శివ అక్షరమాలా స్తోత్రము - తాత్పర్యము
శివ అక్షరమాలా స్తోత్రము - తాత్పర్యము
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ||
అద్భుతవిగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ |సాంబ|
ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశ శివ |సాంబ|
ఇందుకళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ |సాంబ|
ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ |సాంబ|
ఉరగాదిప్రియ ఉరగవిభూషణ నరకవినాశ నటేశ శివ |సాంబ|
ఊర్జిత దానవనాశ పరాత్పర ఆర్జితపాపవినాశ శివ |సాంబ|
ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ రవి చంద్రాగ్నిత్రినేత్ర శివ |సాంబ|
ఋపనామాది ప్రపంచవిలక్షణ తాపనివారణ తత్వ శివ |సాంబ|
ళుల్లిస్వరూప సహస్రకరోత్తమ వాగీశ్వర వరదేశ శివ |సాంబ|
ళూతాధీశ్వర రూపప్రియ హర వేదాంతప్రియ వేద్య శివ |సాంబ|
ఏకానేక స్వరూప సదాశివ భోగాదిప్రియ పూర్ణ శివ |సాంబ|
ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన సచ్చిదానంద సురేశ శివ |సాంబ|
ఓంకారప్రియ ఉరగవిభూషణ హ్రీంకారప్రియ ఈశ శివ |సాంబ|
ఔరసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ |సాంబ|
అంబరవాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ |సాంబ|
ఆహారప్రియ అష్ట దిగీశ్వర యోగిహృది ప్రియవాస శివ |సాంబ|
కమలాపూజిత కైలాసప్రియ కరుణాసాగర కాశి శివ |సాంబ|
ఖడ్గశూల మృగ టంకధనుర్ధర విక్రమరూప విశ్వేశ శివ |సాంబ|
గంగా గిరిసుత వల్లభ శంకర గణహిత సర్వజనేశ శివ |సాంబ|
ఘాతకభంజన పాతకనాశన దీనజనప్రియ దీప్తి శివ |సాంబ|
గాంతస్వరూపానంద జనాశ్రయ వేదస్వరూప వేద్య శివ |సాంబ|
చండవినాశన సకలజనప్రియ మండలాధీశ మహేశ శివ |సాంబ|
ఛత్రకిరీట సుకుండల శోభిత పుత్రప్రియ భువనేశ శివ |సాంబ|
జన్మజరా మృత్య్వాది వినాశన కల్మషరహిత కాశి శివ |సాంబ|
ఝంకారప్రియ భృంగిరిటప్రియ ఓంకారేశ్వర విశ్వేశ శివ |సాంబ|
జ్ఞానాజ్ఞాన వినాశన నిర్మల దీనజనప్రియ దీప్తి శివ |సాంబ|
టంకస్వరూప సహస్రకరోత్తమ వాగీశ్వర వరదేశ శివ |సాంబ|
ఢక్కాద్యాయుధ సేవిత సురగణ లావణ్యామృత లసిత శివ |సాంబ|
డంభవినాశన డిండిమభూషణ అంబరవాస చిదేక శివ |సాంబ|
ఢంఢంఢమరుక ధరణీనిశ్చల ఢుంఢివినాయక సేవ్య శివ |సాంబ|
నానామణిగణ భూషణనిర్గుణ నతజనపూత సనాథ శివ |సాంబ|
తత్వమస్యాది వాక్యార్థ స్వరూప నిత్యస్వరూప నిజేశ శివ |సాంబ|
స్థావరజంగమ భువనవిలక్షణ తాపనివారణ తత్వ శివ |సాంబ|
దంతివినాశన దళితమనోభవ చందన లేపిత చరణ శివ |సాంబ|
ధరణీధరశుభ ధవళవిభాసిత ధనదాదిప్రియ దాన శివ |సాంబ|
నళినవిలోచన నటనమనోహర అలికులభూషణ అమృత శివ |సాంబ|
పార్వతినాయక పన్నగభూషణ పరమానంద పరేశ శివ |సాంబ|
ఫాలవిలోచన భానుకోటిప్రభ హాలాహలధర అమృత శివ |సాంబ|
బంధవిమోచన బృహతీపావన స్కందాదిప్రియ కనక శివ |సాంబ|
భస్మవిలేపన భవభయమోచన విస్మయరూప విశ్వేశ శివ |సాంబ|
మన్మథనాశన మధురానాయక మందరపర్వతవాస శివ |సాంబ|
యతిజన హృదయాధినివాస విధివిష్ణ్వాది సురేశ శివ |సాంబ|
రామేశ్వర పుర రమణ ముఖామ్బుజ సోమేశ్వర సుకృతేశ శివ |సాంబ|
లంకాధీశ్వర సురగణ సేవిత లావణ్యామృత లసిత శివ |సాంబ|
వరదాభయకర వాసుకిభూషణ వనమాలాది విభూష శివ |సాంబ|
శాంతి స్వరూపాతిప్రియ సుందర వాగీశ్వర వరదేశ శివ |సాంబ|
షణ్ముఖజనక సురేంద్రమునిప్రియ షాడ్గుణ్యాది సమేత శివ |సాంబ|
సంసారార్ణవ నాశన శాశ్వత సాధుజన ప్రియవాస శివ |సాంబ|
హరపురుషోత్తమ అద్వైతామృత మురరిపుసేవ్య మృడేశ శివ |సాంబ|
లాలిత భక్తజనేశ నిజేశ్వర కాళినటేశ్వర కామ శివ |సాంబ|
క్షరరూపాభి ప్రియాన్విత సుందర సాక్షాత్ స్వామిన్నంబా సమేత శివ |సాంబ|
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
తాత్పర్యము:
అద్భుతమైన విగ్రహము కలవాడు, దేవతలకు అధిపతి, ఎన్న లేని గుణముల సమూహం కలవాడు, ఆశ్రితులను రక్షించి ఆనందమనే అమృతాన్ని ఇచ్చే వాడు, ఆత్మానంద స్వరూపుడు, మహేశ్వరుడు, చంద్రుని ధరించిన వాడు, ఇంద్రాది దేవతలకు ప్రియుడు, సుందరమైన రూపము కలవాడు, దేవతలకు అధిపతి, ఈశ్వరుడు, జనులకు ప్రియుడు, విష్ణువుచే పొగడ బడిన వాడు, కీర్తి కలవాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.
నాగ జాతికి ప్రియుడైన వాడు, సర్పములను ఆభరణములుగా కలవాడు, నరక బాధ నాశనము చేసే వాడు, నాట్యానికి ఈశ్వరుడు, దుష్టులైన దానవులను నాశనము చేసే వాడు, మానవులను కూడబెట్టిన పాపములను నాశనము చేసే వాడు, ఋగ్వేదములో నుతించ బడినవాడు, చంద్రుని ధరించిన వాడు, సూర్యచంద్రాగ్నులు మూడు నేత్రములుగా కలవాడు, తాపమును తొలగించే వాడు, విలక్షణమైన ప్రపంచము కలవాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.
లింగ స్వరూపుడు, సహస్ర బాహువులతో ఉత్తమమైన వాడు, వాక్కుకు అధిపతి, వరములను ఇచ్చేవాడు, భూతములకు అధిపతి, తన రూపమునందు ప్రియుడు, హరుడు, వేదాంతమనే ఇష్టపడే వాడు, వేదములచే పొగడబడిన వాడు, ఏకము, అనేకము రూపములు కలవాడు, ఎల్లప్పుడూ శుభకరుడు, భోగాములందు ప్రియము కలవాడు, పూర్ణుడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.
ఐశ్వర్యమునకు నిలయమైన వాడు, అనంతమైన జ్ఞానము, కీర్తి, ఆనందం కలవాడు, ఓంకార, హ్రీంకార ప్రియుడు, గౌరీ సమేతుడు, యముని నాశనము చేసే వాడు, దిక్కులనే అంబరములుగా కలవాడు, చిదంబర క్షేత్రములో విలసిల్లిన వాడు, తుంబురు నారదాదులచే సేవించ బడే వాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.
ఆహార ప్రియుడు, అష్ట దిక్కులకు నాయకుడు, యోగుల హృదయాలలో నివసించేవాడు, బ్రహ్మచే పూజించ బడిన వాడు, కైలాస ప్రియుడు, కరుణా సాగరుడు, కాశీ క్షేత్రములో ఉన్నవాడు, ఖడ్గము, శూలము, టంకము, ధనుస్సు మొదలగు ఆయుధములు ధరించిన విక్రముడు, విశ్వేశ్వరుడు, గంగ మరియు పార్వతికి భర్త, శుభములు కలిగించే వాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.
భూత గణముల హితము కోరేవాడు, సర్వ జనులకు ఈశ్వరుడు, అపాయమూ కలిగించే వారిని నాశనము చేసే వాడు, పాపములను తొలగించే వాడు, దీనజనులకు ప్రియుడు, ప్రకాశకుడు, జనులకు ఆశ్రయమిచ్చే వాడు, వేద స్వరూపుడు, చండుని నాశనము చేసిన వాడు, అందరికి ప్రియమైన వాడు, భూత గణములకు, దేవతలు అధిపతి, చట్రము, కిరీటము కుండలములు ధరించిన వాడు, పుత్రులైన గణపతి, కుమారస్వామికి ప్రియుడు, ఈ విశ్వమునకు అధిపతి అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.
జన్మము, జరా మరణములను నాశనము చేసే వాడు, కల్మషము లేని వాడు, కాశీ నివాసుడు, ఝుంకారము అంటే ఇష్ట పడే వాడు, భృంగి (నంది) నాట్య మంటే ఇష్టపడే వాడు, ఓంకారేశ్వర క్షేత్రములో వెలసిల్లిన వాడు, జ్ఞానమును కలిగించే వాడు,ఆజ్ఞానమును నాశనము చేసే వాడు, నిర్మలమైన వాడు, టంక స్వరూపుడు, ఢక్కము మొదలగు ఆయుధములు కలిగి, దేవతా గణము చే పూజించబడి, లావణ్యముతో శోభిల్లే వాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.
డంభాసురుని సంహరించిన వాడు, డమరుకము ధరించిన వాడు, దిక్కులన్నిట ఏకమై యున్న వాడు, ఢమరుకము తో ఢంఢం నాదము చేస్తూ ప్రపంచాన్ని నిశ్చలము చేసే వాడు, కుమారస్వామి, వినాయకునిచే పూజించ బడిన వాడు, అనేకరకమైన మణులు ఆభరణములుగా కలిగిన, గుణ విహీనుడు, స్తుతించే వారి పాలిత దయచూపే వాడు, సకల జీవులకు నాథుడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.
తత్త్వమసి (నేనే బ్రహ్మను) మొదలగు వాక్యములకు అర్థమైన వాడు, నిత్యమైన వాడు, సృష్టిలో చరాచరములకు మూలమై విలక్షణముగా నున్నవాడు, తాపమును నివారించే వాడు, తత్త్వ స్వరూపుడు, గజాసురుని సంహరించిన వాడు, దీనుల మనసు తెలిసిన వాడు, పాదములకు గంధము పూయబడిన వాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.
భూమి యందు సకల శుభములు కలిగించే వాడు, తెల్లని మంచు కొండలపై నివసించువాడు, ధనము, దానము అంటే ఇష్టపడే వాడు, నల్లని కనులు కలవాడు, అందముగా నాట్యము చేసే వాడు, సర్పములు ఆభరణముగా కలవాడు, అమృత స్వరూపుడైన వాడు, పార్వతీ వల్లభుడు, పరమానందముగా నుండే వాడు, అత్యున్నతమైన దైవము అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.
అగ్నిని మూడవ కన్నుగా కలవాడు, సూర్యుని వంటి తేజస్సు కలవాడు, విషమును గళంలో యుంచుకొనిన వాడు, అమృత రూపుడు, బంధములను తొలగించే వాడు, బృహతీవృక్షమున నివసించే వాడు, సుబ్రహ్మణ్య స్వామి మొదలగు వారికి ప్రియుడు, భస్మము శరీరమున కలిగిన వాడు, సంసారమున భయములను తొలగించే వాడు, విస్మయము కలిగించే రూపము కలవాడు, విశ్వేశ్వరుడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.
మన్మథుని సంహరించిన వాడు, మధురా పట్టణమున వెలసిన వాడు, మందరగిరి పై నివసించే వాడు, యతుల హృదయములో నివసించే వాడు, విష్ణువు, బ్రహ్మ మొదలగు దేవతలచే పూజించబడిన వాడు, రామేశ్వరము, సోమేశ్వరము మొదలగు క్షేత్రములలో వెలసిన వాడు, రావణుడు, దేవతలచే పూజించబడిన వాడు, వరములు, అభయం ఇచ్చే వాడు, వాసుకి, వనమాల ఆభరణములుగా కలవాడు. శాంతి స్వరూపుడు, సుందరమైన రూపము కలవాడు, వాక్కుకు అధిపతి, వరములిచ్చే వాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.
షణ్ముఖుడైన సుబ్రహ్మణ్యునికి తండ్రి, ఇంద్రుడు, మునులకు ప్రియుడు, ఆరు గుణములు కలవాడు, సంసారమనే సాగరమును దాటించే వాడు, శాశ్వతుడు, సాదుజనులకు ప్రియుడు, వారి వద్ద ఉండే వాడు, హరుడు, పురుషోత్తముడు, అద్వైతమనే అమృతము తానైన వాడు, విష్ణువుచే పూజించ బడిన వాడు, భక్తులచే ప్రేమించబడే వాడు, జనులకు ఈశ్వరుడు, సత్యమునకు అధిపతి, పార్వతితో కలిసి నాట్యము చేసే వాడు, మన్మథుని చంపిన వాడు, సుందరేశుడు, అంబా సమేతుడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.