Read more!

ఇలాంటి కొత్త సంవత్సరం గురించి విన్నారా!

 

ఇలాంటి కొత్త సంవత్సరం గురించి విన్నారా! 

మనం ఉగాది వేడుకల్లో ఉన్నాం. ఈ సమయంలో చేయాల్సిన సంప్రదాయాల గురించీ, వాటి వెనుక ఉన్న జీవిత సత్యాల గురించీ తల్చుకుంటున్నాం. అంతేకాదు! వేర్వేరు ప్రాంతాల్లో ఉగాదిని చేసుకునే తీరును కూడా గుర్తు చేసుకుంటున్నాం. ఇలాంటి సమయంలో ఓ అరుదైన కొత్త సంవత్సరపు వేడుక గురించి చెప్పుకొని తీరాలి. అలాగని ఇదేమీ దూరదేశాలకు చెందింది కాదు. మనకు సమీపంలోని ఇండోనేషియాకు చెందినది. అందులోని బాలి ద్వీపంలో హిందువులు ఆచరించేది. దీని పేరు న్యేపి. దాదాపుగా మార్చి నెలలో వస్తుంది. ఇంతకీ ఏమిటీ న్యేపి. దాని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన ఆచారాలు ఏమిటి? 

దాదాపు రెండువేల సంవత్సరాల నుంచే ఈ న్యేపి అనే పండుగను బాలి దీవిలోని ప్రజలు జరుపుకొంటున్నట్టు తెలుస్తోంది. 

- ఈ రోజున ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ కూడా నిశబ్దాన్ని పాటిస్తారు.

- నిశబ్దం అంటే శబ్దం చేయకూడదు అని మాత్రమే అర్థం కాదు. ప్రత ఒక్కరూ అంతర్ముఖులుగా మారి, తమ జీవితాలను పరిశీలించుకునే సమయం అన్నమాట.

- ఈ న్యేపిలో భాగంగా మంటలు వేయడం, విద్యుత్‌ వస్తువులను ఉపయోగించడం తగ్గించాలి (అమటి గేని), పని చేయకూడదు (అమటి కార్య), ఎక్కడికీ ప్రయాణించకూడదు (అమటి లెలుంగనన్‌), వినోదాలకు దూరంగా ఉండాలి (అమటి లెలంగువన్‌). 

కొంతమంది అయితే ఈ న్యేపి రోజున మౌనవ్రతాన్ని, ఉపవాసాన్ని కూడా పాటిస్తారు. ఎప్పుడూ పర్యటకులతో కిటకిటలాడుతూ ఉండే బాలి రహదారులన్నీ ఈ రోజున నిర్మానుష్యంగా మారిపోతాయి. రోడ్ల మీద పోలీసులకు తప్ప మరొకరు తిరిగే అనుమతి ఉండదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు, గర్భిణులకు తప్ప రోడ్డు మీదకు వచ్చే అవకాశం ఉండదు. ఆఖరికి బాలిలో ఉన్న ఏకైక విమానాశ్రయాన్ని కూడా ఈ రోజు మూసేస్తారు. ఇళ్లల్లో ఉండేవారు కూడా, నిశబ్దంగా తమ పని చేసుకుంటూ ఉంటారు. టీవీ పెట్టినా, ఇంటర్నెట్‌ వాడినా మరీ అత్యవసరానికే అయి ఉంటుంది. 

నిజానికి న్యేపి ఒక్క రోజు పండుగ కాదు. అయిదారు రోజుల పాటు దీన్ని నిర్వహిస్తారు. ఒకరోజు జాతర చేసుకోవడం, ఒక రోజు దిష్టిబొమ్మలను తగలబెట్టడం, ఒకరోజు ఆత్మీయులను కలుసుకుని చేసిన పొరపాట్లకు క్షమాపణలు చెప్పుకోవడం… ఇలా వేర్వేరు ఉత్సవాలు న్యేపి సందర్భంగా జరుగుతాయి. వాటిలో ఒకరోజు ఇదిగో ఇందాక చెప్పుకున్నట్టు స్వీయచింతన కోసం ఉపయోగిస్తారు.

- నిర్జర.