శ్రీసాయిసచ్చరిత్రము పద్దెనిమిది - పందొమ్మిదవ అధ్యాయాలు - 2

 

 

శ్రీసాయిసచ్చరిత్రము


పద్దెనిమిది - పందొమ్మిదవ అధ్యాయాలు

 

 

 

 

19వ అధ్యాయం చివర హేమాడ్ పంతు కొన్ని ఇతర విషయాలను చేప్పి ఉన్నారు. అవి ఈ క్రింద పొందు పరిచాము.
మన ప్రవర్తన గూర్చి బాబా ఉపదేశము :
ఈ దిగువన చెప్పిన బాబా పలుకులు సాధారణమైనవి అయినప్పటికీ అమూల్యాలు. వాటిని మనస్సులో వుంచుకుని అలాగే చేస్తే అవి మనకు మేలు చేస్తాయి. "ఏదైనా సంబంధం వుండనిదే ఒకరు ఇంకొకరి దగ్గరికి వెళ్ళరు. ఎవరైనా అలాంటి జంతువుగాని నీ దగ్గరికి వచ్చినప్పుడు నిర్దాక్షిణ్యంగా దాన్ని తరిమివేయకు. దాన్ని సాదరంగా చోడు. దాహం కలవారికి నీరిస్తే, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినట్లయితే, బట్టలు లేనివారికి బట్టిలిచ్చినట్లయితే, నీ ఇంటి వసారా యితరులు కూర్చోడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించినట్లయితే నిశ్చయంగా భగవంతుడు అమితంగా ప్రీతి చెందుతాడు. ఎవరైనా ధన సహాయం కోరి నీ దగ్గరికి వచ్చినట్లైతే, నీకు ఇవ్వటం యిష్టం లేకపోయినా నీవు ఇవ్వనవసరం లేదు. కాని వాడిపై కుక్కలా మొరగొద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినా, నీవు కఠినంగా జవాబు ఇవ్వకు. అలాంటి వాణ్ణి నీవు ఎల్లప్పుడూ ఒర్చుకొంటే నిశ్చయంగా నీకు సంతోషం కలుగుతుంది. ప్రపంచం తలక్రిందులైనప్పటికీ నీవు చలించకు. నీవు ఉన్న చోటనే స్థైర్యంగా నిలబడి, నెమ్మదిగా నీ ముందు జరుగుతున్నా నాటకాన్ని చూస్తూ ఉండు. నీకు నాకు మధ్యగల గోడను నిర్మూలించు. అప్పుడు మనమిద్దరం కలిసే మార్గం ఏర్పడుతుంది. నాకు నీకు భేదము ఉన్నదన్నదే భక్తుని గురువుకు దూరంగా వుంచుతుంది. దానిని నశింపచేయనిదే మనకు ఐక్యత కలగదు. 'అల్లా మాలిక్!' భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనల్ని కాపాడే వారు కాదు. భగవంతుని మార్గం అసామాన్యం, అత్యంత విలువైనది, కనుక్కోవటం వీలుకానిది. వారి యిచ్చానుసారమే మనం నడుస్తాము. మన కోరికలను వారి నెరవేరుస్తారు. మనకు దారి చూపెడతారు. ఋణానుబంధంతో మనమందరమూ కలిశాము. ఒకరికొకరు తోడ్పడి, ప్రేమించి సుఖంగాను, సంతోషంగానూ ఉందుము గాక. ఎవరయితే తమ జీవితపరమావధిని పొందుతారో వారు అమరులై సుఖంగా ఉండెదరు. తక్కినవారందరూ పేరుకే ఊపిరి సలిపే వరకు మాత్రమే బ్రతుకుతారు.
సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట :

 

 

 


సాయిబాబా సద్విచారాలను ఎలా ప్రోత్సహిస్తూ ఉండేవారో తెలిసుకోవడం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. భక్తిప్రేమలతో వారికి సర్వస్వ శరణాగతి చేసినట్లయితే వారు నీకు ఎలా పదేపదే సహాయ పడతారో తెలుస్తుంది. ప్రక్కపై నుండి లేవగానే నీకు ఏమయినా మంచి ఆలోచన కలిగితే, దాన్ని తరువాత పగలంతా వృద్ధి చేసినట్లయితే నీ మేథాశక్తి వృద్ధి పొందుతుంది. నీ మనస్సు శాంతి పొందుతుంది. హేమాడ్ పంతు దీనికోసం ప్రయత్నించదలిచారు. ఒక బుధవారం రాత్రి పడుకునేటప్పుడు ఇలా అనుకున్నారు. రేపు గురువారము, శుభదినం. షిరిడీ పవిత్రమైన స్థలం కాబట్టి రేపటి రోజు అంతా రామనామస్మరణతోనే కాలం గడుపుతాను అని నిశ్చయించుకొని పడుకున్నారు. ఆ మరుసటి రోజు లేవగానే, రామనామం ప్రయత్నం లేకుండా జ్ఞాపకానికి వచ్చింది. అతడు అత్యంత సంతోషించాడు. కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత బాబాను చూడటానికి పూవ్వులు తీసుకుని వెళ్ళారు. దీక్షిత్ వాడా విడిచి బూటీవాడా దాటుతుండగా ఒక చక్కని పాత వినబడింది. ఔరంగాబాదు నుంచి వచ్చినతను ఒకతను మసీదులో బాబా ముందు పాడుతున్నాడు. అది ఏకనాథ్ మహారాజ్ రచించిన 'గురుకృపాంజన పాయో మీరే భాయి' అనేది. గురువు కృప అనే అంజనము లభించింది. దాని మూలంగా తన కళ్ళు తెరవబడ్డాయనీ, దాంతో తాను శ్రీరాముని లోపల, బయట నిద్రావస్థలోను, జాగృతావస్థాలోను, స్వప్నావస్థలోను అన్ని చోట్లా చూశానని చెప్పే పాత అది. అనేక పాటలు ఉండగా బాబా భక్తుడైన ఔరంగాబాదు నివాసి ఈ పాత ఎలా పాడాడు? ఇది సందర్భానుసారంగా బాబా చేసిన ఎప్రాటు కాదా? హేమాడ్ పంతు ఆరోజంతా రామనామస్మరణతో కాలం గడపాలని తలచినవాడు కాబట్టి అతని మనోనిశ్చయంలో ధృడపరచడానికి బాబా ఈ పాటను పాడించి వుంటారు.
రామ నామ స్మరణ ఫలితం గురించి మహాత్ములందరిది ఒకే భావం. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారికి కష్టాలనుండి కాపాడుతుంది.
ఉపదేశములో వైవిధ్యము - నిందగూర్చి బోధ :

 

 

 

 


శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలం కాని, ప్రత్యేక సమయం కాని అక్కరలేదు. సందర్భావసరాలను బట్టి వారి ప్రబోధం నిరంతరమూ జరుగుతుండేది. ఒకనాకు ఒక భక్తుడు ఇంకొక భక్తుని గురించి పరోక్షంగా ఇతరుల ముందు నిందిస్తూ ఉన్నాడు. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే ఎంచుతున్నాడు. అత్యంత హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిపోయారు. అనవసరంగా ఇతరులను నిందించడంతో అసూయ, దురభిప్రాయం మొదలైనవి కలుగుతాయి. యోగులు నిందలను ఇంకొక విధంగా భావిస్తారు. మలినం పోగొట్టు కోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. సబ్బుతో మాలిన్యాన్ని కడగవచ్చు, పరులను నిందించువాడి మార్గం వేరు. ఇతరుల మలినాలను వాడు తన నాలుకతో శుభ్రపరుస్తాడు. ఒక విధంగా వాడు నిందించేవాడికి సేవ చేస్తున్నాడు. ఎలాగంటే, వాడి మలినాన్ని వీడు తన నాలుకతో శుభ్రపరుస్తున్నాడు కాబట్టి తిట్టిబడినవాడు, తిట్టినవాడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి! అలా పరనిందకు పాల్పడేవాడిని బాబా సరిదిద్దిన పధ్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధాన్ని బాబా సర్వజ్ఞుడు అవడంతో గ్రహించారు. మిట్టమధ్యాహ్నం బాబా లెండితోటకు వెళ్ళేటప్పుడు వాడు బాబాను దర్శించుకున్నాడు. బాబా వాడికొక పందిని చూపించి ఇలా అన్నారు : "చూడు! ఈ పండి ఆమెధ్యం ఎంత రుచిగా తింటుందో! నీ స్వభావం కూడా అలాంటిదే! ఎంత ఆనందంగా నీ సాటి సోదరున్ని తిడుతున్నావు. ఎంతో పుణ్యం చేయగా నీకీ మానవజన్మ లభించింది. ఇలా చేసినట్లయితే షిరిడీ దర్శనం నీకు తోడ్పడుతుందా?'' భక్తుడు నీతిని గ్రహించి వెంటనే వెళ్ళిపోయాడు.
ఈ విధంగా బాబా సమయం వచ్చినప్పుడల్లా ఉపదేశిస్తూ ఉండేవారు. ఈ ఉపదేశాలను మనస్సులో ఉంచుకొని పాటించినట్లయితే ఆత్మసాక్షాత్కారం దూరం కాదు. ఒక లోకోక్తి ఉండి "నా దేవుడుంటే నాకు మంచంపైన కూడా బువ్వ పెడతాడు' అది భోజనం, వస్తాలను గురించి చెప్పింది. ఎవరైనా దీన్ని అధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరుకున్నట్లయితే చెడిపోతారు. ఆత్మసాక్షాత్కారం కోసం సాధ్యమైనంత పాటుపడాలి. ఎంత కృషి చేస్తే అంత మేలు.
బాబా తాను సర్వాంతర్యామిని అని చెప్పేవారు. అన్నింటిలోను అంటే భూమి, గాలి, దేశం, ప్రపంచం, వెలుతురు, స్వర్గంలో వారు ఉన్నారు. ఆయన అనంతుడు. ఆ కనిపిస్తున్న మూడున్నర మూరల దేహమే బాబా అని అనుకున్నవారికి పాఠం చెప్పటానికే వారు ఈ రూపంలో అవతారమెత్తారు. బాబాకు సర్వస్యశరణాగతి చేసి, అహర్నిశలు వారినే ధ్యానించినట్లయితే, చక్కెర - తీపి, కెరటాలు - సముద్రం, కన్ను - కాంతి కలిసి ఉన్నట్లే శ్రీసాయితో తాదాత్మ్యతను పొందుతారు. ఎవరయితే చావుపుట్టుకల నుండి తప్పించుకోడానికి ప్రయత్నిస్తారో వారు శాంతం స్థిరమైన మనస్సుతో ధార్మికజీవనాన్ని గడపాలి. ఇతరుల మనస్సు బాధించినట్లు చేస్తే మాట్లాడకూడదు. మేలు ఒనరించే పనులే చేస్తుండాలి. తన కర్వవ్యకర్మల ఆచరిస్తూ భగవంతునికి సర్వస్వశరణాగతి చేయాలి. వాడు దేనికీ భయపడవలసిన అవసరం లేదు. ఎవరయితే భగవంతుని పూరిగా నమ్ముతారో, వారి లీలలను విని, యితరులకు చెప్తారో, ఇతర విషయాలేమీ ఆలోచించరో వారు తప్పకుండా ఆత్మసాక్షాత్కారం పొందుతారు. అనేకమందికి బాబా తన నామాన్ని జ్ఞాపకంలో ఉంచుకొని శరణు కోరుకో అన్నారు. 'తానెవరు' అనేదాన్ని తెల్సుకోవాలనే వారికి శ్రవణంలో మననం చేయమని సలహా యిచ్చేవారు. కొందరికి భగవంనామాన్ని జ్ఞాపకం ఉంచుకోమనేవారు.కొందరికి తమ లీలలు వినటం, కొందరికి తమ పాదపూజ, కొందరికి అధ్యాత్మ రామాయణం, జ్ఞానేశ్వరి మొదలైన గ్రంథాలు చదువుకోవడం, కొందరికి తమ పాదముల వద్ద కూర్చోమనటం కొందరిని ఖండోబా మందిరానికి పంపటం, కొందరికి విష్ణు సహస్రాజామాలు కొందరికి ఛాందోగ్యోపనిషత్తు, భగవద్గీత పారాయణం చేయమని విధిస్తూ ఉండేవారు. వారి ఉపదేశాలకు పరిమితి లేదు, అడ్డులేదు. కొందరికి స్వయంగా ఉపదేశం యిచ్చేవారు, కొందరికి స్వప్నంలో ఇచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నంలో కనిపించి ఛాతీపైన కూర్చుని అదుముతూ, ఇక ఎప్పుడూ త్రాగనని అతడు వాగ్దానం చేసిన తరువాత వదిలారు. కొందరికి స్వప్నంలో 'గురుబ్రహ్మాది' మంత్ర అర్థాలను బోధించారు. ఒకడు హఠయోగం చేస్తుండగా దాన్ని మానమని చెప్పారు. వారి మార్గాలను చెప్పడానికి అలవి కాదు. ప్రపంచ విషయాలలో తమ ఆచరణలె ఉదాహరణంగా బోధించేవారు. అలాంటి వాటిలో ఒకటి.
పనికి తగిన ప్రతిఫలము :

 

 

 

 


బాబా ఒకరోజు మిట్టమధ్యాహ్నం, రాధాకృష్ణమాయి యింటి సమీపానికి వచ్చి "నిచ్చెన తీసుకొని రా'' అన్నారు. ఒకడు వెళ్ళి దాన్ని తెచ్చి యింటికి చేరవేశాడు. బాబా వామనగోండ్ కర్ యింటి పైకప్పు ఎక్కి రాదాక్రిష్ణమాయి యింటి పైకప్పును దాటి, ఇంకొక ప్రక్కన దిగారు. బాబా అభిప్రాయం ఏమిటో ఎవరికీ తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరంతో ఉంది. ఆమె జ్వరం తొలగించడానికి బాబా ఇలా చేసి వుంటారేమో అనుకున్నారు. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చినవాడికి బాబా రెండు రూపాయలు ఇచ్చారు. ఎవడో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రాన వాడికి రెండు రూపాయలు ఎలా యివ్వాలి అని బాబాను ప్రశ్నించారు. ఒకరి కష్టం యింకొకరు ఉంచుకోరాదు. కష్టపడేవాడి కూలి సరిగ్గా దాతృత్వంతో, ధారాళంగా ఇవ్వాలి అని బాబా చెప్పారు. బాబా సలహా ప్రకారం ప్రవర్తించినట్లయితే కూలివాడు సరిగ్గా పని చేస్తాడు. పని చేయించేవాడు, పని చేసేవారు కూడా సుఖపడతారు. సమ్మెలకు తావుండదు. మధువు పెట్టేవాడికి, కష్టపడి కూలి చేసేవారికి మనఃస్ఫర్థలు ఉండవు.

18, 19 అధ్యాయాలు సంపూర్ణము