తెలుగునాట సూర్యదేవాలయం - గొల్లల మామిడాడ
తెలుగునాట సూర్యదేవాలయం - గొల్లల మామిడాడ
హైందవులకు ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. వైదిక కాలంలో, మిగతా దేవతలతో పోలిస్తే సూర్యారాధనకే అధిక ప్రాధాన్యత ఉండేది. అయితే కాలం గడిచేకొద్దీ సూర్యునికి ప్రత్యేకించిన దేవాలయాల సంఖ్య తగ్గిపోయింది. అలాంటి అతి కొద్ది సూర్య దేవాలయాలలో రెండు ప్రాచీన ఆలయాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండటం విశేషం. వీటిలో అరసవల్లి గురించి అందరికీ తెలిసిందే! శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి గ్రామంలో ఉన్న ఈ దేవాలయం దాదాపు 1500 సంవత్సరాలుగు భక్తుల పూజలందుకుంటోంది. ఇక్కడి స్వామిని కొలుచుకున్నవారి కష్టాలు తొలగి, హర్షంతో తిరిగి వెళ్తారు కాబట్టి ఒకప్పుడు ఈ ఊరుకి హర్షవల్ల అనే పేరు ఉండేది. అదే కాలక్రమేణా అరసవల్లిగా మారింది.
ఇక తెలుగు ప్రజలకి సైతం అంతగా తెలియన మరో పురాతన సూర్య ఆలయం తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంది. కాకినాడకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో గొల్లల మామిడాడ అన్న గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ గ్రామం చెంతనే తుల్యభాగా నది అంతర్వాహినిగా ప్రవహిస్తోందని ఓ నమ్మకం. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గొల్లల మామిడాడలో అంతే చరిత్ర కలిగిన ఆలయాలకీ కొదవ లేదు. 160 అడుగుల ఎత్తు గోపురం కలిగిన రామాలయం, వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సూర్యదేవాలయం వాటిలో ప్రముఖమైనవి. ఊరిలోకి అడుగుపెడుతూనే అనేక గోపురాలు దర్శనమిస్తుంటాయి. అందుకే ఈ ఊరిని గోపురాల మామిడాడ అని కూడా పిలుచుకుంటారు.
గొల్లల మామిడాడలోని సూర్యనారాయణస్వామి దేవాలయం ఈనాటిది కాదు. ఎప్పుడో 1902లో కొవ్వూరి బసివిరెడ్డి అనే జమీందారు భక్తిశ్రద్ధలతో ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నిరాటంకంగా ఈ ఆలయంలో పూజాదికాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆదివారం వేళ్లలో ఈ ఆలయంలో జరిగే విశేష పూజలను చూసి తీరాల్సిందే. ఇక రథసప్తమి వంటి పర్వదినాలలో అయితే స్వామివారికి జరిగే కళ్యాణంలో పాలుపంచుకునేందుకు వేలాది భక్తులు వస్తుంటారు.
గొల్లల మామిడాడలో సూర్య భగవానునికి ఆలయం ఉండటమే ఓ విశేషం అయితే, ఈ స్వామి ఉష, ఛాయ అనే దేవేరులతో కలిసి సతీసమేతంగా దర్శనమివ్వడం మరో ప్రత్యేకత. ఈసారి తూర్పు గోదావరికి వెళ్లినప్పుడు ఈ విశిష్టమైన దేవాలయాన్ని చూసే ప్రయత్నం చేయండి. చుట్టూ ప్రకృతి సోయగాల మధ్య, ఆ ప్రకృతికి పురుషునిలా భాసిస్తూ ఉండే సూర్యుని ఆలయాన్ని చూడటం ఓ గొప్ప అనుభూతిగా మిగిలిపోతుంది.
- నిర్జర.