శివుడి చేతిలో ఢమరుకం ఎందుకు ఉంటుంది? దీని వెనుక అసలు నిజాలు ఇవే..!

 


శివుడి చేతిలో ఢమరుకం ఎందుకు ఉంటుంది? దీని వెనుక అసలు నిజాలు ఇవే..!



శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అన్నది పెద్దలు చెప్పిన మాట. దేవుడిని నమ్మే వారికి ఈ మాట వెనుక ఎంత లోతైన భావన ఉందో.. ఇది శివుడికి ఎందుకు  అన్వయించబడిందో  అర్థమై ఉంటుంది. సోమవారం శివుడికి చాలా ప్రత్యేకం అని చెబుతారు.  శివుడిని పూజించడం, ఉపవాసం ఉండటం వల్ల ఎంతో పుణ్యం దక్కుతుందని, జాతకంలో గ్రహాలు అనుకూలంగా మారతాయని అంటారు. అంతేనా..  శివుడికి జలాభిషేకం లేదా రుద్రాభిషేకం చేయడం వల్ల శివుడు పరమ ఆనందభరితుడు అవుతాడట. అందుకే ఈయనను భోళా శంకరుడు అని అన్నారు. అయితే శివుడి చేతిలో ఢమరుకం ఉంటుంది. దీని వెనుక ఉన్న నిజం ఏంటి? ఇది దేన్ని సూచిస్తుంది? తెలుసుకుంటే..


ఢమరుకం సంగీత వాయిద్యాలలో ఒకటి.  చాలామంది సన్యాసుల దగ్గర ఢమరుకం ఉంటుంది.  శివుడు లోక కళ్యాణం కోసం ఢమరుకం ధరించాడని చెబుతారు. ఢమరుకం 14 రకాల లయలు ఉన్న ధ్వనిని విడుదల చేస్తుంది.  


త్రిమూర్తులు ఈ విశ్వాన్ని సృష్టించారని హిందూ పురాణాలు చెబుతున్నాయి.  ఈ సృష్టి ఏర్పడిన మొదట్లో ఈ ప్రపంచం అంతా చాలా నిశ్శబ్దం అలుముకుని ఉండేది. ఇది చూసిన శివుడు ఈ సృష్టిని పట్ల తృప్తి చెందలేకపోయాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణువుల అనుమతితో తన  కమండలం నుండి నీటిని తీసుకుని మంత్రించి ఆ నీటిని భూమిపై చల్లాడు. ఆ మంత్ర శక్తికి భూమి కంపించింది. శక్తి స్వరూపిని అయిన శారదా దేవి  ఉద్భవించింది. చతుర్భుజి అయిన శారదాదేవి ఒకచేతిలో వీణ, మరొక చేతిలో పుస్తకం, మూడవ చేతిలో జపమాల, నాలువ చేతిలో వర ముద్రతో ఉంటుంది.   శారదా దేవి తన చేతిలో  ఉన్న వీణతో మధురంగా వీణ వాయించింది.  ఆ వీణ ధ్వనికి సంతసించిన శివుడు వీణకు అనుగుణంగా తనూ ఢమరుకాన్ని వాయించాడు.  ఈ విశ్వంలో లయను స్థాపించడానికి శివుడు ఢమరుకాన్ని సృష్టించాడని చెబుతారు. దీనికి అనుగుణంగానే ఢమరుకం నుండి  14 లయలు ఉన్న ధ్వని వెలువడుతుంది.

ఢమరుకం శబ్దంలో ఉన్న రిథమ్..  చాలా మానసిక రుగ్మతల నుండి ఉపశమం కలిగిస్తుంది. పరమేశ్వరుడి పూజ సమయంలో ఢమరుకాన్ని వాయించడం వల్ల శివుడు సంతోషించడమే కాదు.. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పటాపంచలు అవుతుంది.  ఇంటిల్లిపాదీ మానసిక ఆరోగ్యాన్ని పొందుతారు.