నిద్ర ఎందుకు ..అది దక్కేది ఎలా?

 

 

 

నిద్ర ఎందుకు ..అది దక్కేది ఎలా?

 

 

నిద్ర భగవంతుడు మనిషికిచ్చిన ముఖ్యమైన వరాల్లో ఒకటి. అలిసిపోయిన శరీరాన్ని, మనసుని సేద తీర్చి మరునాడు మళ్ళీ తాజాగా కార్యక్రమాలు చేపట్టగల శక్తినిస్తుంది నిద్ర . బాధలని, కష్టాలని మరచిపోవటం, లేక పోతే గుర్తు చేసుకోకుండా ఉండ గల గటం నిద్ర వల్ల జరుగుతుంది. మనిషి ఆహారం లేక పోయినా ఉండ గలడేమో కానీ నిద్ర లేకపోతే మాత్రం ఉండ లేడు. అయితే పక్కమీద పడుకున్న వారందరు నిద్ర పోయి, దాని ఫలితాన్ని పూర్తిగా పొందుతున్నారా? నిద్ర లేచే సరికి వారి శరీరం తేలికగా ఉంటోందా? అన్నది ప్రశ్నార్థకమే! పసి పి‌ల్లలుగా ఉన్నప్పుడు ఆద మరచి హాయిగా పడుకున్న మనిషి ఎదిగిన కొద్ది నిద్ర సుఖానికి దూరం అవుతున్నాడన్నది అందరికి తెలిసిన సత్యం. ఎన్నో వ్యాధులకిదే కారణం. మరెన్నో వ్యాధుల కిది లక్షణం కూడా. దీనిని సరి చేసుకుంటే ఆరోగ్యం చాలా వరకు బాగున్నట్టే. అందుకే మన పెద్దలు హాయిగా నిద్ర పోవటానికి కొన్ని పద్ధతులని సూచించారు.

 

 

పసి పిల్లలకి ఎంత నిద్ర పోతే అంత మంచిది. ఎదుగుతున్న పిల్లలు కూడా కొంచెం ఎక్కువే నిద్ర పోవాలి. ఆరోగ్యవంతుడైన ఎదిగిన మనిషికి అంటే యవ్వనం నుండి ప్రౌఢ దశ వరకు సుమారుగా ఆరు నుండి ఏడు గంటల నిద్ర సరిపోతుంది. చదువుకునే పిల్లలు, ఎక్కువగా ఆటలు ఆడే వారు, వ్యాయామం చేసేవారు, అధికంగా మెదడుతో పని చేసే వారు, వ్యాధుల నుండి కోలుకుంటున్న వారి విషయంలో నిద్ర పోయే సమయంలో మార్పు ఉంటుంది. వ్యక్తి గతంగా కూడా మార్పులు ఉండ వచ్చు. ఎంత సేపు పడుకున్నా అలసట తీరక పోవటం, పడుకోగానే నిద్ర పట్టక పోవటం, నిద్ర పట్టదేమో ననే భయం నిరంతరం వెంటాడుతూ ఉండటం, పట్టినది కలత నిద్ర కావటం, పీడ కలలు రావటం మొదలైన సమస్యలు తరచుగా చూస్తూ ఉంటాం. ఏదో తీవ్రమైన వ్యాధి ఉంటే తప్ప ఇటువంటి వాటిని అధిగమించే ఉపాయాలను ఇంట్లో అనుభవజ్ఞులైన పెద్దలు పాటింప చేసేవారు కొద్ది రోజుల క్రితం వరకు. చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది – తమ చిన్నతనంలో పెందలాడే రాత్రి భోజన కార్య క్రమాలని పూర్తి చేయటం, ఆ తరువాత ఇంటిల్లి పాది కూర్చుని ముచ్చటలాడుకోవటం, కాలకృత్యాల అవసరం ఉంటే తీర్చుకొని, కాళ్ళు చేతులు కడుక్కొని, (చలి కాలం అయితే వేడి నీళ్ళ తో) మంచి నీళ్ళు తాగి, పక్క మీద కూర్చున్న తరువాత కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి, పడుకోవటం. చిన్న పిల్లలు నిద్ర రావటం లేదంటే నాయనమ్మలో, తాతలో చక్కని కథలు (భయానకమైనవి కావు సుమా) చెప్పేవారు. లేదంటే వారికి నచ్చే దేవుడి పాటలో, భజనలో వినిపించేవారు.

 

ఈ కాలంలో ఈ పద్ధతి చాదస్తంగా కనిపించ వచ్చు . కానీ ఆలోచిస్తే ఎంత శాస్త్రీయమో అర్థమవుతుంది. అప్పట్లో రేడియోలు, టీ.వీ లు లేవు కనుక అలా సాగింది అంటారు. అది ఒక కారణం కావచ్చు. మన ఆరోగ్యం కోసం కొన్ని పద్ధతులని పాటించ లేమా? మన ఆరోగ్యానికన్న అవి ముఖ్యమా? పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే రాత్రి భోజనం త్వరగా చేయటం అలవాటు చేసుకున్నారు. మనం కొత్తగా మాని వేశాం. నిద్ర పోయే సమయానికి తిన్న ఆహారం మూడు వంతులకు పైగా అరిగి ఉండాలని ఆయుర్వేదం చెపుతోంది. అప్పుడు ప్రాణ శక్తి జీర్ణ వ్యవస్థ వైపుకి ఎక్కువగా వెళ్ళే పని ఉండదు కనుక మిగిలిన అవయవాలకి విశ్రాంతి నివ్వటంలో నిమగ్నమౌతుంది. కడుపు బరువుగా ఉంటే పీడ కలలు వస్తాయి. పీడ కలలు రాకుండా ఉండాలంటే నిద్ర పోయే సమయానికి చాలా ముందుగా భోజనం చెయ్యటం ఒక్కటే మార్గం.

 

కాళ్ళు కడుక్కోవటం అనే మాటని పెద్ద వాళ్ళు కాలకృత్యాలకి వెళ్ళి రావటం అనే అర్థంలోనే ఉపయోగించేవారు. ఎందుకంటే, లఘు శంక తీర్చుకున్న ప్రతి సారి కూడా కాళ్ళు కడుక్కోవటం వారి అలవాటు. దానినే పిల్లలకి చిన్నతనం నుండి అలవాటు చేసేవారు. అది శుచి కోసం అంటే పట్టించుకోరని, అలా చెయ్యక పోవటం దరిద్రం అనేవారు. కాలకృత్యాల తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోమని ఇప్పుడు వైద్యులు చెవినిల్లు కట్టుకొని పోరుతున్నారు కదా! దానిని ఊహ తెలిసినప్పటి నుండి ప్రవర్తనలో భాగంగా చేయటం జరిగింది. కాళ్ళు కడుక్కోవటం వల్ల బయట నుండి వచ్చే సూక్ష్మ క్రిములు పోతాయి. శుభ్రత ఎప్పుడైనా, ఎక్కడైనా కోరుకో దగినదే కదా! నిద్ర మధ్యలో ఒకటికో రెంటికో లేవటంవల్ల నిద్రా భంగం అవుతుంది. ఒక సారి లేస్తే తిరిగి నిద్ర పట్టక పోవచ్చు. కనుక అటువంటి ఇబ్బంది కలగకుండా అవసరాలను ముందే తీర్చుకునే అలవాటు ఎంత మంచిదో చూడండి!

 

నిద్ర మధ్యలో మెలకువ రావటానికి మరొక కారణం కూడా ఉంది. అది దాహం.నిద్ర పోతున్నప్పుడు చెమట ఎక్కువగా పడుతుంది. ఉన్న నీరు కర్చయి పోతుంది. అప్పుడప్పుడు ఎవరో పీక నొక్కుతున్నట్టు అనిపిస్తుంది. నిజానికి అది దాహం. గుర్తించే లోపు ఎంతో బాధ కలుగుతుంది. ఇటువంటి పరిస్థితిని తప్పించటానికే నిద్ర పోబోయే ముందు కడుపునిండ నీళ్ళు తాగటం అలవాటు చేసుకోమన్నారు. అప్పుడు నిద్ర మధ్యలో లేవటం , బాధ పడటం ఉండవు.

 

నిద్రకు ఉపక్రమించటానికి ముందు ఎటువంటి ఆలోచనలతో ఉంటే నిద్రలో కూడా మనసు ఆ ఆలోచనల ప్రభావంలోనే ఉంటుంది. కనుక నిద్ర లోకి జారుకొనే ముందు మంచి ఆలోచనలతో ఉండటం మంచిది. దానితో మన ప్రయత్నం లేకుండానే మనసు రాత్రంతా సానుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక వేళ కలలు వచ్చినా ఆహ్లాదకరమైనవే వస్తాయి. మనసుని మరింత ప్రశాంతంగా ఉంచగలిగితే కలలు కూడా రాని గాఢ నిద్ర పడుతుంది. అటువంటి నిద్ర కొన్ని గంటలైనా చాలు. అందుకే మనసుకి ప్రశాంతత , భద్రతా భావం కలిగించే సద్గ్రంధాలని చదవటం కాని, వినటం కాని చెయ్య మనే వారు. పెద్దలే భయ పడే భీతావహమైన దృశ్యాలతో, భయంకరమైన కథలతో ఉన్న టీ.వీ. సీరియల్స్, సినిమాలు చూస్తూ పడుకుంటున్న పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు కదా! రాత్రంతా ఒత్తిడికి లోనైన మనస్సుతో ఉన్న పిల్లల మానసిక స్థితి ఎంత అలజడికి లోనవుతుందో ఈ నాటి పిల్లల ప్రవర్తన చూస్తే అర్థమవుతుంది. పిల్లలు, యువతరం పాడై పోయారు, పెద్దలమాట వినటం లేదు, సంఘ విద్రోహక శక్తులుగా మారుతున్నారు అని వాపోతుంటారు ముందు తరం వారు. కాని పిల్లలకు మానసిక విశ్రాంతిని, భద్రతా భావాన్ని కలిగిస్తున్నామా అని ఆత్మ విమర్శ చేసుకో వలసి ఉంది.

 

ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ పడుకోవటం అలవాటయితే ఆ నిద్ర సుఖమే వేరు. ఆస్తికులైన పాశ్చాత్యులు ఈ నాటికీ పడుకోబోయే ముందు తప్పక ప్రార్థన చేస్తారు. మనం ఎందుకు మానేశాం? లయ కారకుడైన శివుని తలచుకుని నిద్ర కుపక్రమించటం మన సంప్రదాయం . సుఖ నిద్రకోసం, ఆరోగ్యవంతమైన సమాజం కోసం మన పెద్దలు చెప్పిన సూచనలను పాటించి ప్రయోజనం ఉంటుందేమో ప్రాయత్నించి చూద్దామా?

 

ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర పోయేప్పుడు పడుకునే దిశ, భంగిమ కూడా సహకరిస్తాయి. తూర్పు పడమరలుగా ఎటువైపు తల పెట్టుకున్నా సమస్య లేదు. ఉత్తర దక్షిణాలుగా పడుకునేప్పుడు తల దక్షిణ దిక్కుగా పెట్టుకోమని చెప్పారు. ఎందుకంటే భూమి ఒక అయస్కాంతం కదా! దాని ఉత్తర ధ్రువం మనకి దక్షిణం వైపుగా ఉంటుంది. మనిషి వెన్నెముక పై భాగం ఉత్తర ధ్రువం. దిగువ భాగం దక్షిణ ధ్రువం. పడుకున్నప్పుడు దానితో సంవదించి ఉంటే భూమి నుండి వచ్చే శక్తిని గ్రహించటానికి వీలవుతుంది. వ్యతిరేక దిశ అయితే సమ ధృవాలు ఒక దాని పక్కకి మరొకటి వస్తే ఏమవుతుందో తెలుసుగా! నిద్ర పోయే సమయంలో కూడా శక్తిని సముపార్జించుకునే చక్కని పద్ధతిని దర్శించి ఇచ్చిన మన ఋషులకు ఎన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటే సరిపోతాయి?

 

 

 

 

 

  ..P S M Lakshmi