Read more!

ఊర్మిళాదేవి ఇంత గొప్పదని మీకు తెలుసా!

 

ఊర్మిళాదేవి ఇంత గొప్పదని మీకు తెలుసా!

అవతారపురుషుడైన శ్రీరామచంద్రుడి గుణవిశేషణాలకు ప్రభావితులై ఆయన సోదరుల నుంచి సకల పరివార జనం ఆదర్శమూర్తులుగా అలరారి తరించారు. అలా త్యాగనిరతిలో సీతమ్మవారికి సాటిగా లక్ష్మణుడి అర్ధాంగి ఊర్మిళాదేవి ఉదాత్త వ్యక్తిత్వాన్ని చాటుకుంది. సీతాదేవి ప్రాభవం మాటున మరుగున పడినట్లు కనిపించినా, ఆమె ఔన్నత్యం ఎన్నటికీ మరువరానిది! అందుకే గోస్వామి తులసీ దాస్ తన రామచరిత మానస్'లో 'ఓ ఊర్మిళాదేవీ! నాకు నీ ఔదార్యాన్ని వర్ణించే శక్తి లేదు. నీకు వందనం మాత్రమే చేయగలను' అంటాడు.

సీతారాముల పట్టాభిషేకం అన్న శుభవార్తకు ముందుగా స్పందించి, సంతోషపడిన వ్యక్తి ఊర్మిళాదేవి. అదే ఆనందంతో ఆ వైభవాన్ని ఊహించుకుంటూ అంతఃపురంలో ఒక కల్పనా చిత్రాన్ని గీస్తూ ఉంటుంది. ఆ సమయంలో భర్త లక్ష్మణుడు హడావిడిగా, ఆందోళనగా ఆమె మందిరంలోకి అడుగు పెడతాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది ఊర్మిళ. ఆ తొట్రుపాటుకు రంగులన్నీ తొణికి, చిత్తరువు చెడిపోతుంది. 'కైకమ్మ వలన అన్న పట్టాభిషేకమే భంగమైంది. ఇక ఈ చిత్రానిదేముంది!' అంటూ కుమిలిపోతాడు లక్ష్మణుడు.

'పధ్నాలుగు సంవత్సరాలు అన్నావదినల సేవకై నేనూ అడవులకు వెళుతున్నాను' అంటాడు ఆ సౌమిత్రి. కళ్ళనీళ్ళతో అలా ఉండిపోయింది ఆ అర్ధాంగి! భర్త రమ్మన లేదు, తనూ సీతమ్మవారిలా వెంటవస్తానని పట్టుబట్టలేదు. పైగా 'మీ అన్నావదినల సేవలో తరించండి. కానీ నా ప్రార్ధన ఒక్కటే! మీరు వనవాస కాలంలో నా గురించి ఒక్కక్షణం ఆలోచించినా మనస్సు చలించిపోతుంది. మీ సేవకు ఆటంకం కలుగుతుంది. నా చింత వీడండి' అంటుంది.

అందుకే సీతారామ లక్ష్మణులకు వీడ్కోలు పలికేందుకు కూడా ఆమె అంతఃపురం విడచి బయటకు రాలేదు. భర్తతో అరణ్యవాసమైనా అయోధ్యలా భావించి చరించిన చరిత జానకీమాతదైతే, భర్త చేసిన త్యాగానికి ప్రతిఫలంగా అయోధ్యలో కూడా అరణ్యవాసంగా తన జీవనాన్ని సాగించిన ధన్యవనిత ఊర్మిళాదేవి.

మరో సందర్భంలో కూడా ఆ మహాసాధ్వి పాతివ్రత్య ధర్మం గుండెల్ని కదలించివేస్తుంది. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లిన వేళ మారుతి సంజీవని కోసం ఏకంగా పర్వతాన్నే చేపట్టి అయోధ్య మీదుగా వెళుతూ ఉంటాడు. తన దివ్యశక్తితో విషయమేంటో తెలుసుకోవాలని భరతుడు హనుమంతుడితో సహా పర్వతాన్ని కిందకు దించుతాడు. కౌసల్య సహా అందరూ లక్ష్మణుడి దుస్థితికి విషాదంలో మునిగిపోతారు. కానీ సతి ఊర్మిళ మాత్రం తన స్వామికి ఏమీ కాదన్న విశ్వాసంతో నిశ్చలంగా ఉంటుంది. అప్పుడు ఆంజనేయుడు ఆశ్చర్యంగా, 'అమ్మా ఊర్మిళాదేవీ! నీవు అంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నావు? నేను సూర్యోదయానికల్లా వెళ్ళకపోతే లక్ష్మణస్వామి మనకు దక్కడు' అంటాడు. అప్పుడు ఆ నారీశిరోమణి, 'అయ్యో! మీరంతా వట్టి అమాయకులు! నా భర్త అణువణువునా ఆ రామచంద్రుడి నామమే మమేకమైంది. అంతటి ఆ సోదరుణ్ణి ఆయన రక్షించుకోకుండా ఉంటాడా? ఆ శ్రీరామచంద్రుడు మూర్ఛ పేరుతో నా పతిదేవుడికి కాస్త విశ్రాంతిని ప్రసాదించాడు. అంతే! అయినా, నా మంగళసూత్రంపై ఆన! నీవు లంకకు చేరి నీ పని పూర్తి అయ్యేంత వరకు సూర్యోదయం కాదు' అంటూ తన మంగళసూత్రంపై చేతులు ఆనిస్తుంది. ఆమె ధైర్య, స్థైర్యాలకు అనిలుడు అచ్చెరువొందుతాడు.

ఊర్మిళాదేవి తపోమయ త్యాగమయ జీవనాన్నీ, వినయ విశ్వాసాలనూ వర్ణించాలంటే కవుల కలాలు ఆమె పావన జీవనజలధిలో కరిగి జారిపోతాయేమో అనిపిస్తుంది. వనవాసం అనంతరం, పధ్నాలుగేళ్ళ తరువాత సీతారామ సమేతుడై తన భర్త అయోధ్యలో అడుగుపెట్టిన క్షణంలో కూడా ఎలాంటి ఉద్వేగానికి లోనుకాని స్థితప్రజ్ఞురాలు ఆమె! భర్త కనిపించగానే పాదాలకు ప్రణమిల్లింది. అంతే! ఏళ్ళ తరబడి శిలలా పడి ఉన్న అహల్య కన్నా, జీవమున్నా శిలలా కాలం గడిపిన ఊర్మిళ ధన్యురాలు. అందుకే 'కరుణశ్రీ' జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు ఇలా అంటారు:

పైట చెరంగుతో పుడమిపై బడకుందగ నద్దుకొమ్ము నీ 

కాటుక కన్నుతామర్లు కాలువలై ప్రవహించు వేడి క 

న్నీటి కణాలు క్రిందపడనీయకు! ముత్తమ సాధ్వివైన నీ 

బోటి వధూటి భాష్పములు భూమి భరింపగలేదు సోదరీ!

ఊర్మిళాదేవి నిశ్చలమైన మనస్సుకూ, అకుంఠిత పాతివ్రత్య ధర్మానికీ యావత్ లోకం కలకాలం నివాళులర్పిస్తూనే ఉంటుంది. స్త్రీ జాతికి ఆమె ప్రాతఃస్మరణీయురాలు.


                                  ◆నిశ్శబ్ద.