శ్రీ నారసింహ క్షేత్రాలు - 18

 

 

శ్రీ నారసింహ క్షేత్రాలు - 18


శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, నాజరు పేట, తెనాలి

గుంటూరు జిల్లా తెనాలిలో నాజర్ పేటలో వున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం క్రీ.శ. 1906లో అప్పటి నాజర్ కీ.శే. పొన్నాడ వేంకట లక్ష్మీ నరసింహంగారిచే నిర్మించబడింది.  మొదట్లో ఆ పేటకు లక్ష్మీనరసింహపేట అని నామకరణం చేయబడింది.  తర్వాత పేట అభివృధ్ధి చెందిన మీదట మునిసిపాలిటీవారు ప్రజల ఆకాంక్ష  ప్రకారం నాజరు పేట అని పేరు పెట్టారు.  శ్రీ పొన్నాడ వేంకట లక్ష్మీ నరసింహంగారు మందిర వ్యవస్ధాపకులు అవటంవల్ల, ఆయన వృత్తిరీత్యా నాజరు అవటంవల్ల నాజరుపేటగా నామకరణం జరిగింది. తర్వాత ఈ ఆలయానికి ఎదురుగా రణవీర ఆంజనేయస్వామి ఆలయం కీ.శే. జోస్యుల కృష్ణయ్యగారిచే నిర్మించబడింది.   క్రమేపీ అభివృధ్ధిచెందిన ఈ ఆలయ నిర్వహణ ప్రస్తుతం శ్రీ శృంగేరీ శ్రీ విరూపాక్ష శ్రీ పీఠం, గుంటూరువారికి అప్పజెప్పబడింది. ఈ ఆలయ విశేషాలు అక్కడి పూజారి శ్రీ పవన్ కుమార్ శర్మా గారు వివరించారు.  సాధారణంగా నరసింహస్వామి ఆలయాలు కొండపైన, గుహలలో వుంటాయి.  అలా కాకుండా నేలమీద నిర్మింపబడిన ఆలయాలు తక్కువగా వున్నాయి.  అందులో ఇది ఒకటి.

శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబన స్తోత్రంలో 18 వ శ్లోకం ప్రకారం విగ్రహం తయారు చెయ్యబడింది.  స్వామి చతుర్భుజుడు.  కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖం, ఒక చేతితో అభయ ముద్ర, ఇంకొక చేతితో అమ్మవారిని పట్టుకుని వుంటారు.  అమ్మ కుడి చేతిలో కమలం వుంటుంది.  శివ కేశవులకు బేధం లేదని నిరూపిస్తున్నట్లు స్వామివారి పీఠం పానువట్టంలాగా వుంటుంది.  ఇంకొక విశేషమేమిటంటే  సోమద్వారానికి (స్వామికి చేసిన అభిషేకం నీరు బయటకు వచ్చే ప్రదేశం) నంది ముఖం వున్నది.  ఇది తర్వాత చెక్కినది కాదు. నిర్మాణ సమయంలోనే రాతితో చేసినది. 

ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామిని 9 సంఖ్యతో మొదలు పెట్టి ఏ పని చేసినా, అంటే 9, 18, 27 అలా ప్రదక్షిణలు 9, 18, 27 రోజులు చేసినా, అర్చనలు చేసినా స్వామి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. రణవీర ఆంజనేయస్వామి ప్రతిష్ట కూడా తక్కువ ప్రదేశాల్లోనే వుంటుంది.  పెంచల కోనలో స్వామి ఆలయ ప్రాంగణంలో రణవీర ఆంజనేయస్వామి వున్నారుగానీ స్వామికి అభిముఖంగా లేరు.  ఇక్కడ స్వామికి అభిముఖంగా ప్రతిష్ట చెయ్యాలనుకున్నది సక్రమంగా కావటం, స్వామిని కొలిచిన భక్తుల కోరికలు తీరటం, స్వామి అనుగ్రహమే.  ఆంజనేయస్వామి ఉగ్ర రూపాలలో అతి ఉగ్ర రూపం రణవీర ఆంజనేయస్వామిది.  స్వామికోసం ఏది చేసినా నిష్టగా చేస్తే అతి త్వరిత ఫలితాన్నిస్తుంది. చిన్నదే అయినా మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని అవకాశం వున్నవారు తప్పక దర్శించాలి.
దర్శన సమయాలు
ఉదయం 6 గం. ల నుంచి 11 గం. ల దాకా, తిరిగి సాయంకాలం 6 గం. ల నుంచి 8 గం. ల దాకా.
వసతి సౌకర్యం
తెనాలిలో వసతికి, భోజనానికి అనువైన హోటల్స్ అనేకం వున్నాయి.  అంతేకాదు...తెనాలి, వైకుంఠపురంలో శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయంకూడా ప్రసిధ్ధి చెందినదే.
సంప్రదించండి
శ్రీ పవన్ కుమార్ శర్మ   9494814168

- పి.యస్.యమ్.లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)