శ్రీసాయిసచ్చరిత్రము ముప్పైతొమ్మిదవ అధ్యాయము
శ్రీసాయిసచ్చరిత్రము
ముప్పైతొమ్మిదవ అధ్యాయము
1. బాబా సంస్కృత పరిజ్ఞానము : భగవద్గీత శ్లోకమునకు బాబా
చెప్పిన అర్థము 2. మహాసమాధి మందిరనిర్మాణము
ఈ అధ్యాయంలో భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకానికి బాబా చెప్పిన అర్థముంది. కొందరు బాబాకు సంస్కృతము తెలియదని, అది నానాసాహెబు చాందోర్కర్ చెప్పింది అని అనటంతో హేమాడ్ పంతు 50వ అధ్యాయంలో ఈ సంగతిని విశదీకరించారు. రెండు అధ్యాయాలలో ఒకే విషయం ఉండటంతో రెండూ ఇందులో పొందుపరచడమైనది.
తొలిపలుకు :
షిరిడీ పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఎలాగంటే శ్రీసాయి అక్కడే నివశిస్తూ, తిరుగుతూ, మసలుతూ, చివరికి అక్కడే మహాసమాధి పొందారు. షిరిడీ గ్రామప్రజలు ధన్యులు. వారి సర్వకార్యాలను బాబా నెరవేరుస్తూ ఉండేవారు. బాబా వారికోసమే చాల దూరంనుండి అక్కడికి వచ్చారు. మొదట షిరిడీ చాలా చిన్న గ్రామం. సాయిబాబా అక్కడ నివశించటంతో దానికి గొప్ప ప్రాముఖ్యం వచ్చింది. చివరికి పవిత్రమైన యాత్రాస్థలం అయ్యింది. అక్కడ ఉండే స్త్రీలు కూడా ధన్యులు. బాబాపట్ల వారి భక్తి నిస్సంశయంగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానం చేసేటప్పుడు, విసరుతున్నప్పుడు, రుబ్బుతున్నప్పుడు, ధాన్యం దంచుతున్నప్పుడు, తదితర గృహకృత్యాలు చేస్తున్నప్పుడు పాడుతూ ఉండేవారు. వారి భక్తిప్రేమలు పావనాలు. వారు చక్కని పాటలు పాడుతూ ఉండేవారు. అవి పాడినవారికి, విన్నవారికి మనఃశ్శాంతి కలగాజేస్తూ ఉండేది.
బాబా చెప్పిన అర్థము :
బాబాకు సంస్కృతం వచ్చునని నమ్మేవారు ఉండరు. ఒకరోజు భగవద్గీతలోని ఒక శ్లోకానికి బాబా చక్కని అర్థాన్ని నానాసాహెబు చాందోర్కరుకు బోధించి ఆశ్చర్యం కలిగించారు. ఈ విషయం గురించి బి.వి.దేవుగారు (శ్రీ సాయి లీల, సంపుటి - IV, పుట - 563, 'స్ఫుటవిషయ''లో) వ్రాశారు. వారు స్వయంగా నానాసాహెబు చాందోర్కర్ దగ్గరనుంచి కొన్ని సంగతులు తెలుసుకోవడంతో ఆ వృత్తాంతం ఈ దిగువ ఇవ్వబడింది.
నానాసాహెబు చాందోర్కర్ వేదాంతాన్ని బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానాలతో చదివి ఉన్నందున తన పాండిత్యానికి గర్విస్తూ ఉన్నాడు. బాబాకీ విషయంగాని, సంస్కృతం గాని తెలియదని ఆయన అభిప్రాయం. అందుకే ఒకరోజు బాబా అతని గర్వాన్ని అణచారు. ఆ తొలిరోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయాలను తీర్చడానికి ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుతూ ఉన్నారు. బాబా దగ్గర నానా కూర్చుని వారి కాళ్ళు వత్తుతూ నోటిలో ఏదో గొణుక్కుంటూ ఉన్నారు.
బాబా : నానా! ఏమిటి గొణుగుతున్నావు?
నానా : సంస్కృత శ్లోకాన్ని వల్లిస్తున్నాను.
బాబా : ఏ శ్లోకము?
నానా : భగవద్గీతలోనిది.
బాబా : గట్టిగా చదువు.
నానా : (భగవద్గీత 4 - వ అధ్యాయం, 34వ శ్లోకం ఈ క్రింద విధంగా చదివారు.)
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శినః
బాబా : నానా! అది నీకు బోధపడిందా?
నానా : అవును
బాబా : నీకు తెలిసినట్లయితే నాకు చెప్పు.
నానా : దాని తాత్పర్యమిది. సాష్టాంగనమస్కారం చేయడం అంటే పాదాలపై పడటం, గురువుని ప్రశ్నించటం, వారి సేవచేయటం ద్వారా ఈ జ్ఞానాన్ని తెలుసుకో. అప్పుడు మోక్షాన్ని పొందు జ్ఞానం కలవారు అనగా, పరబ్రహ్మాన్ని తెలిసినవారు ఆ జ్ఞానాన్ని ఉపదేశించెదరు.
బాబా : నానా! శ్లోకం యొక్క తాత్పర్యం అక్కర్లేదు. ప్రతిపదార్థం వ్యాకరణ, మరియు దాని అర్థం చెప్పు.
అప్పుడు నానా ప్రతి పదానికి అర్థం చెప్పారు.
బాబా : నానా! ఉత్త సాష్టాంగనమస్కారం చేస్తే చాలా?
నానా : ప్రణిపాత అనే పదానికి ఇంకొక అర్థం నాకు తెలియదు.
ప్రణిపాత అంటే సాష్టాంగనమస్కారం అని నాకు తెలుసు.
బాబా : పరిప్రశ్న అంటే ఏమిటి?
నానా : ప్రశ్నలు అడగటం
బాబా : ప్రశ్న అంటే ఏమిటి?
నానా : అదే, అంటే ప్రశ్నించటం.
బాబా : పరిప్రశ్న అన్నా ప్రశ్న అన్నా ఒక్కటే అయినట్లయితే, వ్యాసుడు 'పరి'అనే ప్రత్యయానికి ప్రశ్నకు ముందు ఎలా ఉపయోగించారు? వ్యాసుడు తెలివితక్కువ వాడా?
నానా : పరిప్రశ్న అనే మాటకు నాకు ఇతర అర్థం ఏమీ తెలియదు.
బాబా : సేవ అంటే ఎలాంటిది?
నానా : ప్రతిరోజూ మేము చేసే వంటిది.
బాబా : అలాంటి సేవ చేసినా చాలా?
నానా : సేవ అనే పదానికి ఇంకా వేరే అర్థం ఏమి ఉందొ నాకు తోచటం లేదు.
బాబా : రెండవ పంక్తిలోని "ఉపదేక్ష్యంతి తే జ్ఞానం'' అనేదానిలో జ్ఞానం అనే పదము ఉపయోగించకుండా యింకొక పదాన్ని ఉపయోగించగలవా?
నానా : అవును
బాబా : ఏ పదం?
నానా : అజ్ఞానం
బాబా : జ్ఞానానికి బదులు అజ్ఞానం ఉపయోగించినట్లయితే ఈ శ్లోకంలో ఏమైనా అర్థం ఉందా?
నానా : లేదు; శంకరభాష్య ఆ విధంగా చెప్పటం లేదు.
బాబా : వారు చెప్పినట్లయితే పోనివ్వు, అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగించినట్లయితే తగిన అర్థం వచ్చునప్పుడు దాన్ని ఉపయోగించడానికి ఏమైనా ఆక్షేపణ ఉందా?
నానా : అజ్ఞానం అనే పదాన్ని చేర్చి దాని అర్థాన్ని విశదపరచటం నాకు తెలియదు.
బాబా : కృష్ణుడు అర్జునునికి జ్ఞానులకు తత్త్వదర్శులకు నమస్కారం, ప్రశ్నించటం, సేవ చేయమని చెప్పడం ఎందుకు? స్వయంగా కృష్ణుడు తత్త్వదర్శి కాడా? వారు నిజంగా జ్ఞానమూర్తే కదా!
నానా : అవును, అతడు తత్త్వదర్శే, కాని అర్జునుడు ఇతర జ్ఞానులను ఎందుకు సేవించమన్నారో నాకు తోచటం లేదు.
బాబా : నీకిది బోధపడలేదా?
నానా సిగ్గుపడ్డాడు. అతని గర్వం అణిగింది. అప్పుడు బాబా ఇలా వ్యాఖ్యానించారు.
1 జ్ఞానులముందు ఉత్త సాష్టాంగనమర్కారం చేస్తే సరిపోదు. మనం సద్గురువుకి సర్వస్యశరణాగతి చేయాలి.
2 ఊరికే ప్రశ్నించటం చాలదు. దుర్బుద్ధితో కాని, దొంగ ఎత్తుతో కాని, వారిని బుట్టలో వేసుకోవడానికి కానీ, వారి తప్పులను పట్టుకోవడం కానీ, పనికిమాలిన ఆసక్తితో అడగకూడదు. నిజంగా తెలిసుకొని దానితో మోక్షం పొందటానికి కాని, ఆధ్యాత్మికాభివృద్ధికి కానీ అడగాలి.
3 సేవ అంటే ఇష్టం ఉన్నట్లయితే చేయవచ్చు. లేకపోతే మానవచ్చు అనే అభిప్రాయంతో చేసేది సేవ కాదు. శరీరం తనది కాదనీ, దానికి తాను యజమాని కాదనీ సహ్రీరం గురువుగారిదనీ, వారి సేవకోసమే శరీరం ఉన్నదనీ భావించాలి. ఇలా చేసినట్లయితే సద్గురువు శ్లోకంలో చెప్పబడిన జ్ఞానాన్ని బోధిస్తుంది.
గురువు అజ్ఞానాన్ని బోధించునంటే, నానాకు అర్థం కాలేదు.
బాబా : జ్ఞానం ఉపదేశం ఎలా అవుతుంది? అంటే సాక్షాత్కారం బోధించడం ఎలా అవుతుంది? అజ్ఞానాన్ని నశింప చేయటమే జ్ఞానం.
జ్ఞానేశ్వరా మహారాజు ఇలా చెప్పారు "అజ్ఞానాన్ని తొలగించుతం ఇలా. "ఓ అర్జునా! స్వప్నం, నిద్ర తొలగిపోయినట్లయితే మిగిలేది నీవుగా గ్రహించు. జ్ఞానం అంటే అజ్ఞానాన్ని నశింపచేయటమే. చీకటిని తరమటమే వెలుతురు. ద్వైతాన్ని నశింపచేయటమే అద్వైతము. ద్వైతాన్ని నశింప చేసేది ఏమిటంటే, అద్వైత్వం గురించి చెప్పడం. చీకటిని నశింప చేసేది ఏమిటంటే, వెలుతురు గురించి చెప్పటం. అద్వైతం పొందాలంటే, ద్వైతమనే భావనను మనసులో నుంచి తీసివేయాలి. అదే అద్వైతాన్ని పొందే జ్ఞానం. ద్వైతములోనే ఉండి అద్వైతాన్ని గురించి మాట్లాడగల వారు ఎవరు? ఎవరైనా అలా చేసినట్లయితే నా స్థితిలోకి వారు రానిదే వారికి అది ఎలా తెలుస్తుంది? దాన్ని ఎలా పొందుతారు? శిష్యుడు గురువులా జ్ఞానమూర్తే. వీరిద్దరికి భేదం ఏమిటంటే గ్రహించే తీరు, గొప్ప సాక్షాత్కారం, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తిమత్వం, మరియు ఐశ్వర్యయోగం. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవ ఆకారంలో అవతరించటం, జగత్తును, మానవాళిని ఉద్ధరించడానికి మాత్రమే. దాని వలన వారి అసలయిన నిర్గుణ స్వభావం కొంచెం గూడ వికారం చెందదు. వారి సర్యస్వరూపం, దైవికశక్తి, జ్ఞానం తరగకుండా ఉంటుంది. శిష్యుడు కూడా అలాంటి స్వరూపం కలవాడే. కాని అతని అనేక జన్మల అజ్ఞానం తానే శుద్ధచైతన్యం అనే సంగతిని కప్పివేస్తుంది. అతడు "నేను సామాన్య నికృష్టజీవుడిని'' అనుకుంటాడు. గురువు ఈ అజ్ఞానాన్ని మూలంతో తీసివేయాలి. తగిన ఉపదేశం ఇవ్వాలి. లెక్కలేనన్ని జన్మలనుంచి సంపాదించిన అజ్ఞానాన్ని గురువు నిర్మూలించి ఉపదేశించాలి. ఎన్నో జన్మలనుంచి తాను నికృష్టజీవుడు అనుకునే శిష్యుడికి గురువు "నీవే దైవం, శక్తిమంతుడివి. ఐశ్వరశాలివి'' అని బోధిస్తారు. అప్పుడు శిష్యుడు కొంచెం కొంచెంగా తానే దైవమని గ్రహిస్తాడు. తాను శరీరమని, తానొక జీవినని లేదా అహంకారమని, దేవుడు, లోకం తనకంటే వేరు అని తలంచి అంతా భ్రమ అనేక జన్మలనుంచి వస్తున్న దోషము. దానిపై ఆధారపడి చేసిన కర్మలనుండి వాడికి సంతోషం, విచారం, ఈ రెండింటి యొక్క మిశ్రమము కలుగుతుంది. ఈ భ్రమను, ఈ దోషాన్ని, ఈ మూల అజ్ఞానాన్ని గురించి అతడు విచారం ఆరంభించాలి. ఈ అజ్ఞానం ఎలా అంకురించింది? అది ఎక్కడ ఉన్నది? అనే దాన్ని చూపటమే గురూపదేశం అంటారు. ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణాలు :
1. నేను జీవిని (ప్రాణిని)
2. శరీరమే ఆత్మ (నేను శరీరాన్ని)
3.భగవంతుడు, ప్రపంచం, జీవుడు వేర్వేరు
4. నేను దేవుడిని కాదు
5.శరీరం ఆత్మ కాదని తెలుసుకోలేక పోవడం
6. దేవుడు, జీవుడు, ప్రపంచం ఒకటే అని తెలియకపోవడం
ఈ తప్పులన్నీ చూపించనిదే, శిష్యుడు దేవుడు అంటే, ప్రపంచం అంటే, శరీరం అంటే ఏమిటో తెలుసుకోలేడు. వానిలో వానికి ఎలాంటి సంబంధం కలదో ఒకటి యింకొకటి కంటే వేరైనదా లేక రెండూ ఒకటేనా అనే సంగతి గ్రహింప జాలడు. ఈ సంగతులను బోధించడానికి వాని అజ్ఞానం నశింప చేయడానికి చెప్పేదే జ్ఞానమా? అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవుడికి జ్ఞానోపదేశం ఎందుకు చేయాలి? ఉపదేశం అనేది వాని తప్పును వానికి చూపించి వాని అజ్ఞానాన్ని నశింప చేయటం కోసమే. బాబా ఇంకా ఇలా అన్నారు :
1. ప్రాణిపాత అంటే శరణాగతి చేయడం. 2. శరణాగతి అంటే తను (శరీరం), మన (మనస్సు), ధనాలని (ఐశ్వర్యం) అర్పించటం 3. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఇతర జ్ఞానులను ఆశ్రయించమని ఎందుకు చెప్పాడు?
సద్భక్తుడు సర్వం వాసుదేవమయంగా భావిస్తాడు. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిలా భావిస్తాడు. గురువు శిష్యుణ్ణి వాసుదేవుడిగానూ, శ్రీకృష్ణుడు ఇద్దరినీ తన ప్రాణం ఆత్మలుగానూ భావిస్తాడు. అటువంటి భక్తులు, గురువులు ఉన్నారని శ్రీకృష్ణుడికి తెలిసి ఉండటంతో, వారిని గురించి అర్జునుడికి చెప్పాడు. అలాంటి వారి గొప్పతనం పెరిగి అందరికీ తెలియాలనే శ్రీకృష్ణుడు అలా పేర్కొన్నాడు.
సమాధిమందిర నిర్మాణము :
బాబా తాను చేయాలనుకుని నిశ్చయించుకున్న పనుల గురించి ఎప్పుడూ మాట్లాడేవారు కాదు. ఏమీ సందడి చేసేవారు కాదు. సంగతి సందర్భాలను వాతావరణాన్ని అత్యంత యుక్తిగా ఏర్పరచి, తప్పనిసరి పరిస్థితులు కలిగిస్తూ ఉండేవారు. అందుకు సమాధిమందిర నిర్మాణం ఒక ఉదాహరణ.
నాగపూరు కోటీశ్వరుడు, శ్రీమాన్ బాపూసాహెబు బూటీ షిరిడీలో సకుటుంబంగా ఉండేవాడు. అతనికి అక్కడ సొంత భవనం ఉంటే బాగుంటుందని ఆలోచన కలిగింది. కొన్నాళ్ళ తరువాత దీక్షిత్ వాడాలో నిద్రిస్తూ ఉండగా అతనికి ఒక దృశ్యం కనిపించింది. బాబా స్వప్నంలో కనపడి ఒక వాడాను మందిరముతో సహా నిర్మించమన్నారు. అక్కడ నిద్రిస్తున్న శ్యామాకి కూడా అలాంటి దృశ్యం కనిపించింది. బాపూసాహెబు లేచి శ్యామా ఏడవడం చూసి కారణం అడిగారు. శ్యామా ఇలా చెప్పాడు "బాబా నా దగ్గరకి వచ్చి ఒక మందిరంతో సహా వాడాను నిర్మించు. నేను అందరి కోరికలను నెరవేరుస్తానని అన్నారు. బాబా ప్రమమదురమైన పలుకులు విని, భావావేశంతో మైమరిచిపోయాను; నా గొంతుక ఆర్చుకుని పోయింది. నా కళ్ళనుండి నీరు కారుతూ ఉండింది. నేను ఏడవటం మొదలుపెట్టాను.'' వారిద్దరి దివ్యస్వప్నాలు ఒకటే అయినందుకు బాపూసాహెబు బూటీ విస్మయం చెందారు. ధనవంతుడు అవటంతోనూ, చేతనయిన వాడు అవడంతో, అక్కడొక వాడాను నిర్మించడానికి నిశ్చయించుకొని మాధవరావు (శ్యామా) సహాయంతో ఒక ప్లాను గీశారు. కాకాసాహెబు దీక్షిత్ దాన్ని ఆమోదించారు. దాన్ని బాబా ముందు పెట్టగా, బాబా కూడా వెంటనే ఆమోదించారు. కట్టటం ప్రారంభించారు. శ్యామా పర్యవేక్షణ చేస్తున్నాడు. భూమ్యుపరిగృహము, భూగృహము, బావి పూర్తయ్యాయి. బాబా కూడా లెండీకి వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు కొన్ని మార్పులను సూచిస్తూ సలహాలను ఇస్తున్నారు. మిగిలిన పని అంతా బాపూసాహెబు జోగును చూడమని చెప్పారు.
అది నిర్మిన్స్తున్నప్పుడు బాపూసాహెబు బూటీకికి ఒక ఆలోచన కలిగింది. చుట్టూ గదులు ఉండి, దాని మధ్య ఒక విశాలమైన హాలులో మురళీధరుని (శ్రీకృష్ణుని) ప్రతిమను ప్రతిష్టించాలని తట్టింది. బాబాకి ఈ సంగతి తెలియజేసి వారి అభిప్రాయాన్ని కనుక్కోవాలని శ్యామాకు చెప్పాడు .వాడా ప్రక్కనుంచి బాబా వెళ్తుండగా వారిని శ్యామా ఈ విషయాన్ని అడగగా బాబా అందుకు సమ్మతించి "దేవాలయం పూర్తికాగానే నేనే అక్కడ నివశించడానికి వస్తాను'' అని వాడావైపు చూస్తూ "వాడా పూర్తయిన తరువాత మనమే దాన్ని ఉపయోగించుకోవాలి. మనమందరం అక్కడ ఉందాము. అందరు కలిసిమెలిసి ఆడుకున్దాము. ఒకరినొకరు కౌగిలించుకొని సంతోషంగా ఉండవచ్చును'' అన్నారు. దేవస్థాన మధ్య మందిరం కట్టడానికి అది తగిన శుభసమయం అని శ్యామా అడగ్గా, బాబా సమ్మతించటంతో శ్యామా కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టి పనిని ప్రారంభించాడు. కొద్దికాలంలో పని పూర్తి అయ్యింది. మురళీధర్ విగ్రహం తయారు చేయడానికి ఆజ్ఞాపించారు.
అది తయారు కాకముందే క్రొత్త సంగతి జరిగింది. బాబాకు తీవ్రమైన జ్వరం వచ్చింది. వారు కాయాన్ని విడవడానికి సిద్ధంగా ఉన్నారు. బాపూసాహెబు అమితంగా విచారగ్రస్తుడయ్యాడు; నిరాశాపడ్డాడు. బాబా సమాధి చెందినట్లయితే, తన వాడా బాబా పాదాలతో పవిత్రం కాదనీ, తాను మదుపు పెట్టిన లక్షరూపాయలు వ్యర్థం అవుతాయని చింతించాడు. కాని బాబా సమాధి చెందక ముందు "నన్ను రాతి వాడాలో ఉంచండి'' అన్నట్టు పలుకులు బాపూసాహెబుకె కాక అందరికీ ఊరట కలిగించాయి. సకాలంలో బాబా పవిత్రశరీరాన్ని మధ్య మందిరంలో పెట్టి సమాధి చేశారు. ఇలా మురళీధరుని కోసం నిర్ణయించిన స్థలంలో బాబా సమాధి చేయడంతో బాబాయే మురళీధరుడనీ, బూటీవాడాయే సమాధిమందిరమనీ అర్థాన్ని గ్రహించాలి. వారి విచిత్రజీవితం లోతును కనుక్కోవడం సాధ్యం కాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరం సమాధి అవడంతో బాపూసాహెబు బూటీ అమిత ధన్యుడు, అదృష్టశాలి.
ముప్పైతొమ్మిదవ అధ్యాయము సంపూర్ణం