Kalagnanam - 10
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం - 10
Sri Potuluri Veerabrahmendra Swamy Kalagnanam - 10
అన్ని మతాలనూ సమాదరించిన బ్రహ్మంగారు
వివాహం అయిన తర్వాత కొంతకాలం వరకు తన భార్యతో కలిసి జీవిస్తూ, తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ గడిపారు బ్రహ్మంగారు.
ఆయన ఎక్కడా కూడా తనను తాను దేవునిగా కానీ దేవదూతగా కానీ ప్రకటించుకోలేదు. తనకు శిష్యులున్నారని కూడా ఆయన చెప్పలేదు. ఎప్పుడూ తన వద్దకు వచ్చే సామాన్య ప్రజల సందేహాలను తీర్చేందుకే ప్రయత్నించేవారు తప్ప తన గురించి, తన శక్తి గురించి చెప్పుకోలేదు. మహిమలను కూడా ఎప్పుడూ ప్రదర్శించలేదు. అందుకు ఆసక్తి వుండేది కాదు.
అందువల్ల బ్రహ్మంగారిని స్వామిజీగా ఎవ్వరూ గుర్తించలేదు. ఇలా అనేకంటే బ్రహ్మంగారికి ఇలా చెప్పుకోవడం ఇష్టం లేదని అనుకోవచ్చు.ఆయనను ఒక జ్ఞానిగానే గుర్తించారు తప్ప హిందూ మతానికి సంబంధించిన గురువుగా ఎవరూ గుర్తించలేదు. కాబట్టే ముస్లిం మతస్థులు కూడా ఆయన శిష్యులుగా వున్నారు. ఆయన మానవులందరినీ మతం దృష్టితో చూడలేదు. అందువల్లనే ఆయనకు అన్ని మతాల వారిలో గుర్తింపు వచ్చింది.
బ్రహ్మంగారి దేశ సంచారం
కొన్నాళ్ళకి బ్రహ్మంగారికి దేశాటన చేయాలనే కోరిక పుట్టింది.
కంది మల్లాయపాలెం నుంచి తన దేశాటనను ప్రారంభించారు.
ముందుగా విజయవాడకు చేరి, కృష్ణానదీ తీరాన ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తర్వాత అక్కడి నుండి బయలుదేరి రాజమండ్రి, వరంగల్ ప్రాంతాల్లో తిరిగారు.
వరంగల్ నుంచి హైదరాబాదుకు చేరారు.
అప్పటికే హైదరాబాద్ నవాబు
బ్రహ్మంగారి గురించి తెలుసుకున్నాడు. బ్రహ్మంగారితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. బ్రహ్మంగారు హైదరాబాద్ వచ్చారని తెలుసుకుని తానూ ఆయనతో మాట్లాడతానని కోరుతూ కబురు పంపాడు. హైదరాబాద్ నవాబు ఆహ్వానం మేరకు బ్రహ్మంగారు నవాబును కలిశారు. బ్రహ్మంగారిని ప్రశ్నించిన నవాబు బ్రహ్మంగారిని కలిసిన నవాబు, ముందుగా తనకు ఆయనపై నమ్మకం లేదని చెప్పాడు. ఆయన జ్ఞాని అయితే కావచ్చు కానీ, దైవాంశ సంభూతుడు అంటే మాత్రం నమ్మలేనని, తనకు ఆయన ఏమైనా మహిమలు చూపితే తాను ఆయన భక్తునిగా మారగలనని అన్నాడు. మహిమలు ప్రచారం చేసుకోవడంలో బ్రహ్మంగారికి నమ్మకం లేకపోయినా, తన శక్తిని చూపించాలని నిర్ణయించుకున్నాడు.
ఒక గిన్నె నీటిని తెప్పించుమని నవాబును ఆదేశించాడు. సేవకుడు తెచ్చిన నీటిని ప్రమిదలో పోయించారు. తర్వాత ఆ దీపమును వెలిగించాడు. అది చూసిన నవాబు బ్రహ్మంగారిని భవిష్యత్ తెలుపగలిగిన జ్ఞానిగా గుర్తించాడు. రాజ్యం, అధికారం గురించి, తన వ్యక్తిగత విషయాలు భవిష్యత్ లో ఏ విధంగా వుంటాయో చెప్పమని ప్రార్థించాడు.
అప్పుడు బ్రహ్మంగారు జోస్యం చెప్పారు. అదే జగత్ప్రసిద్ధమైన కాలజ్ఞానం. నేను శ్రీ వీరభోగ వసంతరాయల అవతారము దాల్చి మళ్ళీ జన్మిస్తాను. ఈ సంఘటన జరగటానికి ముందు అనేక ఉత్పాతాలు విపరీత సంఘటనలు కనిపిస్తాయి. కాశీ అవతల గండకీనదిలో సాలగ్రామములు నాట్యమాడతాయి. మనుషులతో మాట్లాడతాయి. నదుల్లో దేవతా విగ్రహాలు దొరకటం ఎన్నోసార్లు జరుగుతూనే ఉంది కదా! అలా వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన అనేక వాక్కులు ఇప్పటికి ఎన్నో జరిగి, యదార్థ సంఘటనలుగా కళ్ళముందు నిలిచాయి.
ప్రయాగ తీర్థంలో చాలామంది మరణించగా, కొద్దిమంది బతుకుతారు.
ప్రయాగ హిందువులకుపుణ్యతీర్థము. ఇక్కడ జరిగే ప్రమాదంలో భక్తులు మరణిస్తారు అని దీనికి అర్థం అయి వుండవచ్చు.
సరస్వతీ దేవిని దుకాణాలలో అమ్ముతారు.
చదువుకోవడం కంటే చదువు కొనడమే జరుగుతోంది. నిజంగానే విద్య అమ్మకపు వస్తువు అయింది. కష్టపడి చదవకపోయినా ఉత్తీర్ణుల్ని చేసే స్కూళ్ళు, కాలేజీలు ఉన్నాయి. అదీ వీలవకుంటే తిన్నగా వెళ్ళి సర్టిఫికెట్లు కొనుక్కునే సౌకర్యాలు కూడా పుష్కలంగా ఉన్నట్టు ఎన్నోసార్లు వార్తలు వింటున్నాం. కనుక బ్రహ్మంగారు చెప్పినట్లు సరస్వతిని అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు.
మూసీనది పొంగి నగరాన్ని ముంచేస్తుంది. ఆ వరదలలో ప్రజలు మరణిస్తారు.అనంతరం నీ వంశీయులు ఈ పట్టణాన్ని తిరిగి బాగు చేస్తారు. నీ సామ్రాజ్యమున గల అడవులు ఫలవంతంగా మారతాయి.పల్లెలు పట్నాలుగా మారతాయి. చంద్రమతీ దేవి కళలు తొలగిపోతాయి.
హైదరాబాదు విషయంలో ఈ వాక్కు రూఢి అయింది. 1908 లో మూసీ నదికి వరదలు వచ్చాయి. 6వ నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ సమక్షంలో దానికి పరిష్కారం దొరికింది. హైదరాబాదు నగరం తిరిగి బాగుపడింది. ఆ తర్వాత పెను వర్షాలు, వరదలు వచ్చినా ప్రజలకు ఇబ్బంది లేకుండా పోయింది. మరి బ్రహ్మంగారి మాటలు అక్షర సత్యాలు అయినట్లే కదా!
స్త్రీలు పర పురుషులతో యదేఛ్చగా తిరుగుతారు.
ఈ విషయాన్ని బ్రహ్మంగారు చాలా సందర్భాల్లో చెప్పారు. అంటే స్త్రీ, పురుషులలో కామ వాంఛ పెరిగి, వావి వరుసలు మాయమైపోతాయని అర్థం. తనను తాను తెలుసుకోగలిగిన యోగులకే నా దర్శనమవుతుంది.
ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు.
ఈ మాట వాస్తవమో కాదో అనే సందేహమే కలగదు. ఇప్పటికే బంగారం ధర చుక్కలను తాకుతోంది. మున్ముందు తులం బంగారం లక్షకు చేరుతుంది. ఇప్పటి పరిస్థితులు చూస్తే అందుకు సుదీర్ఘ కాలం కూడా అక్కరలేదు అనిపిస్తోంది. బహుశా వందేళ్ళ తర్వాత వీరబ్రహ్మేంద్రస్వామి మాటలు నిజమై ముత్యమంత బంగారం కూడా దొరక్కపోవచ్చు.
Sri Potuluri Virabrahmendra Swami Kalagnanam, brahmam gari charitra, brahmam gari sooktulu, potuluri veera brahmam gari jeevita charitra