నవరాత్రులలో లలితాదేవిని ఇలా పూజించాలి..
నవరాత్రులలో లలితాదేవిని ఇలా పూజించాలి..
అమ్మవారి రూపాలలో లలితా దేవిది ఓ ప్రత్యేకత. ఈ సృష్టి మొత్తానికీ ఆ లలితాదేవే మూలం అని నమ్ముతారు. ఆ అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఏదీ సాధ్యం కాదని భక్తుల నమ్మకం. అందుకని దేవతలు సైతం లలితా సహ్రస్రనామాలని చదువుతారట. ఈ సహ్రనామాలను సాక్షాత్తు విష్ణుమూర్తే ఈ లోకానికి అందించాడు. మరి అంత గొప్ప తల్లిని దసరా సందర్భంలో ఎలా పూజించాలి.
బురద నేలలో అద్భుతంగా వికసించే పూవు కలువ. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వ్యక్తిత్వాన్ని కోల్పోని లక్షణానికి ఈ కలువను ఉదాహరణగా చూపిస్తారు. అందుకనే లలితాదేవికి కలువపూవంటే చాలా ఇష్టమట. ఇంట్లో అమ్మవారిని లలితాదేవిగా పూజించాలని అనుకున్నప్పుడు తప్పకుండా ఆమె ముందు ఒక్క కలువ పూవైనా ఉంచి ప్రసన్నం చేసుకోవాలి. ఇక రంగులలో బంగారపు రంగంటే అమ్మవారికి చాలా ఇష్టం. మిగతా ఏ లోహానికీ లేని ప్రత్యేకత ఒక్క బంగారానికే ఉంది. కొద్దిపాటి వెలుగులో కూడా బంగారం తళతళా మెరిసిపోతుంది. లలితాదేవి కూడా అంతే! ... అనంతమైన జ్ఞానంతో మెరిసిపోతూ ఉంటుంది. అందుకు సూచనగా లలితాదేవిని బంగారపు రంగంతో వస్త్రంతో అలంకరించాలి.
ఇక లలితాదేవి అంటే లలితా సహస్రనామమే గుర్తకు వస్తుంది కదా! ఈ రోజు తప్పకుండా ఒక్కసారైనా లలితా సహస్రనామం జపించితీరాలి. లలితాసహస్రనామాన్ని చదవాలంటే కొందరు ధ్యానమ్, అంగన్యాసమ్, కరన్యాసమ్, పంచపూజ, ఉత్తరభాగాలను కూడా చదువుతారు. కుదరని పక్షంగా కేవలం సహస్రనామస్తోత్రం వరకూ చదువుకున్నా సరిపోతుంది. వీలైతే చుట్టపక్కలవారితో కలిసి లలితా పారాయణ ఏర్పాటు చేసుకోవాలి.
దసరాల్లో లలితాదేవిని తల్చుకునేందుకు మన పెద్దలు ఒక మూలమంత్రాన్ని ఉపదేశించారు. అదే- ‘ఓం హ్రీం శ్రీం క్లీం లలితాదేవ్యై నమః’. లలితాదేవిని పూజించే రోజున ఈ మంత్రాన్ని తప్పకుండా జపించాలి. ఒకవేళ ఈ రోజు లలితాసహస్ర నామాలను పారాయణ చేయడం కుదరని పక్షంలో ఈ మూలమంత్రాన్ని మనసులో జపించుకుంటే ఉంటే సరిపోతుంది. ఈ రోజు అమ్మవారిని శక్తి కొద్దీ పూజించుకున్న తర్వాత ఆమెకు రవ్వకేసరి, పులిహోర, పెసరబూరెలు, దద్ధ్యోదనం, పరమాన్నం వంటి నైవేద్యాలను సమర్పించాలి. ఇవేవీ తయారుచేయడం కుదరలేని బాధపడవద్దు. అమ్మవారికి కదళీవనం అంటే అరటితోట చాలా ఇష్టమట. అందుకని ఆ చల్లని తల్లికి ఓ రెండు అరటిపండ్లు పెట్టిన సరిపోతుంది.
ఇంట్లో లలితాదేవి పూజ ముగిసిన తర్వత ఆ దేవి నామాలతో కూడిన లలితాసహస్రనామ పుస్తకాలని పదిమందికీ పంచిపెడితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుంది. ఇక లలితాదేవిని పూజించిన రోజున ఉసిరికాయని కానీ, దాంతో చేసిన పదార్థాలని కానీ తినడం నిషిద్ధం అని పెద్దలు చెబుతున్నారు. ఈ రకంగా దసరాల్లో లలితాదేవిని పూజించినవారికి ధనధాన్యాలతో పాటు కీర్తిప్రతిష్టలు కూడా ఖాయం.