కనువిప్పు కలిగించే సురధుడు, సమాధిల వృత్తాంతం!

 

కనువిప్పు కలిగించే సురధుడు, సమాధిల వృత్తాంతం!

సురధుడు అనే రాజు సమాధి అనే ఒక వైశ్యుడు ఇద్దరూ కూడా అజ్ఞానంతో ప్రవర్తిస్తుంటే 'సుమేధుడు' అనే ఋషి వారికి జ్ఞానబోధ చేశాడు అంటారు. ఆ వృత్తాంతం గురించి తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. అసలు సురధుడు ఎవరు?? ఆయన వృత్తాంతం ఏమిటి అంటే…

సూర్యుని కుమారుడు సావర్ణి. ఇతడే సూర్యసావర్ణి, రెండవ మనువు, సార్వోచిషమన్వంతరములో సావర్ణి 'సురధుడు' అనే మహారాజుగా పుట్టి భూమండలాన్నంతటినీ పాలిస్తున్నాడు. ఇతడు వేదవేదాంగవిదుడు. ధర్మశీలి. ఒకనాడు 'కోలలు' అనే ఆటవికులు సురధుని రాజ్యం మీదకు దండెత్తి వచ్చారు. యుద్ధానికి వచ్చినవారిని చూసి కూడా మంత్రులు, సేనలు ఏమీ చేయలేదు సరికదా వీరిలో కొంతమంది శత్రుసేనకు సాయం కూడా చేశారు. ఆ కారణంగా సురధుడు యుద్ధంలో ఓడిపోయాడు. రాజుగారి ధనాగారాలన్నీ అతని మంత్రులు, సేనాపతులే కొల్లగొట్టారు. రాజ్యం పోయింది, ధనం పోయింది. గౌరవం పోయింది. ఇంక అక్కడ ఉండటం ఇష్టంలేక రాజుగారు అరణ్యాలకు వెళ్ళిపోయాడు.

 ఆ విధంగా అడవిలో చాలా దూరం వెళ్ళిపోయాడు. అక్కడ సుమేధుని ఆశ్రమం కనిపించింది. ఆశ్రమానికి చేరాడు రాజు, వచ్చిన రాజును సాదరంగా ఆహ్వానించాడు సుమేధుడు, అతిధి సత్కారాలు చేశాడు. ఆశ్రమంలోనే కాలం గడుపుతున్నాడు రాజు.

ఒకరోజు గతాన్ని గుర్తుకు తెచ్చుకున్న రాజు, తన రాజ్యాన్ని, పరివారాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. రాజ్యం ఏవిధంగా ఉన్నదో? ప్రజలు ఏరకంగా కష్టాలు పడుతున్నారో? మంత్రి, సామంతులు సరిగా ఆలోచన చేస్తున్నారో లేదో? ఈ విధంగా ఆలోచిస్తున్న రాజుకు ఆశ్రమ ప్రాంగణం దగ్గర ఒక వైశ్యుడు కనిపించాడు. అతడు చాలా విచారంగా ఉన్నాడు. అతన్ని కలిసి వివరాలు అడిగాడు రాజు. అతడి పేరు 'సమాధి' భార్యాబిడ్డలు అతన్ని ధనాన్నంతా లాక్కుని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అయితే ఇప్పుడు భార్యాబిడ్డల క్షేమ సమాచారం తెలియక బాధపడుతున్నాడు. ఇప్పుడు సురధుడు, సమాధి ఇద్దరూ ఆశ్రమంలోకి వచ్చి సుమేధుని దగ్గర కూర్చున్నారు. సుమేధునితో రాజు ఇలా అడిగాడు.

 "బ్రాహ్మణోత్తమా! నా రాజ్యాన్ని అపహరించారు. నా మంత్రులు, సేవానులు. నాకు రాజ్యంలో తావు లేకుండా చేశారు. అయినా నేను వారి గురించే ఆలోచిస్తున్నాను. అలాగే ఇతని ధనాన్ని అపహరించి.. భార్యాబిడ్డలు ఇతన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అయినా ఇతడు భార్యాబిడ్డల గురించే ఆలోచిస్తున్నాడు. దీనికి కారణం ఏమిటి?" అని అడిగాడు.

ఆ మాటలు విన్న సుమేధుడు "రాజా! .. అదేనయ్యా మాయ అంటే. ఆహార నిద్రామైధునాలు లోకంలోని ప్రాణికోటికంతటికి సమానంగానే ఉంటాయి. కాని మానవుడికి విచక్షణా జ్ఞానము కూడా ఉంటుంది. మాయ ఆవరించటం చేత మానవుడు నేను, నాది అనే భ్రాంతిలో పడిపోతాడు. ఆ మాయ గనుక తొలిగిపోయినట్లైతే మోహాన్ని జయించగలుగుతారు. ఈ జగత్తులో పరమేశ్వరుడు తప్ప అందరూ మాయకు బద్ధులే. పూర్వకాలంలో మాయ తొలగటం చేతనే విష్ణుమూర్తి మధుకైటభ సంహారం చేశాడు”. అంటూ మధుకైటభుల వధ, మహిషాసుర వధ మొదలైన విషయాలు వివరించాడు. ఆ విషయాలను విన్న తరువాత సురధుడు, సమాధి కూడా పరమేశ్వరుణ్ణి ఆరాధించి మాయ నుండి విడివడి మోక్షము పొందారు"  ఇదీ సురధుడు, సమాధిల వృత్తాంతం.

                                  ◆నిశ్శబ్ద.