులో ఉండాలి. అది తప్పు కాదు.
ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది మానవుడే......
చంద్రమండలం మీద తొలి అడుగు వేసిందీ మానవుడే......
చరిత్రలో అసాధారణ విజయాలు సాధించిన ప్రతిమానవుడు..తొలిపరాజయమాలను ధరించినవాడే. కానీ, వాడు ఏనాడు దైవాన్ని నిందిస్తూ కూర్చోలేదు. ఓటమే.. విజయానికి తొలి సోపానమనుకున్నాడు. విజయమే గమ్యంగా..దానిమీద కాలుంచి, ప్రయాణం సాగించాడు. అందుకే విజయాన్ని అందుకున్నాడు.
అయితే..ఈ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. అవి వేరేవీ కావు. నీ బలహీనతలే నీ అడ్డంకులు.
వ్యసనాలు.. నిన్ను ఊరిస్తాయి.
కోరికలు...నిన్ను శాసిస్తాయి. పతనానికి పరదాలు తీస్తాయి.
ఇక్కడే... నిన్ను నీవు నిలదోక్కుకోవాలి. బలహీనత ఒకసారి నీపై గెలుపు సాధించవచ్చు. అంతమాత్రాన.. నీవు చేతకాని వాడవు కాదు. నీ మనసుపై నీవు పట్టు సాదించినప్పుడు..ఆ బలహీనతే..నీ బానిస అవుతుంది. అప్పుడు నీకు ఎదురే ఉండదు. నువ్వు వేసే ప్రతి అడుగులోను విజయం ఉంటుంది. ఈ సత్యాన్ని గుర్తించాలే కానీ..దైవాన్ని నిందిస్తూ కూర్చుంటే ప్రయోజనం శూన్యం. ఆయన.. నీ దూషణ, భూషణ, తిరస్కారాలను పట్టించుకోడు. ఈ జీవన రణక్షత్రంలో.. నీ పోరాటపటిమ ఏపాటిదో...సాక్షీభూతుడై వీక్షిస్తూంటాడు.
అంతేకానీ.. నువ్వు నాకీ పని చేసి పెట్టు..నీకు పది కొబ్బరికాయలు కొడతాను.. నీకు అభిషేకాలు చేస్తాను.. కుంకుమార్చనలు చేస్తాను... అని దేవునితో బేరాలు పెట్టడం.. లంచాలతో లొంగదీసుకోవాలనుకోవడం..నీ లోపం కానీ.. ఆ దేవుని లోపం కాదు. ముందు ఇది గుర్తించు. చివరిగా ఒక్క విషయం...
నువ్వు చేసే మంచే...నిన్ను విజయపథంలో నడిపిస్తుంది.
నువ్వు చేసే చెడే...నిన్ను పతనపాతాళానికి నెట్టేస్తుంది.
- యం.వి.యస్. సుబ్రహ్మణ్యం