మాటలతో పూలబాటలు పరిచే బాబా

 

మాటలతో పూలబాటలు పరిచే బాబా

మాటతీరే మనిషి జీవితాన్ని నిలుపుతుంది. చక్కని మాటలతో జీవితాన్ని పూలబాట చేసుకోవచ్చు. ఈటెల్లాంటి మాటలతో ఒక్కోసారి జీవితం ముళ్లబాట అవుతుంది. మాటలతో పోయే దానిని ఘర్షణల వరకు తీసుకెళ్లటం మనిషి నైజం. మసీదులో ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు బాబా చక్కని చతురతతో మాటల యుద్ధానికి ముక్తాయింపు పలికేవారు.

మసీదులో బాబాకు సేవలు చేసే విషయంలో కొందరు భక్తులు పోటీ పడేవారు. వారు నిత్యం బాబా వెంటే ఉండేవారు. బాబా సేవ ముక్తికి దారి అని నమ్మిన నిజమైన భక్తాగ్రేసరులు వారంతా. అందుకే బాబాకు సేవ చేసే అవకాశం వస్తే మనసుపెట్టి ఆ పని చేసేవారు. వారికి భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు. కానీ సాయినాథుడు ఎలా ఉంటాడో తెలుసు. వారి దృష్టిలో బాబానే భగవంతుడు. ఇలా బాబాకు సేవ చేసే విషయంలో భక్తుల మధ్య నెలకొనే పోటీ ఒక్కోసారి మాటల యుద్ధానికి, పంతానికి దారితీసేది. బాబా మధ్యవర్తిత్వంతో అవి సమసిపోయేవి.

అణ్ణాచించణీకర్ బాబాకు గొప్ప భక్తుడు. అతని మరో పేరు దామోదర్ ఘనశ్యామ్. మనిషి మొరటు. మనసు సున్నితం. అతనికి కల్లాకపటం తెలియవు. మనసులో ఏముందో బయటికి అదే మాట్లాడేవాడు. ఎవరినీ లెక్కపెట్టే తత్త్వం కాదు. పట్టింపు, పంతం, జగడం....ఏదైనా సరే అక్కడికక్కడే తేలిపోవాల్సిందే. నాన్చేవాడు కాదు. టక్కరి వేషాలు తెలియవు. చక్కని భక్తి ఒక్కటే అతనికి తెలిసింది. బాబాకు అణ్ణాలోని భక్తి కంటే అతనిలోనే మొండితనమే ఎక్కువగా నచ్చేది. అందుకే అతనికి ఎక్కువగా దగ్గరికి చేరదీసే వారు.

మసీదులో వేణుబాయి కౌజల్గి అనే ముసలి వితంతువు కూడా ఉండేది. ఆమెను బాబా "అమ్మా" అని పిలిచేవాడు. ఇతర భక్తులు మాత్రం ఆమెను మావిశీబాయి అనే పిలిచేవారు. మావిశీబాయిది స్వచ్ఛమైన హృదయం. ఒకరోజు వీరిద్దరూ బాబాసేవలో నిమగ్నమయ్యారు. అణ్ణా బాబాకు కాళ్లు వత్తుతున్నాడు. మావిశీబాయి బాబా  నడుమును మర్ధనం చేస్తున్నప్పుడు ఒకసారి అణ్ణాముఖం ఆమె మీదకంటూ వెళ్ళింది.

"బాబా! ఈ అణ్ణా చూడు. నన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నాడు. వయసు పెరిగినా బుద్ధి పెరగలేదు" అంది మావిశీబాయి. అణ్ణా గురించి చెప్పేదేముంది. ఆమె మాటలు వింటూనే కస్సున లేచాడు. "నేనా బుద్ధి లేని వాన్ని ? నేనా నిన్ను ముద్దు పెట్టుకోవాలనుకున్నది? నా జోలికొచ్చావో..." అంటూ కయ్యానికి కాలు దువ్వాడు. ముసలి వాళ్ళిద్దరి గొడవని చూసి మసీదులో ఉన్న వారందరూ నవ్వుకోసాగారు. బాబా కూడా వారితో శృతి కలిపారు. అప్పుడు బాబా ఇలా అన్నారు. "అన్నా ! ఎందుకంత గోల చేస్తున్నావ్ ? ఆమె నీ తల్లివంటిది. తల్లిని కొడుకు ముద్దుపెట్టుకుంటే తప్పేముంది ?"

బాబా మాటలతో అక్కడ శాంతి అవతరించింది. సాయి సంప్రదాయమే వేరు. సమయం, సందర్భానికి తగ్గట్టు బాబా ఉపదేశాలు ఉండేవి. వాటిలో సునిశిత హాస్యం పొంగి పోర్లుతుండేది. ఇదంతా చూసే వారికి నవ్వులాటగా ఉన్నా అందులో చక్కని నీతి ఉండేది. అది ఎవరి హృదయాలను తాకాలో వారి హృదయాలను సూటిగా తాకేది. ఒక విషయాన్ని వివరిస్తున్నప్పుడు బాబా చూపే హావభావాలు చూడచక్కగా ఉండేవి. అందుకే బాబా ఆవాసమైన మసీదు నిత్య చైతన్య స్రవంతి.