శ్వేతార్క గణపతిని ఎలా పూజించాలి ( Shwetark Ganapati Pooja)
శ్వేతార్క గణపతిని ఎలా పూజించాలి
(Shwetark Ganapati Pooja)
తెల్ల జిల్లేడును శ్వేతార్కం అంటారు. వృక్షజాతిలో ఈ తెల్ల జిల్లేడు విశిష్టమైంది. ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపు పోతుందని భయపడతారు. కానీ గమ్మత్తేమిటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారుచేస్తున్నారు. జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి. వంగపూవు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల పూల జిల్లేడు మరొకటి. ఇది హేరంబ గణపతికి ప్రతీక. ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు, విఘ్నాదిపతుల దయ మనమీద ప్రసరిస్తుందట.
శ్వేతార్క లేదా తెల్ల జిల్లేడు వేళ్ళ మీద గణపతి నివసిస్తాడు. ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయి. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మొక్కలా ఇంట్లో నాటుతారు. శ్వేతార్క మొక్క గనుక ఉంటే ధన ధాన్యాలు పుష్కలంగా లభిస్తాయట. ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా, వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి.
ఇళ్ళలో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి శ్వేతార్కం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలీదట. జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం అని నమ్ముతారు.
శ్వేతార్క వేళ్ళు గనుక గణపతి రూపాన్ని సంతరించుకుంటే, అది స్వయంభూ శ్వేతార్క గణపతి అన్నమాట. మరి ఈ శ్వేతార్క రూపాన్ని ఎలా పూజించాలి అని సందేహం వస్తుంది కదూ! ఈ గణపతికి ఎరుపు రంగు ఇష్టం. ఆసనం మీద కుంకుమ వేసి శ్వేతార్క గణపతిని నిలిపి, ఎర్ర వస్త్రం కప్పి, నైవేద్యం సమర్పించి పగడాలు లేదా ఎర్ర రుద్రాక్షలతో పూజించాలి. మందార లాంటి ఎర్రటి పూలు, ఎర్ర చందనంతో పూజ చేయాలి.
శ్వేతార్క గణపతిని పూజించిన వారికి వెంటనే గొప్ప ఫలితాలు సాక్షాత్కరిస్తాయని ఎందరో అనుభవపూర్వకంగా చెప్తున్నారు.
Shwetark Ganapati, Shwetark Ganapati Pooja, Shwetark Ganapati Puja, Shwetark roots, Tella Jilledu roots, Tella Jilledu Vellu