Read more!

శ్రీసాయిసచ్చరిత్రము పద్నాల్గవ అధ్యాయము

 

శ్రీసాయిసచ్చరిత్రము  పద్నాల్గవ అధ్యాయము

 

 

నాందేడ్ నివాసి అయిన రతన్ జీ వాడియా - మౌలాసాహెబు అనే యోగి - దక్షిణమీమాంస.

గత అధ్యాయంలో బాబాయోక్క వాక్కు, ఆశీర్వాదాలచే అనేకమైన అసాధ్య రోగాలు ఎలా నాయమయ్యాయో వర్ణించాను. ఈ అధ్యాయములో రతన్ జీ వాడియా అనే వారిని బాబా ఆశీర్వదించి సంతానము ఎలా కలగజేశారో వర్ణిస్తాను.
ఈ యోగీశ్వరుని జీవితము లోపలా వెలుపలా కూడా సహజంగా అత్యంత మధురంగా ఉంటుంది. వారు నడిచినా, భుజించినా, మాట్లాడినా ఏ పని చేసినా అన్నీ మధురంగా ఉంటాయి. వారి జీవితము మూర్తీభవించిన ఆనందము. శ్రీసాయి తమ భక్తులు జ్ఞాపకం ఉంచుకునే నిమిత్తం వారిని చెప్పారు. భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపంలో బోధించారు. క్రమంగా అవి అసలైన మతానికి మార్గాన్ని చూపిస్తుంది. ప్రపంచంలోని ప్రజలందరూ హాయిగా ఉండాలని బాబా ఉద్దేశ్యము. కాని వారు జాగ్రత్తగా ఉండి జీవితాశయం అంటే ఆత్మసాక్షాత్కారం సంపాధించాలని వారి ఉద్దేశం. గతజన్మల పుణ్యం కొద్దీ మనకు మానవజన్మ లభించింది. కాబట్టి దాని సహాయంతో భక్తిని అవలంభించి దానివల్ల జన్మరాహిత్యం పొందాలి. కనుక మనం ఎప్పుడూ బద్ధకించరాదు, ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశాయాన్ని, దాని ముఖ్యోద్దేశం అయిన మోక్షాన్ని సంపాదించు కోవాలి. ప్రతినిత్యం సాయిలీలలు వింటే, నీవు శ్రీసాయిని చూడగలవు. నీ మనస్సులొ వారిని రాత్రింబవళ్ళు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఈ ప్రకారంగా శ్రీసయిని అవగాహన చేసుకొంటే నీ మనస్సులోని చంచలత్వం అంతా పోతుంది. ఇలాగే కొనసాగితే చివరికి శుద్ధ చైతన్యంలో కలిసిపోతావు.

నాందేడు పట్టణ నివాసి అయిన రతన్ జీ :

 

 

ఇక ఈ అధ్యాయంలో ముఖ్య కథను ప్రారంభిస్తాను. నైజాం యిలాకాలోని నాందేడులొ పార్సీ వర్తకుడు ఒకడు ఉండేవాడు. అతని పేరు రతన్ జీ షాపుర్జీ వాడియా. అతడు చాలా ధనాన్ని ఆర్జించాడు. పొలాలు, తోటలు సంపాదించాడు. పశువులు, బండ్లు, గుఱ్ఱాలు మొదలైన ఐశ్వర్యంతో తులతూగుతూ ఉండేవాడు. బయటకు చూడడానికి చాలా సంతృప్తిగా, సంతోషంతో కనిపించేవాడు. కాని లోపల వాస్తవంగా అలా ఉండేవాడు కాదు. ఈ లోకంలోని పూర్తి సుఖంగా ఉన్నవారు ఒక్కరు కూడా లేరు. ధనికుడైన రతన్ జీ కూడా ఏదో చింతతో ఉండేవాడు. అతడు ఔదార్యం కలవాడు. దానధర్మాలు చేసేవాడు, బీదలకి అన్నదానం, వస్త్రదానం చేస్తుండేవాడు. అందరికీ అన్ని విధాలా సహాయం చేస్తుండేవాడు. చూసిన వారందరూ "అతడు మంచివాడు, సంతోషంగా ఉన్నా''డని అనుకొనేవారు. కాని రతన్ జీకి చాలా కాలంవరకూ సంతానం లేకపోవటంతో నిరుత్సాహంగా ఉండేవాడు. భక్తి లేని హరికథలా, వరుసలేని సంగీతంలా, జంధ్యం లేని బ్రాహ్మణునిలా, ప్రపంచజ్ఞానం లేని శాస్త్రవేత్తలా, పశ్చాత్తాపం లేని యాత్రలా, కంఠాభరణం లేని అలంకారంలా రతన్ జీ జీవితం పుత్రసంతానం లేక నిష్ప్రయోజంలా, కళావిహీనంగా ఉండేవాడు.

 

 

రతన్ జీ తనలోతాను ఇలా అనుకున్నాడు "భగవంతుడు ఎప్పుడయినా సంతృప్తి చెంది పుత్రసంతానం కలుగజేయడా?'' మనస్సులోపల ఈ చింతతో అతడు ఆహారంలో రుచి కోల్పోయాడు. రాత్రింబవళ్ళు తనకు పుత్రసంతానం కలుగుతుందా లేదా అనే ఆతృతతో ఉండేవాడు. దాసగణు మహారాజుపట్ల గోప్పగౌరవం కలిగి ఉండేవాడు. ఒకరోజు దాసగణు మహారాజ్ ని కలిసి, ఆయనతో తన మనస్సులోని కోరికని చెప్పాడు. దాసగణు అతనికి షిరిడీకి వెళ్ళమని సలహా యిచ్చాడు. బాబాను దర్శించుకో అని చెప్పాడు. బాబా ఆశీర్వాదం పొందు అని చెప్పాడు. సంతానం కోసం వేడుకో అని చెప్పాడు. రతన్ జీ దీనికి సమ్మతించాడు. షిరిడీకి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. కొన్ని రోజుల తరువాత షిరిడీకి వెళ్ళాడు. బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా పాదాలమీద పడ్డాడు. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి, దాన్ని బాబా మెడలో వేసి, ఒక గంపతో పళ్ళను బాబాకి సమర్పించాడు. మిక్కిలి వినయవిధేయలతో బాబా దగ్గర కూర్చుని ఇలా ప్రార్థించాడు :

 

 

"కష్టదశలో ఉన్నవారు అనేకమంది నీ దర్శనానికి వస్తే వారిని వెంటనే రక్షించి కాపాడుతావు. ఈ సంగతి విని నీ పాదాలను ఆశ్రయించాను. కనుక దయ వుంచి నాకు ఆశాభంగము కలగా చేయకండి'' బాబాకు 5 రూపాయల దక్షిణ ఇవ్వాలని రతన్ జీ తన మనస్సులో తలచుకున్నాడు. బాబా అతన్ని 5 రూపాయలు దక్షిణ కోరి, అతడు ఆ పైకాన్ని ఇచ్చేలోపల, తనకు రూ, 3-14-0 ఇంతకు పూర్వమే అందాయని, కాబట్టి మిగిలిన రూ. 1-2-0 మాత్రమే ఇవ్వమని అడిగారు. ఇది విని రతన్ జీ అత్యంత ఆశ్చర్యపోయాడు. బాబా చెప్పిన మాటలను రతన్ జీ గ్రహించలేక పోయారు. కాని బాబా పాదాల దగ్గర కూర్చుని మిగతా దక్షిణ యిచ్చాడు. తాను వచ్చిన పని అంతా బాబాకు విన్నవించి, తనకు పుత్రసంతానం కలుగజేయమని వేడుకున్నాడు. బాబా మనస్సు కరిగింది. "దిగులు పడకు! నీ కీడురోజులు ముగిసాయి. అల్లా నీ మనస్సులోని కోరిక నెరవేరుస్తాడు'' అని చెప్పారు.

 

 

బాబా దగ్గర సెలవు తీసుకుని రతన్ జీ నాందేడుకి వచ్చాడు. దాసగణుకు షిరిడీలో జరిగిన వృత్తాతం అంతా తెలిపాడు. అంతా సవ్యంగా జరిగిందని, బాబా దర్శనం, వారి ఆశీర్వాదం, ప్రసాదము లభించాయని, ఒక్కటి మాత్రమే తనకు బోధపడలేదనే సంగతి ఉందని చెప్పాడు. తమకు అంతకుముందే రూ. 3-14-0 ముట్టాయని బాబా చెప్పిన మాటలకు అర్థం ఏమిటని దాసగణుని అడిగాడు. "ఇంతకు ముందు నేనెప్పుడూ షిరిడీకి వెళ్ళలేదే! నా వల్ల బాబాకు రూ. 3-14-0 ఎలా ముట్టాయి?'' అది దాసగణుకి కూడా ఒక చిక్కు సమస్యగా తోచింది. దాన్ని గురించి కొంతసేపు ఆలోచించాడు. కొంతకాలం అయిన తరువాత అతనికే దాని వివరమంతా తట్టింది. మౌలాసాహెబు అనే మహాత్ముని రతన్ జీ అంతకుముందు సత్కరించిన విషయం జ్ఞాపకం వచ్చింది. నాందేడులో మౌలాసాహెబు గురించి తెలియనివారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్ జీ షిరిడీకి వెళ్ళడానికి నిశ్చయించుకోగానే ఈ మౌలాసాహెబు రతన్ జీ ఇంటికి వచ్చారు. ఆరోజు ఖర్చు సరిగ్గా రూ. 3-14-0 అవటం చూచి అందరూ ఆశ్చర్యపోయారు. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టమయింది. వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరంలో అయితే ఏమి జరుగుతున్నదో వారికి తెలిసిపోయేది. లేకపోతే మౌలాసాహెబుకి యిచ్చిన రూం 3-14-0 సంతగి బాబాకి ఎలా తెలియగలదు? వారిద్దరూ ఒక్కటే అని గ్రహించారు.

 

 

దాసగణు చెప్పిన సమాధానంతో రతన్ జీ సంతృప్తి చెందాడు. అతనికి బాబా పట్ల స్థిరమైన నమ్మకం కలిగింది. భక్తి హెచ్చింది. కొద్దికాలం తరువాత అతనికి పుత్రసంతానం కలిగింది. ఆ దంపతుల ఆనందానికి అంతులేకపోయింది. కొన్నాళ్ళకు వారికి 12మంది సంతానం కలిగారు. కాని నలుగురు మాత్రమే బ్రతికారు. ఈ అధ్యాయం చివరన హరివినాయక సాఠే అనే వాడు తన మొదటి భార్య కాలం చేసిన తరువాత, రెండవ వివాహం చేసుకుంటే పుత్రసంతానం కలుగుతుందని బాబా ఆశీర్వదించిన కథ ఉంది. అలాగే రెండవ భార్య వచ్చిన తరువాత వారికి ఇద్దరు కుమార్తెలు కలిగారు. అతడు నిరుత్సాహం చెందాడు. కాని బాబా మాటలు ఎప్పటికీ అసత్యాలు కానేకావు. మూడవసారి అతనికి కొడుకు పుట్టాడు. ఇలా బాబా వాక్యం నిజమైంది. అప్పుడు అతడు అమితంగా సంతృప్తి చెందాడు.

దక్షిణ మీమాంస :

 

 

 

దక్షిణ గురించి క్లుప్తంగా చెప్పి ఈ అధ్యాయం ముగిస్తాను. బాబా తమను చూడడానికి వెళ్ళినవారి దగ్గరనుండి దక్షిణ పుచ్చుకోవటం అందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీరు అయితే, వారికి దేనిలో కూడా అభిమానం లేకపోతే, వారు దక్షిణ ఎందుకు అడగాలి?వారు ధనాన్ని ఎందుకు కాంక్షించాలి అని ఎవరైనా అడగవచ్చు. దీనికి పూర్తి సమాధానం ఇది : మొట్టమొదట బాబా ఏమీ పుచ్చుకునేవారు కాదు. కాల్చిన అగ్గిపుల్లను జాగ్రత్త పెట్టుకొని జేబులో వేసుకునేవారు. భక్తులను కాని, తదితరులను కాని బాబా ఏమీ అడిగేవారు కారు. ఎవరైనా ఒక కాని గాని రెండు కానీలుగాని యిస్తే వారితో నూనె, పొగాకు కొనేవారు. బీడీగాని, చిలుముగాని పీల్చేవారు. రిక్త హస్తాలతో యోగులను చూడరాదని కొందరు ఒకటిగాని రెండుగాని పైసలను బాబా ముందు పెట్టేవారు. ఒక్క కాని ఇస్తే బాబా జేబులో వుంచుకునేవారు. అర్థణా అయితే తిరిగి యిచ్చేవారు. బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేకమంది బాబా దర్శనానికై గుంపులు గుంపులుగా రాసాగారు. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుతుండేవారు.

 

 

"దేవుని పూజలో బంగారు నాణెం లేనిదే ఆ పూజ పూర్తికాదు'' అని వేదం చెప్పుతున్నది. దేవిని పూజలో నాణెం అవసరమైతో యోగుల పూజలో మాత్రం ఎందుకు ఉండకూడదు? శాస్త్రాలలో కూడా ఏమని చెప్పబడిందో వినండి. భగవంతుని, రాజును, యోగిని, గురువుని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళకూడదు. నాణెం కాని డబ్బుకాని సమర్పించాలి. ఈ విషయం గురించి ఉపనిషత్తులు ఏమని ఘోషిస్తున్నాయో చూద్దాం. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు 'ద'అనే అక్షరాన్ని బోధించాడు. ఈ అక్షరం వల్ల దేవతలు 'దమము' అవలంభించాలని గ్రహించారు. (అంటే ఆత్మను స్వాధీనంలో ఉంచుకోవడం). మానవులు ఈ అక్షరాన్ని 'దానము'గా గ్రహించారు. రాక్షసులు దీన్ని 'దయ' అని గ్రహించారు. దీన్ని బట్టి మానవులు దానం చేయాలని నియమం ఏర్పడింది. తైత్తిరీయోపనిషత్తు దానము మొదలైన సుగుణాలు అభ్యసించాలి అని చెప్పుతుంది. దానము గట్టి విశ్వాసంతోను, ధారాళంగానూ, అనుకువతోనూ, భయంతోనూ, కనికరంతోనూ చేయాలి. భక్తులకు దానం గురించి బోధించడానికి, ధనంపట్ల వారికి గల అభిమానాన్ని పోగొట్టడానికి వారి మనస్సులను శుభ్రపరచడానికి బాబా దక్షిణ అడుగుతుండేవారు.

 

 

కాని ఇందులో ఒక విశేషం ఉంది. బాబా తాము పుచ్చుకున్న దానికి వందరెట్లు తిరిగి యివ్వవలసి వస్తుండేది. ఇలాగే అనేకమందికి జరిగింది. దీనికి ఒక ఉదాహరణం. గణపతిరావు బోడస్ అనే ప్రముఖ నటుడు, తన మరాఠీ జీవితచరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుతుండటంతో ధనం ఉంచుకునే సంచి తీసి బాబా ముందు కుమ్మరించానని, దీని ఫలితంగా ఆనాటినుండి తన జీవితంలో ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉండేదని వ్రాశారు. ఎప్పుడూ కావలసినంత ధనాన్ని గణపతిరావు బోడస్ కు దొరుకుతూ ఉండేది. బాబా 'దక్షిణ' అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కరలేదు అనే అర్థం కూడా చాలా సంఘటనల వల్ల తెలియవస్తూ ఉంది. దీనికి

రెండు ఉదాహరణాలు :

 

 

 

(1) బాబా 15 రూపాయలు దక్షిణ యివ్వమని ప్రొఫెసర్ జి.జి. నార్కేని అడగగా, అతను తన వద్ద దమ్మిడీ అయినా లేదు అని చెప్పాడు. దానికి బాబా యిలా అన్నారు "నీ దగ్గర ధనము లేదని నాకు తెలుసు. కాని నీవు యోగావాసిష్ఠము చదువుతున్నావు కదా? దాని నుంచి నాకు దక్షిణ యివ్వు'' దక్షిణ అంటే ఇక్కడ గ్రంథమునుండి నేర్చుకొన్న విషయాలను జాగ్రత్తగా హృదయంలో దాచుకోమని అర్థము. (2) ఇంకొకసారి, తర్ ఖడ్ భార్యను 6 రూపాయలు దక్షిణ యివ్వమని బాబా అడిగారు. తన దగ్గర పైకం లేకపోవటంతో ఆమె చిన్నబోయింది. అప్పుడు అక్కడే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థాన్ని చెప్పాడు. తన ఆరుగురు శత్రువులను (కామక్రోధ లోభాదులను) తమకి పూర్తిగా సమర్పించాలని బాబా భావమని అతడు తన భార్యకు వివరించాడు. దానికి బాబా పూర్తిగా సమ్మతించారు.

 

 

బాబా దక్షిణ రూపంలో కావలసినంత ధనం వసూలు చేసినప్పటికీ దాన్ని అంతా వారు ఆనాడే పంచిపెడుతూ ఉండేవారు. ఆ తరువాతి రోజు ఉదయానికి బాబా మామూలు పేద ఫకీరు అవుతుండేవారు. 10సంవత్సరాల కాలంలో వేలకొద్దీ రూపాయలను దక్షిణ రూపంలో పుచ్చుకున్నా, మహాసమాధి చెందేనాటికి ఏడు రూపాయలు మాత్రమే వారి దగ్గర మిగిలాయి. ఎప్పుడూ బాబా దక్షిణ పుచ్చుకోవటం భక్తులకు దానాన్ని, త్యాగాన్ని నేర్పటం కోసమే.

దక్షిణ గురించి యింకొకరి వర్ణన :

 

 

 

బి.వి.దేవ్ ఠాణావాసి : ఉద్యోగ విరమణ చెందినా మామలతదారు; బాబా భక్తుడు. దక్షిణ గురించి ఆయన 'శ్రీ సాయిలీలా మాసిక్' పత్రికలో ఇలా వ్రాసి ఉన్నారు :
బాబా అందరినీ దక్షిణ అడిగేవారు కారు. అడగకుండా ఇచ్చి నప్పుడు ఒకొక్కప్పుడు పుచ్చుకునేవారు; ఇంకొకప్పుడు నిరాకరించేవారు. బాబా కొంతమంది భక్తుల దగ్గర దక్షిణ అడుగుతుండేవారు. బాబా అడిగితేనే యిద్దాం అనుకునేవారి దగ్గర బాబా దక్షిణ పుచ్చుకునేవారు కాదు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా దక్షిణ ఇచ్చినప్పుడు, బాబా దాన్ని ముట్టుకునేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందు ఉంచితే దాన్ని తిరిగి తీసుకొని పొమ్మనేవారు. బాబా అడిగే దక్షిణ పెద్ద మొత్తాలు కానీ చిన్న మొత్తాలు కానీ భక్తుల కోరికలు, భావం, వసతిని బట్టి ఉండేది. స్త్రీలు, పిల్లల దగ్గర కూడా బాబా దక్షిణ అడుగుతుండేవారు. వారు అందరూ ధనికులును కానీ, అందరు బీదలను కానీ దక్షిణ అడగలేదు.

 

 

తాము అడిగినా దక్షిణ యివ్వని వారిపై బాబా కోపం చూపలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపిస్తే, తెచ్చిన వారు దాన్ని మరిచిపోయినప్పుడు, వారికి దాన్ని గురించి జ్ఞాపకానికి తెచ్చి, ఆ దక్షిణని పుచ్చుకునేవారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి యిచ్చి పూజలో పెట్టుకోండి అనేవారు. దీనివలన భక్తునికి అత్యంత ప్రయోజనంగా అనిపించు చుండేది. అనుకున్నదానికంటే ఎక్కువ యిచ్చినప్పుడు, కావలసిన దానినే ఉంచుకొని మిగతాది తిరిగి ఇచ్చేస్తుండేవారు. ఒక్కొక్కప్పుడు భక్తులు అనుకున్న దానికంటే ఎక్కువ యివ్వమనేవారు. లేకపోతే ఎవరివద్ద అయినా బదులు పుచ్చుకొని కానీ, అడిగి తీసుకొని కానీ ఇవ్వమనేవారు. కొందరి దగ్గర నుంచి ఒకేరోజు మూడు నాలుగు సార్లు దక్షిణ కోరుతూ ఉండేవారు.

 

 

దక్షిణ రూపంగా వసూలయిన పైకంలో నుండి బాబా కొంచెం మాత్రమే చిలుముకు, దునికోసం ఖర్చు పెడుతుండేవారు. మిగతాది అంతా బీదలకు దానం చేస్తుండేవారు. 50 రూపాయలు మొదలు ఒక రూపాయి వరకూ ఒక్కొక్కరికి నిత్యం దానం చేస్తుండేవారు. షిరిడీ సంస్థానంలో ఉన్న వులువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాతో భక్తులు తెచ్చి యిచ్చారు. ఎవరయినా విలువయిన వస్తువులు తెచ్చినప్పుడు బాబా వారిని తిట్టేవారు. నానాసాహెబు చాందోర్కరుతో తన ఆస్తి అంతా ఒక కౌపీయము, ఒక విడిగుడ్డ, ఒక కఫనీ, ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనీ అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమయిన విలువైన వస్తువులు తెస్తున్నారని అంటుండేవారు. మన పారమార్థికానికి ఆటంకాలు రెండు ఉన్నాయి : 

 

 

మొదటిది స్త్రీ, రెండవది ధనం. షిరిడీలో బాబా ఈ రెండు సంస్థలను నియమించి ఉన్నారు. అందులో ఒకటి దక్షిణ, రెండవది రాదాక్రిష్ణమాయి. తన భక్తులు ఈ రెండింటినీ ఎంతవరకు విడిచి పెట్టారో పరీక్షించడం కోసం బాబా వీటిని నియమించారు. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని "బడికి'' (రాదాక్రిష్ణమాయి గృహానికి) పంపిస్తుండేవారు. ఈ రెండు పరీక్షలకి తట్టుకున్నప్పుడు అంటే కనకంలో కాని, కాంతలో కానీ అభిమానం పోయిందని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రం అవడం దృఢపడుతూ ఉండేది.
భగవద్గీతలోను, ఉపనిషత్తులలోను, పవిత్రమైన స్థలంలో పవిత్రులకు ఇచ్చిన దానము, ఆ దాత యొక్క యోగాక్షేమాలకు అధికంగా తోడ్పతాయని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్రస్థలం ఏది? అందులో ఉన్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు?

పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం

 

 

దీపావళి స్పెషల్ పేజ్ ని తిలకించండి ....