భక్తులపై బాబాది మాతృప్రేమ
భక్తులపై బాబాది మాతృప్రేమ
శిష్యులు మూడు రకాలు. ఉత్తములు, సాధారణులు, మనమెప్పుడూ ఉత్తములు గానే ఉండాలంటే గురువాజ్ఞను తూచ తప్పకుండా పాటించాలి. తన భోధనలు, ఉపదేశాలను భక్తులు పాటిస్తున్నారో లేదో బాబా తరచుగా పరీక్షించేవారు.
ఒక ఏకాదశి నాడు బాబా దాదాకేల్కరుకు కొన్ని రూపాయలు ఇచ్చి మాంసం తీసుకురమ్మన్నారు. అతను సనాతన బ్రాహ్మణుడు. గురువాజ్ఞను అక్షరాలా నెరవేర్చటమే గురువుకు శిష్యుడు సమర్పించే నిజమైన దక్షిణ అని నమ్మిన కేల్కరు బజారుకు వెళ్లి మాంసం తేవటానికి సిద్ధమయ్యాడు. కానీ అంతలోనే బాబా అతనిని ఆపారు.
మరోసారి బాబాకేల్కరును పిలిచి పొయ్యి మీద వున్న పలావు ఉడికిందో లేదో చూడమన్నారు. కేల్కరు రుచి చూడకుండానే బాగుందని చెప్పాడు. అతని తీరులో బాబా ఆగ్రహించారు.
"నీ కళ్ళతో చూడలేదు. నాలుకతో రుచి చూడలేదు. బాగుందని ఎలా చెప్పావు? మూతతీసి చూడు" అలా అంటూనే బాబా కేల్కరు చేతిని మండుతున్న డేకిసాలోకి పెట్టారు.
"ఇక నీ చెయ్యి తియ్యి. నీ ఆచారం పక్కన పెట్టు. తెడ్డుతో తీసి కొంచెం ప్లేటులో వేసుకుని సరిగ్గా ఉడికింది లేనిదీ చూడు" అని చెప్పారు. పిల్లలు ఆల్లరి చేస్తే తల్లి కోప్పడుతుంది. అప్పటికీ దారిలోకి రాకపోతే రెండు దెబ్బలు కూడా వేస్తుంది. పిల్లలు ఏడుపు మొదలుపెట్టగానే ప్రేమగా అక్కున చేర్చుకుని ముద్దాడి మురిపిస్తుంది. ఏడుపు మాన్పిస్తుంది. బాబా కూడా అంతే. భక్తులపై బాబాది మాతృప్రేమ, బాబా కోపగించేది, మందలించేది భక్తులకు మంచి నడవడి నేర్పేందుకే.
మనం నిత్య జీవితంలో తల్లిదండ్రులు, పెద్దలు చేయమని చెప్పిన పనుల్ని కూడా ఇలాగే చేస్తూంటాం. మన పనుల్ని కూడా ఇంతే నిర్లక్ష్యం చేస్తాం. సరిగ్గా చూడకుండానే, మంచి చెడ్డలు నిర్ధారించుకోకుండానే, ఒక నిర్ణయానికి వస్తాం. తరువాత వాటి వల్ల కలిగే ఫలితాన్ని అనుభవిస్తూ బాధపడతాం.
బాబా శరీరం ఇప్పుడు లేకపోయినా బాబా వదిలి వెళ్లిన ఆధ్యాత్మిక చైతన్య భావం సజీవం. అదే మనల్ని ముందుండి నడిపే మార్గదర్శి. మనం ఏ పని చేస్తున్నా ఉన్నతికి దోహదపడేదే. ఏ ప్రయత్నం చేస్తున్నా బాబా గమనిస్తున్నారనే భావాన్ని మనసులో గుర్తుంచుకుంటే ప్రయత్నలోపం, కర్తవ్య లోపం లేకుండా ఆపని సజావుగా సాగిపోతుంది. మంచి ఫలితాలు సాధించగలుగుతాం.