విఘ్ణమూర్తి అవతారాలకంటే వినాయకుడి రూపాలే ఎక్కువ
విఘ్ణమూర్తి అవతారాలకంటే వినాయకుడి రూపాలే ఎక్కువ
గణపతి రూపాలు ముప్పైరెండు
ముచ్చటైన రూపాంతరాలు అనేకం
తొలి పూజలు అందుకునే ఆదిదేవుడిగా, విఘ్నాలను తొలగించే దైవంగా, సకల శుభాలన్చిచ్చే స్వరూపుడిగా, గణాలకు అధిపతిగా వినాయకుడిని పూజిస్తాం.
రకరకాల రూపాల్లో ఆయన విగ్రహాలు తయారుచేసి వాడవాడలా మండపాలు ఏర్పాటుచేసి ఆరాధిస్తాం. నచ్చిన రూపంలో మనసారా అర్చిస్తాం. అయితే మనం ఎన్నో రూపాల్లో తయారుచేసుకుని పూజించే ఈ గణనాయకుడికి అసలు రూపాలు 32 అని శాస్త్రాలు చెప్తున్నాయి. విఘ్ణమూర్తి అవతారాలకంటే వినాయకుడి రూపాలే ఎక్కువగా ఉన్నాయట.
వినాయకుడి ఆ ముప్ఫైరెండు రూపాల్లో పదహారు రూపాలలో ఉండే విష్నేశ్వరుడి గురించిన ప్రత్యేక వివరణ పురాణాల్లో కనిపిస్తోంది. ఈ పదహారు రూపాలు ..బాల గణపతి, తరుణ గణపతి, భక్త, వీర, శక్తి, ద్విజ, పింగళం, ఉచ్చష్ట, విఘ్నరాజం, క్షిప్ర, హేరంబం, లక్ష్మీవిఘ్నేశ, మహావిఘ్నం, భువనేశం, నృత్త, ఊర్ధ్వ గణపతి. ఆయా రూపాల్లో కూర్చోనే భంగిమ, చేతుల్లో ధరించే ఆయుధాలు, వస్తువులు వేరువేరుగా ఉంటాయి. ఈ పదహారు రూపాల్లో ఒక్కొక్క రూపాన్ని పూజిస్తే ఒక్కొక్క శక్తి వస్తుందట.
1 బాల గణపతి
ముచ్చటైన రూపంలో దర్శనమిచ్చే ఈ రూపానికి నాలుగు చేతులు ఉంటాయి. కుడి వైపు చేతులలో అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తారు. బుద్ధి చురుకుగా పనిచేయాలంటే ఈ బాల గణపతిని పూజించాలి. బుద్ధివికాసంతో పాటు ప్రతివిషయాన్ని శ్రద్ధతో పరిశీలించే సూక్ష్మ దృష్టి అబ్బుతుంది.
2 తరుణ గణపతి
ఈ రూపం అభయముద్రలో కనిపిస్తుంది. ఎనిమిది చేతులుంటాయి. కుడి వైపు చేతులతో పాశం, వెలగ పండు, దంతం, చెరకు ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, నేరేడు పండు, వరి కంకి పట్టుకుని అభయముద్రతో దర్శనమిస్తారు తరుణ గణపతి. ఈ రూపాన్ని పూజిస్తే చేపట్టిన కార్యాన్ని సాధించి తీరాలనే పట్టుదల కలుగుతుంది.
3 భక్త గణపతి
భక్త గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు రెండు చేతులలో కొబ్బరికాయ, అరటిపండు, ఎడమ వైపు ఉన్న చేతులలో మామిడి పండు, బెల్లపు పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకుని కనిపిస్తారు ఈ రూపాన్ని పూజిస్తే భక్తిభావం పెరుగుతుంది.
4 వీరగణపతి
వీరగణపతి రూపానికి పదహారు చేతులుంటాయి కుడి వైపు చేతులతో బాణం, బేతాలుడు, చక్రం, మంచపుకోడు, గద, పాము, శూలం, గొడ్డలి బొమ్మ ఉన్న జెండా, ఎడమవైపు ఉన్న చేతులతో శక్తి అనే ఆయుధం, విల్లు, ఖడ్గం, ముద్గరమనే ఆయుధం, అంకుశం, పాశం, కుంతమనే ఆయుధం, దంతం ధరించి దర్శనమిస్తారు. ఈ రూపంలో ఉండే గణపతిని పూజించినవారికి మంచి ధైర్యం వస్తుంది.
5 శక్తి గణపతి
శక్తి గణపతి రూపానికి నాలుగు చేతులు ఉంటాయి. అంకుశం, పాశం పట్టుకుని దర్శనమిస్తారు. ఈ రూపాన్ని పూజిస్తే ఆత్మస్త్థెర్యం పెరుగుతుంది.
6 ధ్వజగణపతి
ధ్వజగణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులతో పుస్తకం, దండం ఎడమవైపు చేతులతో అక్షమాల, కమండలం పట్టుకుని దర్శనమిస్తారు. ఈ రూపాన్ని పూజిస్తే సొంతంగా ఆలోచించగల శక్తి పెరుగుతుంది.
7 సిద్ధి గణపతి
సిద్ధి గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి. ఎడమవైపు చేతులతో పండిన మామిడిపండు, కుడివైపు ఉన్న చేతులతో పూలగుత్తి, గొడ్డలి పట్టుకుని కనిపిస్తారు. తన భార్యలైన సిద్ధి, బుద్ధి సమేతంగా దర్శనం ఇస్తాడు. ఈ గణపతిని సేవిస్తే ప్రారంభించిన పనులలో అపజయమన్నది ఉండదు.
8 ఉచ్ఛిష్ట గణపతి
ఉచ్ఛిష్ట గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడివైపు చేతులతో నల్ల కలువ, వరికంకి, ఎడమ వైపు ఉన్న చేతులతో దానిమ్మపండు, జపమాల పట్టుకుని కనిపిస్తారు. ఈ గణపతి మనసారా పూజిస్తే కోర్కెలు తీరుతాయి. ఈ గణపతికి చేసే పూజ జాగ్రత్తగా చేయాలి. భక్తి లేకుండా తూతూ మంత్రంగా పూజ నిర్వహిస్తే ఇబ్బందులు తప్పవని పెద్దలు హెచ్చరిస్తారు.
9 విఘ్నగణపతి
విఘ్న వినాయకుడి రూపానికి పది చేతులు. కుడివైపు ఉన్న చేతుల్లో శంఖం, విల్లు, గొడ్డలి, చక్రం, పూలగుత్తి, ఎడమ వైపు ఉన్న చేతులతో చెరకు, పూలబాణం, పాశం, విరిగిన దంతం, బాణాలు పట్టుకుని కనిపిస్తారు. విఘ్నాలు తొలగాలంటే ఈ గణపతి రూపానికి పూజలు చేయాల్సిందే.
10 క్షిప్త గణపతి
క్షిప్త గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో దంతం, రత్నాలు పొదిగిన బంగారు కుండ, ఎడమ వైపు ఉన్న చేతులతో కల్పవృక్షపు తీగ, అంకుశం ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని పూజిస్తే కోరికలు తీరుతాయి.
11 హేరంబ గణపతి
హేరంబ గణపతి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో అభయముద్రనిస్తూ, కత్తి, అక్షమాల, గొడ్డలి, మోదకం ధరించి, ఎడమవైపు ఉన్న చేతులతో వరద హస్త ముద్రతో విరిగిన దంతం, అంకుశం, ముద్గరం, పాశం ధరించి కనిపిస్తారు. ఈ రూపంలోని గణపతిని పూజిస్తే ప్రయాణాలలో ఎదురయ్యే ఆపదలను నివారిస్తారు.
12 లక్ష్మీ గణపతి
లక్ష్మీ గణపతి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో వరదముద్రనిస్తూ, కత్తి, చిలుక, మాణిక్యం పొదిగిన కుంభం, పాశం, ఖడ్గం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అభయ హస్త ముద్రతో దానిమ్మ, అంకుశం, కల్పలత, అమృతం ధరించి కనిపిస్తారు. ఈ రూపంలోని గణపతిని మనసారా పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుంది.
13 మహాగణపతి
మహాగణపతి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతులతో మొక్కజొన్న కండె, బాణం తొడిగిన విల్లు, పద్మం, కలువ, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో గద, చక్రం, పాశం, వరికంకి, రత్నాలు పొదిగిన కలశం ధరించి కనిపిస్తారు. ఈ రూపంలోని గణపతిని సేవిస్తే సమస్త శుభాలూ కలుగుతాయి. ఏలిననాటి శనితో బాధపడుతున్నవారు కూడా ఈ రూపంలోని వినాయకుడిని పూజిస్తే తలపెట్టిన పనులు విఘ్నాలు లేకుండా పూర్తి అవుతాయి.
14 విజయ గణపతి
విజయ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, పండిన మామిడి పండు ధరించి కనిపిస్తారు. ఈ రూపాన్ని పూజిస్తే సమస్త విజయాల కలుగుతాయి.
15 నృత్య గణపతి
నృత్య గణపతి రూపంలో తాండవం చేస్తూ దర్శనమిస్తాడు. అందుకే ఈ రూపంలోని గణనాథుడిని తాండవ గణపతి అని కూడా పిలుస్తారు. కుడి చేతులలో పాశం, అప్పాలు, ఎడమ వైపు చేతులతో అంకుశం, పదునుగా ఉన్న విరిగిన దంతం ధరించి దర్శనమిస్తారు. సంతృప్తిని, మనశ్శాంతినీ ఇచ్చే ఈ గణపతి
16 ఊర్ధ్వ గణపతి
ఊర్ధ్వ గణపతి రూపానికి ఎనిమిది చేతులుంటాయి. కుడి చేతులలో కలువ, పద్మం, విల్లు, విరిగిన దంతం, ఎడమ వైపు చేతులతో వరి కంకి, వెన్ను, చెరకుముక్క, బాణం, మొక్కజొన్న కండె తో కనిపిస్తారు. ఈ రూపంలోని వినాయకుడిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెప్తారు.
ఈ పదహారురకాల రూపాల లోని గణపతులను పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని పురాణాలు వివరిస్తున్నాయి. అయితే పురాణాల్లోని ఈ 32 రూపాలు, ప్రధానంగా పూజలందుకునే 16రూపాలే కాకుండా వందలాది రూపాల్లో కలియుగంలో వినాయకుడు దర్శనమిస్తాడు. ఆధునిక హంగులు అద్దుకుని బహుబలి గణేష్, సూపర్ మ్యాన్ గణేష్, సైనిక గణేష్, సాప్ట్ వేర్ గణేష్ ఇలా అనేక రూపాల్లోకి రూపాంతరం చెంది గణపతయ్య కొలువుతీరి భక్తుల కొంగుబంగారమై దీవెనలిస్తాడు.