శివలింగానికి వీటితో రుద్రాభిషేకం చేస్తే ఎంతో పుణ్యం!

 

శివలింగానికి వీటితో రుద్రాభిషేకం చేస్తే ఎంతో పుణ్యం..!!

రుద్రాభిషేకం శివునికి చాలా ప్రీతికరమైనది. మహాశివుడికి  రుద్రాభిషేకం చేయడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. శివునికి ఏయే వస్తువులతో రుద్రాభిషేకం చేయాలి..? శివుడికి రుద్రాభిషేకం చేస్తే ఏం లాభం..? తెలుసుకుందాం.

శ్రావణమాసం రెండవ శుక్రవారం. మహాశివుని ఆరాధించడానికి, శివస్తోత్రం చేయడానికి, ఉపవాసం ఉండటానికి చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. శ్రావణమాసం హిందూమతంలో పవిత్రమాసంగా పరిగణిస్తారు. అంతేకాదు ఈ మాసం మహాశివునికి ఎంతో ప్రీతికరమైంది.  ఈ సమయంలో రుద్రాభిషేకం చేస్తే విశేష ఫలితాలు వస్తాయి. హిందూమతంలో రుద్రాభిషేకం ఒక ముఖ్యమైన ఆచారంగా పరిగణిస్తారు. ఇందులో శివలింగానికి భక్తితో అభిషేకం చేస్తారు. రుద్రాభిషేకం చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. అయితే నియమానుసారంగా రుద్రాభిషేకం చేస్తేనే ఫలితం దక్కుతుంది. కాబట్టి రుద్రాభిషేకానికి కావలసిన సామాగ్రి ఏమిటో, దానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకుందాం.

నీటితో రుద్రాభిషేకం:
మహాశివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నీరు ఒకటి. శివలింగంపై ఎప్పుడూ నీరు పడుతూనే ఉంటుంది. శ్రావణమాసంలో మహాశివునికి నీటితో రుద్రాభిషేం చేసినట్లయితే ఆర్ధిక సమస్యలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అంతేకాదు వర్షాలు కురువాలని ఆ శివయ్యకు నీళ్లతో అభిషేకం చేస్తుంటారు. అయితే మహాశివుడికి అభిషేకం చేసే నీరు స్వచ్చమైంది..చల్లని నీటిని సమర్పించాలి.  

నెయ్యితో రుద్రాభిషేకం:
శివలింగానికి నెయ్యితో రుద్రాభిషేకం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. శివలింగానికి నెయ్యితో రుద్రాభిషేకం చేస్తే కుటుంబానికి శాంతి చేకూరుతుంది. కుటుంబంలో ఆనందం, శాంతి, సౌలభ్యం ఉంటుంది. మీ కుటుంబం అభివృద్ధి చెందాలటే  శ్రావణ మాసంలో పరమశివుడికి నెయ్యితో రుద్రాభిషేకం చేయాలి.

పుణ్యక్షేత్రం నుండి నీటితో రుద్రాభిషేకం:
మీరు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందాలంటే, శ్రావణ మాసంలో శివునికి తీర్థయాత్ర చేసిన పవిత్ర జలంతో రుద్రాభిషేకం చేయాలి. పవిత్ర పుణ్యక్షేత్రం నుండి నీటిని తెచ్చి, శివునికి అభిషేకం చేస్తే, ఆ వ్యక్తి మరణానంతరం మోక్షాన్ని పొందుతాడని నమ్ముతారు.

తేనెతో రుద్రాభిషేకం:
మహాశివుడికి తేనెతో రుద్రాభిషేకం చేస్తే..సమాజంలో గౌరవాన్ని పొందుతారు.ఉద్యోగ రంగంలో పురోభివృద్ధి, ప్రమోషన్, ఉన్నత స్థానం పొందుతారు. విద్యలో అభివృద్ధి చూడవచ్చు. అన్ని కార్యాలలో విజయం పొందడానికి శివలింగానికి తేనెతో అభిషేకం చేయాలి.

పంచామృతంతో రుద్రాభిషేకం:
శివలింగానికి పంచామృతాలతో కూడిన రుద్రాభిషేకం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మీకు ఏదైనా కోరిక ఉంటే, ఆ కోరికను నెరవేర్చడానికి మీరు శివలింగానికి పంచామృత అభిషేకం చేయాలి. పంచామృత అభిషేకం ఒక వ్యక్తి యొక్క ప్రతి కోరికను నెరవేరుస్తుంది.

చెరుకు రసంతో రుద్రాభిషేకం:
శివునికి అత్యంత ఇష్టమైన వాటిలో చెరకు రసం ఒకటి. మీరు చాలా కాలంగా డబ్బు సమస్యతో సతమతమవుతున్నా, అప్పుల ఊబిలో కూరుకుపోయినా శ్రావణ మాసంలో శివలింగానికి చెరుకు రసంతో రుద్రాభిషేకం చేయాలి.