వసంతకేళి –హోళి!

 

వసంతకేళి –హోళి!

వసంత ఋతువు ఆగమనం మనుషులలో ఉత్సాహమే కాదు ప్రకృతిలో సరికొత్త సొగసు కూడా తెస్తుంది. ఎండిన చెట్లు చిగురించి, పూలు పూస్తాయి. కోయిలలు తమ కమ్మని కంఠంతో వీనుల విందు చేస్తాయి. మల్లెలు సువాసనలు వెదజల్లుతూ గుబాళిస్తాయి. ప్రకృతిలోని అందాలన్నీ ఆవిష్కరించే వసంతఋతువు ప్రవేశించిన తర్వాత జరుపుకునే తొలి వేడుక హోళి.

ప్రపంచంలోని రంగులన్నీ ఒకచోట కుప్ప పోశారా అన్నంత అందంగా, ఆహ్లాదంగా జరిగే హోళీ అంటే చిన్నా పెద్దా అందరికీ ప్రియమే! వయోభేదం, ఆడా, మగా అన్న తేడా లేకుండా అందరూ కలిసి ఓ పండుగలా జరుపుకునే హోళీ వివరాలు...

హోళీ ఎప్పుడు ప్రారంభమయిందంటే.... హోళీ పండుగ ఈనాటిది కాదు. ద్వాపర యుగంలోనే ఈ పండుగ జరుపుకున్నట్లు చారిత్రిక ఆధారాలున్నాయి. తన నెచ్చెలి రాధ తనకంటే తెల్లగా ఉంటుందని, తనది నలుపని కృష్ణుడు తల్లి యశోద దగ్గర వాపోతాడు. అప్పుడు యశోద కృష్ణుడికి ఓ సలహా ఇస్తుంది. రాధ శరీరం నిండా రంగులు పూయమని కన్నయ్యకు తరుణోపాయం చెబుతుంది. తల్లి సలహా మేరకు ఆ వెన్నదొంగ రాధను పట్టుకుని ఆమెమీద రంగులు కలిపిన నీటిని కుమ్మరిస్తాడు. దానికి ప్రతిగా రాధ కూడా కృష్ణుడిమీద వసంతం కుమ్మరిస్తుంది. అప్పటినుంచి స్నేహితులు, బంధువులు, ప్రేమికులు ఒకరిమీద మరొకరు రంగులు చల్లుకోవడం ప్రారంభమయింది.


కాముని దహనం..

హోళీ పండుగ ముందురోజు కాముని దహనం చేస్తారు. ఈ విధానం హోళీ ముందురోజు చలిమంటలు వేయడానికి కూడా పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. హిరణ్యాకశపుని సోదరి, ప్రహ్లాదుని మేనత్త హోళిక. ప్రహ్లాదుడు తన అన్నను చంపించాడన్న కోపంతో ఇంట్లోనే మంటలు రగిల్చి అందులోకి ప్రహ్లాదుడిని తోసే ప్రయత్నం చేస్తుంది. ఆ మంటలు ప్రహ్లాదుని ఏమీ చేయకుండా, హోళికను మాత్రం దహించి వేస్తాయి. అలా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోళీకి ముందురోజు కాముని దహనం పేరుతో చలిమంటలు వేయడం ఆనవాయితీగా వస్తోన్న ఆచారం.

ఓ సమయంలో ధ్యాన నిష్టలో ఉన్న శివునిపై మన్మథుడు పూలబాణాలు వేసి తపోభంగం కలిగిస్తాడు. తన తపస్సు భగ్నం చేసినందుకు శివుడు మన్మథుడిపై ఆగ్రహించి, తన త్రినేత్రంతో కాముడిని అంటే మన్మథుడిని భస్మం చేస్తాడు. తర్వాత రతీదేవి మొర ఆలకించిన శివుడు శాంతించి మన్మథుడిని తిరిగి బ్రతికిస్తాడు. దానికి గుర్తుగానే హోళీ పున్నమికి ముందు కాముని దహనం చేస్తారు. ఇక్కడ కామం అంటే కోర్కె, బాధ అనే అర్థాలు కూడా చెప్పుకుంటారు.

హోళీ సందర్భంగా దేశవ్యాప్తంగా సుమారు 40 వేలకు పైగా మంటలు వేస్తారని వీటిలో భారీఎత్తున కలప దహనం చేస్తారని ఓ సర్వేలో వెల్లడైంది. రంగుల అర్థం... సుఖం, దుఃఖం, సంతోషం, విచారం వీటన్నిటి మేలు కలయికే జీవితం. వీటిల్లో ఏ ఒక్కదానికో పొంగిపోవడమో లేదా కుంగిపోవడమోలేకుండా అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతో రకరకాల రంగులు కలిపిన నీటిని ఒకరిపై ఒకరు చల్లుకుంటారు.

హోళీ రోజు ఒక్క రంగులకే పరిమితం కాకుండా స్నేహితులతో, బంధువులతో కలిసి ఆడతారు, పాడతారు రోజంతా ఆనందంగా గడిపేస్తారు. ఎప్పుడు చేసుకుంటారు ? ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమిరోజు ఈ పండగ చేసుకుంటారు. పంటలు బాగా పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, తామంతా సంతోషంగా పిల్లాపాపలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ జరుపుకునే హోళీని వసంతోత్సవం, కాముని పున్నమి అని కూడా పిలుస్తారు.

హోళీకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. తెలిసిన వారిమీద, సన్నిహితుల మీదే కాకుండా తెలియనివారి మీద కూడా రంగులు చల్లి కొత్త బంధుత్వాలు, బాంధవ్యాలను కల్పించుకుంటారు. ఈరోజు శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతుంటారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒకచోట చేర్చేదే హోళీ అని చెప్పుకోవచ్చు.

రంగులతో జాగ్రత్త....

పూర్వం ఈ పండుగకు ఉపయోగించే రంగులను సంప్రదాయబద్ధంగా తయారుచేసేవారు. ఇవి కళ్ళలోకి పోయినా పెద్దగా హాని కలిగించేవి కావు. అయితే ఇప్పుడు లభించే రంగుల్లో హానికరమైన రసాయనాలు, విషపూరితమైన పదార్థాలు కలుపుతున్నారు. ఇవి శరీరం మీద పడి వెంటనే చర్మం ఎర్రబారడం, దద్దుర్లు రావడం, తిమ్మిరి తదితర బాధలు కలుగుతాయి. ఈ రంగులు కళ్ళలో పడితే పాక్షికంగా లేదా శాశ్వతంగాకంటిచూపు పోయే ప్రమాదం ఉంది. అందుకే రంగుల ఎంపిక విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి.

హోళీ రోజు తీసుకోవలసిన జాగ్రత్తలు. ... ఆనందానికి ప్రతీకగా జరుపుకునే హోళీ విషాదం కాకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది. రంగులు చల్లుకుంటూ వాహనాలమీద స్పీడుగా వెళ్ళడం మంచిది కాదు. అదేవిధంగా రోడ్డుమీద కనిపించే అపరిచితులపై కూడా రంగులు చల్లకూడదు. రంగులు పూయించుకోవడం అంటే కొందరు ఇష్టపడరు. అలాంటి వారి జోలికి వెళ్ళకూడదు. వారికి బలవంతంగా రంగులు పూసే కార్యక్రమానికి స్వస్తి పలకండి. వయోవృద్ధులు, పేషంట్ల మీద రంగులు చల్లడానికి ప్రయత్నించకండి. అలాగే ఐదు సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లల మీద కూడా రంగులు చల్లకూడదు.

దేశంలో వివిధ ప్రాంతా ల్లో హోళీ వేడుకలు...

ఒరిస్సా

ఒరిస్సాలోని జగన్నాథ, పూరీ ఆలయాలలో కృష్ణుడు, రాధ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపించి ఆ తరువాత వేడుకలు ప్రారంభిస్తారు.

గుజరాత్

గుజరాత్ లో ఈ పండగను అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా మంటలు వేసి దాని చుట్టూ చేరి నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ ఆనందిస్తారు. అందరూ పెద్ద మైదానం లాంటి ప్రదేశం వద్ద గుమికూడి సామూహికంగా కూడా మంటలు వేస్తారు. ఈ మంటల్లో ఇంట్లో ఉన్న పాత చెక్కసామానులన్నీ తీసుకొచ్చి వేస్తారు.

మహారాష్ట్ర

మహారాష్ట్రలో హోళీక దిష్టిబొమ్మను దహనం చేస్తారు. హోళీ  వేడుకకు ఒక వారం ముందు యవకులు ఇంటింటికి తిరిగి పాత చెక్క సామానులు సేకరిస్తారు. ఉదయం వేసిన మంటలు సాయంత్రం దాకా మండుతూనే ఉంటాయి. అంత పెద్ద ఎత్తున మంటలు వేస్తారు. ఈ మంటలకు ప్రత్యేకంగా చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తారు.


మణిపూర్

మణిపూర్ లో ఓ ఆచారం ఉంది. మగపిల్లలు ఆడపిల్లలకు డబ్బులు ఇస్తేనే ఆడపిల్లలు వారి మీద రంగులు చల్లుతారు. రాత్రి సమయంలో చిన్నాపెద్దా అందరూ కలిసి ఒక చోట చేరి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తారు. ఇక్కడ వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. చివరిరోజు కృష్ణుడి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు.

కాశ్మీర్..

సైనికుల పహారాలో, తుపాకుల చప్పళ్ళతో ఉద్రిక్తంగా ఉండే అందాల కాశ్మీర్ లో సైనికులతో సహా అందరూ హోళీ ఉత్సవాలలో పాల్గొంటారు. ఆటపాటలతో రంగు నీటిని ఒకరిమీద మరొకరు చల్లుకుంటారు.