మౌనమే భూషణమై...శాంతియే అలంకారమై....

 

మౌనమే భూషణమై...శాంతియే అలంకారమై....

మహాత్ముల జీవితాల్లోనూ మార్పు అనేది ఉంటుంది. ఏదో సందర్భంలో అది మెరుపులా మెరుస్తుంది. అదే వారి జీవితాలను ధాన్యం చేసే మలుపు తిప్పుతుంది. బాబా జీవితంలోనూ అలాంటి మెరుపును మనం చూడవచ్చు.

షిర్డీ కుస్తీ పోటీలకు పుట్టినిల్లు. షిర్డీ చేరిన కొత్తలో బాబా స్వయంగా కుస్తీలు పట్టేవారు. పలువురితో పోటీకి దిగేవారు. తాను దగ్గరుండి కొన్నిసార్లు కుస్తీ పోటీలు నిర్వహించే వారు. గెలిచిన వారికి బహుమతులను ఇచ్చి ప్రోత్సహించేవారు. యవ్వనంలో ఉండగా బాబా వేషధారణ కూడా వస్తాది మాదిరిగా ఉండేది. పహిల్వాన్ లా కనిపించేవారు.

ఒకసారి మొహియిద్దీన్ తంబోళి అనే వస్తాదుకు, బాబాకు మధ్య ఏదో విషయంలో మాట పట్టింపు వచ్చింది. ఇద్దరూ కుస్తీకి దిగారు. ఆ పందెంలో బాబా ఓడిపోయారు. ఆ ఓటమి బాబాలో "విరక్తి" కలిగించింది. అన్నిటిపై ఆసక్తిని పోగొట్టింది. అప్పటి నుంచి బాబా వేషధారణ మారింది.

ఫకీర్లు ధరించే లంగోటీని బిగించుకుని, పొడవాటి చొక్కా (కఫ్నీ) తొడుక్కునే వారు. నెత్తిన గుడ్డ చుట్టుకునే వారు. చింకి గుడ్డలతోనే సంతుష్టి చెందేవారు. చిరిగిన గోనె ముక్కపైనే కూర్చునేవారు. రాజ్యభోగం కంటే దరిద్రమే మేలనేవారు. పేదలకు, సాధనాపరులకు భగవంతుడు స్నేహితుడనే వారు. ఆత్మానుసందానంలో మునిగిపోయేవారు. మౌనమే భూషణమై, శాంతికి పెన్నితిలా కనిపించేవారు. ఎవరైనా ఏదైనా అడిగినా మితంగా సమాధానం చెప్పేవారు.

రాత్రి వేళ్లలో మసీదులోనే పడుకునేవారు. పొగ పీల్చుకునే చిలుం గొట్టం, కొంత పొగాకు, రేకు డబ్బా (తంబిరేలు), కఫ్నీ, తలగుడ్డ, చేతిలో శతకా (చిన్న చేతికర్ర) ఇవే బాబా ఆస్తులు. తలపై గుడ్డను చుట్టి దాని అంచులను చక్కగా జడ మాదిరిగా మెలిపెట్టి ముడివేసే వారు. దానిని ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడేలా వేసుకునే వారు. రోజుల తరబడి దుస్తులు మార్చేవారు కాదు.

మసీదులో ఈశాన్య భాగంలో ధునికి ఎదురుగా ఒక కోయ్యపై చేతిని ఆనించుకుని దక్షిణాభిముఖంగా కూర్చునే వారు. దునిలో అహంకారం, కోరికల్ని ఆహుతి చేసేవారు. భక్తుల పాపాల్ని, కర్మల్ని కూడా కట్టెలుగా మర్చి కాల్చేసే వారు. నిత్యం "అల్లా మాలిక్" (భగవంతుడే యజమాని) అని అంటుండేవారు అప్పుడప్పుడు బాబా కాళ్ళకు గజ్జెలు కట్టి మిక్కిలి సొగసుగా నాట్యంచేసే వారు. భక్తిపూర్వకంగా రాగయుక్తంగా పాటలు పాడేవారు. బాబా నేత్ర, కర, పాద, కదలికలు లయబద్ధంగా ఉండేవి. మధ్యాహ్న వేల నాలుగైదు ఇళ్లకు భిక్షకు వెళ్ళేవారు. బాబాకు ఆహార పదార్థాలపై రుచి ఉండేది కాదు. అన్ని పదార్థాలను కలుపుకుని తినేవారు.తినగా మిగిలింది మసీదులోని ఓ పాత్రలో ఉంచేవారు.

ఇదే సాయి జీవన విధానం. ఎవరు నేర్చుకోవాల్సింది వారు దీని నుంచి నేరుచుకోవచ్చు. జీవితం నూతి లాంటిది. కోరికలు, సుఖాల వంటి విషవలయంతో అది నిండి ఉంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిపుచ్చుకునే వారు సాధన అనే నిచ్చెన సాయంతో పైకి చేరాలునుకుంటారు. అయితే అజ్ఞానమనే "మాయ" లో పడిన వారిని కోరికలు కాళ్లుపట్టి కిందికి లాగేస్తుంటాయి. వాటిని జయించిన వారు సాయిపథాన్ని చేరుకుంటారు.