శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయం, చెర్వుగట్టు

 


శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయం, చెర్వుగట్టు

 

                                                                      

భగవంతుడు తన భక్తులను కాపాడటానికి అనేక చోట్ల అనేక రూపాలలో కొలువు తీరాడు.  అలాంటి వాటిలో భక్తులను దుష్ట శక్తులనుంచి రక్షించి, ఆరోగ్యాన్ని ప్రసాదించే స్వామిగా కొలువబడుతున్నాడు తెలంగాణా రాష్ట్రంలోని నార్కేట్ పల్లికి సమీపంలో చెర్వుగట్టులో వున్న శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి.  ఈ వారం ఆయన గురించి తెలుసుకుందాము.

త్రేతాయుగంలో కార్తవీర్యార్జనుడు పరశురాముడి తండ్రి శిరస్సు ఖండించగా, పరశురాముడు ఆగ్రహంతో 21సార్లు భూమండలమంతా దండెత్తి క్షత్రియుల్ని నామరూపాలు లేకుండా చేశాడు.  ఆ పాప పరిహారార్ధం వివిధ ప్రాంతాలలో 108 శివలింగాలను ప్రతిష్ట చేశాడు.  అందులో 108వ లింగంగా ప్రతిష్ట చేసిన ఈ  చెర్వుగట్టు శ్రీ జడల రామలింగేశ్వరలింగం దగ్గర పరశురాముడు తపస్సు చేశాడు.  శివుడు ప్రత్యక్షం కాలేదని కోపంతో తన పరశువుతో ఈ లింగంమీద మోదబోగా శివుడు ప్రత్యక్షమయ్యాడు.  ఆ భక్త వత్సలుని దగ్గరనుంచి కలియుగాంతంవరకు తానక్కడ వుండి భక్తులను కాపాడుతాననే వరం పొందాడు పరశురాముడు.  అలాగే పరశురాముడికి తాను ప్రత్యక్షమైన ఆ ప్రదేశం సుప్రసిధ్ధి చెందుతుందని ఆశీర్వదించాడు శివుడు.  పరమశివుడు నాడు పరశురామునికిచ్చిన మాట నేటికీ నిలబెట్టుకుంటున్నాడనటానికి తార్కాణం నమ్మి కొలుస్తూ ఆక్కడికి పదే పదే వచ్చే భక్త జన సందోహం.

 

ఇక్కడ శివుడు పశ్చిమాభిముఖంగా వుంటాడు.  ఈ గుహాలయం ప్రవేశ మార్గం ముందు విశాలమైన ముఖ మండపం నిర్మింప బడ్డది.  అనేకమంది భక్తులు ఇక్కడ రాత్రి నిద్ర చేస్తారు.  ఈ మండపం దాటి లోపలకి వెళ్తే ఎదురుగా విఘ్ననాయకుని విగ్రహం, కుడి పక్క వున్న గర్భాలయంలో పానువట్టంమీద విరాజిల్లే శివ లింగం.  ఈ లింగానికి నేత్రాలు అలంకరింపబడి వుంటాయి.  స్వామి వెనుక లింగానికి జడలులాగా వుండటంవల్ల ఈయనకి జడల రామలింగేశ్వరుడు అని పేరు.  ఇక్కడ అమ్మవారు వుండదు.  ఉత్సవ విగ్రహాలు మాత్రం వున్నాయి.  పరశురాముడు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్టించలేదుకనుక ఇక్కడ అమ్మవారు వుండరు అన్నారు.  అమ్మవారికి ప్రత్యేక ఆలయం కొండకింద వున్నది.  గర్భగుడి ఇవతల శివుడికి ఎదురుగా నందీశ్వరుడు, ఆయన వెనుక చిన్న ధ్వజ స్తంబము.  కాలభైరవుడు క్షేత్రపాలకుడు.

ఇక్కడ విశేషాలు చాలా వున్నాయి.  అవి ఏమిటంటే
శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం
రామ లింగేశ్వరాలయంనుంచి బయటకు రాగానేఎదురుగా ఆంజనేయస్వామి, ఎల్లమ్మ ఉపాలయాలు కనబడుతాయి.  ఇక్కడ  ఆంజనేయస్వామికి 40 రోజులు ప్రదక్షిణ చేసినవారికి భూత ప్రేత పిశాచాల బాధ తప్పుతుందంటారు.

 

ముడుపుల గట్టు
ఆలయానికి ఇవతల ఒక గట్టు, దాని మీద భక్తులు కట్టిన ముడుపులు కనబడతాయి.  ఆ  గట్టుమీద అనేక చెక్క పావుకోళ్ళు వున్నాయి.  అనారాగ్యంగా వున్నవారు అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తే వారిమీద ఆ పావుకోళ్ళు శరీరమంతా కప్పినట్లు పెడతారు.  అలా కొంత సేపుంటే వారి రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం.  కొందరు ఆ పావుకోళ్ళను తలపైపెట్టుకుని ఆ చెట్టుకి ప్రదక్షిణలు చేస్తున్నారు.

మూడు గుండ్లు
ఆలయం పక్కన ఎత్తైన కొండరాళ్ళపైన శివ లింగం వున్నది.  ఇక్కడికి చేరుకోవటానికి రెండు మార్గాలున్నాయి.  ఇందులో మొదట కనబడే మార్గం అతి సన్నగా వుండి, దోవలో కొన్నిచోట్ల మెట్లుకూడా లేకుండా వుంటుంది.  స్వామిపట్ల అపరిమిత భక్తి విశ్వాసాలుగల భక్తులు ఈ మార్గంద్వారా కొండపైన లింగాన్ని దర్శించటానికే ఆసక్తి చూపుతారు.  నిర్మల మనస్సుతో వెళ్తే సునాయాసంగా పైకి వెళ్తారంటారు.  లేకపోతే దోవలో తేనెటీగలు కుట్టి బాధపెడతాయిట.  అక్కడే కొంచెం పక్కగావున్న మార్గంలో మెట్లు సౌకర్యంగా వుంటాయి.  96 మెట్లు ఎక్కితే పైన శివలింగాన్ని దర్శించవచ్చు.  అక్కడనుండి పరిసరప్రాంతాలని వీక్షించవచ్చు.  

జడల రామలింగేశ్వరుడు
ఇక్కడ లింగం వెనుక జడలమాదిరిగా వుండటంవల్ల స్వామికాపేరు వచ్చిందంటారు.  అంతేకాదు స్వామి ఆవహించిన భక్తులకు కూడా జుట్టంతా జడలు కడుతుంది.  అలాంటివారికి పూనకం వచ్చి భూత భవిష్యత్తులు చెప్తారు.  మూడుగుండ్లకెళ్ళే మెట్లదగ్గర ఇలాంటివారిని చూశాము.  పూనకంలో వారు చేసే శబ్దాలు కొందరికి భయం కలిగించవచ్చు.

 


 

గోవు గర్భం


ఈ కొలనులోని జలంతో స్వామికి నిత్యాభిషేకాలు జరుగుతాయి.  ఈ జలాన్ని తమ పొలాలమీద జల్లుకుంటే పంటలు బాగా పండుతాయని నమ్మకం.  అలా చేసిన రైతులు స్వామికి మొక్కు చెల్లించుకుంటారు.  అందుకే స్వామి కళ్యాణానికి తలంబ్రాలకోసం పుట్లకొద్దీ బియ్యం వస్తాయి. భక్తులు ఇక్కడ స్వామికి తలనీలాలు సమర్పించుకుని, ఈ కొలనులో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటారు.


కొండపైకి వెళ్ళే మార్గం: కొండపైకి వెళ్ళటానికి మెట్ల మార్గమయితే 360 మెట్లు ఎక్కాలి.  వాహనాలు కొండపైకి వెళ్తాయి.  మెట్లదారికి ప్రారంభంలో సమున్నతమైన గోపురం, ఎదురుగా పెద్ద నంది విగ్రహం చూపరులను ఆకట్టుకుంటాయి.

 


 

దర్శన సమయాలు: ఉదయం 6 గం. ల నుంచి 12 గం.ల వరకు తిరిగి సాయంత్రం 4 గం. లనుంచి 7-30 గం. లదాకా.

పార్వతీదేవి ఆలయం: కొండకింద కొండకి అభిముఖంగా వున్నది పార్వతీ దేవి ఆలయం.  విశాలమైన ఆలయ ఆవరణలో భక్తులు వుండటానికికూడా సౌకర్యాలున్నాయి.  ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా శివలింగం. పక్కనే అద్దంలో అమ్మవారి దర్శనం.  స్వామికి ఎడమవైపు వున్న గోడలో అమ్మవారు వున్నారు.  భక్తులకు లోపలకి ప్రవేశంలేదుగనుకు అమ్మని నేరుగా చూసే అవకాశంలేదు.  అందుకే అద్దంలో అమ్మవారి దర్శనం.


మార్గము: హైదరాబాదునుంచి నల్గొండ వెళ్ళే మార్గంలో నార్కేట్ పల్లికి 4 కి.మీ. ల దూరంలో వున్నది.  నల్గొండ మార్గంలో ఎడమవైపు కనబడే కమానులోంచి లోపలికి వెళ్ళాలి.


రవాణా సౌకర్యం: నార్కేట్ పల్లిదాకా అన్ని ప్రాంతాలనుంచి బస్సు సౌకర్యంవున్నది.  అక్కడనుంచి ఆటోలో కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.


.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)