పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాల జ్ఞానం - 1 (Potuluri Kalagnanam)
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాల జ్ఞానం - 1
(Potuluri Kalagnanam)
అసలు వీరబ్రహ్మేంద్రస్వామి ఎవరు? కాలజ్ఞానం అంటే ఏమిటి? వీరబ్రహ్మేంద్రస్వామి ఏం చెప్పారు, అవి ఎంతవరకూ నిజం అయ్యాయి అనే అంశాలు ఒక్కొక్కటీ తెలుసుకుందాం కాలజ్ఞానం అంటే భవిష్యద్దర్శనం అన్నమాట. భవిష్యత్తును దర్శించడం యోగులకు, ఋషులకు సాధ్యమే. మన పురాణ పురుషుల సంగతి వదిలేసినా, చరిత్రకు అందిన వారిలోనూ ఇలా భవిష్యద్దర్శనం చేసిన వారు ఉన్నారు.
ఇతర దేశాలలోనూ భవిష్యత్ ను తెలుసుకొని, జరగబోయేవి ముందే చెప్పిన మహనీయులు లేకపోలేదు. వీరిలో ప్రపంచానికి తెలిసిన ప్రముఖుడు నాస్ట్రోడామస్ అయితే తెలుగువారికి ఎక్కువగా తెలిసింది వీరబ్రహ్మేంద్రస్వామి.
రష్యా, టిబెట్, చైనా వంటి సుదీర్ఘ చరిత్ర కలిగి, ప్రాచీన నాగరికతలు వెల్లివిరిసిన దేశాలలో భవిష్యద్దర్శనం చేసిన కొందరి పేర్లు మనకు వినిపిస్తుంటాయి. వారి గురించిన చారిత్రక వివరాలు గ్రంథస్తం చేసి ఉన్నాయి.
కాలజ్ఞానం ఒక విధంగా జ్యోతిష్యం వంటిదనే చెప్పుకోవాలి. జ్యోతిష్యం గ్రహగతుల ఆధారంగా కొందరు వ్యక్తుల జీవితంలో భవిష్యత్ లో జరగబోయే సంగతులను వివరించి చెప్పేది. ఈ జ్యోతిషంలోనూ అనేక పద్దతులు ఉన్నాయి. నాడీ జోస్యం, హస్తసాముద్రికం తదితరాలు. అవి ఇప్పుడు అప్రస్తుతం.
కాలజ్ఞానం జ్యోతిషానికి భిన్నమైనది. ఇది ఒక దేశ, ప్రపంచ పోకడలను వివరించేది. భవిష్యత్తులో సాంకేతికంగా వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, దేశానికి ఏర్పడే ముప్పులు, పెను విపత్తులు, ప్రముఖ వ్యక్తుల జననం, వారి జీవనం ఇలాంటి సంగతులు ఎన్నిటినో వివరిస్తుంటుంది.
నాస్ట్రోడామస్, వీరబ్రహ్మేంద్రస్వామి చేసింది సరిగ్గా ఇదే! నాస్ట్రోడామస్, చెప్పినా, వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినా వారి జోస్యాలలో స్పష్టత ఉండదు. అస్పష్టతే ఎక్కువ. సూటిగా ఉండవు. మర్మగర్భంగా ఉంటాయి. అలాగని వారేదో ఊహాప్రపంచంలో విహరించి, వారికి తోచిందేదో రాసేశారు అనుకోడానికీ లేదు. ఎందుకు రాశారు అన్నదీ ఆలోచించాలి.
నాస్ట్రోడామస్, నే ఉదాహరణగా తీసుకుంటే .... హిట్లర్, నెపోలియన్ వంటి ప్రముఖుల ప్రస్తావన నాస్ట్రోడామస్ జోస్యంలో కనిపిస్తుంది. రాజీవ్ గాంధి హత్య, ప్రపంచ వాణిజ్య భవన సముదాయం కూల్చివేత వంటి విపత్కర సంఘటనలకు నాస్ట్రోడామస్ జోస్యాలు కొన్నింటికి అన్వయం కుదురుతుంది. మరి ఆయన చెప్పింది వీరి గురించేనా? అనేది స్పష్టంగా చెప్పలేము. అయితే, వీటిని ఎక్కువమంది నమ్ముతారు.
వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిందీ ఇలాంటివే! నాస్ట్రోడామస్ ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలను దర్శించారని ఆయన జోస్యాలను నమ్మినవారు భావిస్తునట్టే, రాష్ట్రంలో అనేక సంఘటనల గురించి వీరబ్రహ్మేంద్రస్వామి ముందుగానే భవిష్యద్దర్శనం చేసి చెప్పిన ఉదంతాలు కాలజ్ఞానంలో కనిపిస్తాయి.
వీరబ్రహ్మేంద్రస్వామి జ్యోస్యాలలో కొన్ని సూటిగా వుంటే, మరికొన్నింటికి మనమే అన్వయం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఇప్పటికే జరిగాయి, ఇంకా కొన్ని ఇకముందు జరగవలసి ఉన్నాయి. భవిష్యత్తులో జరగవలసి ఉన్నవాటిలో ఎక్కువ ప్రచారంలో ఉన్న విషయం 'కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుంది అనేది.
కృష్ణానది ఇంద్రకీలాద్రి అంత ఎత్తుకు చేరుకునేంతగా ఎగసి పడుతుందా? లేక కనకదుర్గమ్మ ముక్కుపోగు నీటిని చేరుకుంటుందా అనేది మనం ఊహించలేము. ఈ రెండింటిలో ఎదైనా జరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో జగరబోయే జలప్రళయాన్ని వీరబ్రహ్మేంద్రస్వామి మనోనేత్రంతో దర్శించారు.
జల ప్రళయమే అవసరం లేదు. ఏదైనా భూకంపం వంటి ప్రకృతి వైపరిత్యంవల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్ ఆనకట్టలకు బీటలు పడితే ఎగసి వచ్చే అపార జలరాశి చాలు. అలాంటి విపత్తు ఎదురైతే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. ఇక ముక్కుపుడక కృష్ణానదిని చేరుకోవడం అనే విషయాన్ని ఎవరికి తోచినట్లు వారు ఊహిస్తున్నారు.