వినాయకుని కొడుకుగా పొందినవాడు – మోర్యా గోసావి
వినాయకుని కొడుకుగా పొందినవాడు – మోర్యా గోసావి
విష్ణుభక్తులనగానే ఆళ్వార్లు ఎలా గుర్తుకు వస్తారో, శివభక్తులనగానే నయనార్లు ఎలా గుర్తుకువస్తారో... బొజ్జ గణపయ్యను కొలిచినవారెవరయ్యా అంటే ‘మోర్యా గోసావి’ అనే పేరు స్ఫురిస్తుంది. గణపతే ఈ సృష్టికి అధిపతి అని నమ్మే గాణపత్య శాఖను ఈయన ప్రచారంలోకి తీసుకువచ్చాడు. మహారాష్ట్ర అంతటా గణపతిని విస్తృతంగా ఆరాధించడానికి ఈ మోర్యా గోసావి కృషే కారణం!
మోర్యా గోసావి ఎక్కడివారో తెలియదు. కానీ చాలామంది అభిప్రాయం ప్రకారం ఆయన కర్ణాటకకు చెందినవాడు. మోర్యా తల్లిదండ్రులకి చాలాకాలం పాటు సంతానం లేకపోయిందట. దాంతో వారు మోరేగావ్‌కి వెళ్లి అక్కడి మోరేశ్వరునికి తమ గోడుని చెప్పుకొన్నారు. కొన్నాళ్లకి ఆ వినాయకుని అనుగ్రహంతో వారికి ఒక బిడ్డ కలిగాడు. అతనికి మోరేశ్వరుని మీదుగా మోర్యా అని పేరు పెట్టుకొని పెంచుకోసాగారు.
మోర్యా మనసు బాల్యం నుంచే వినాయకుని మీద లగ్నమై ఉండేది. ఆయన ఆధ్యాత్మిక తృష్ణను చల్లార్చేందుకా అన్నట్లు ‘నయనభారతి గోసావి’ అనే మహాత్ముని పరిచయం జరిగింది. నయనభారతి శిష్యరికంలో మోర్యా, మోర్యా గోసావిగా మారాడు. గణపతిని మరింత తీవ్రంగా ఆరాధించసాగాడు. ఒకానొక సందర్భంలో 42 రోజుల పాటు నిరాహారంగా ఆయన గణపతి గురించి తపస్సు చేసినట్లు చెబుతారు.
క్రమంగా మోర్యా తన ఇష్టదైవం ఉన్న మోరేగావ్‌లోనే స్థిరపడిపోయాడు. ఆయన తపశ్శక్తి విన్న భక్తులంతా తండోపతండాలుగా అక్కడికి చేరుకునేవారు. మోర్యా అనుగ్రహంతో ఎలాంటి సమస్య అయినా చిటికెలో తీరిపోయేవి. మోర్యా ఆశీర్వాదంతో గుడ్డివాడికి సైతం చూపు వచ్చేది. ఆనాటి మరాఠా నేత శివాజీ, ముగల్ సామ్రాజ్యాధిపతి హుమాయున్ సైతం మోర్యా సాయం పొందిన కథలు వినిపిస్తాయి. దాంతో మోర్యాకు భక్తుల తాకిడి ఎక్కువైపోయింది. అందుకని ఆయన మోరేగావ్‌కు ఓ 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న చించివాడకు చేరుకున్నారు.
చించివాడకు చేరుకున్న మోర్యాను అక్కడి ప్రజలు అక్కున చేర్చుకున్నారు. వారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ అప్పుడప్పుడూ మోరేగావ్‌కు వెళ్లి స్వామిని దర్శనం చేసుకుంటూ కాలాన్ని గడపసాగాడు. ఓసారి మోర్యా ఆలయానికి చేరుకునేసరికి సమయం మించిపోయింది. పూజారులు గుడిని మూసివేసి వెళ్లిపోయారు. దాంతో మోర్యా స్వామి దర్శనం కోసం తపించిపోయాడట.
ఆయన ఆర్తిని గమనించిన స్వామి, స్వయంగా తానే మోర్యా ముందుకు వచ్చి దర్శనం ఇచ్చాడని చెబుతారు. ఇలాంటి ఆటంకాలు ఏవీ కలగకుండా నిత్యం మోర్యా తనను పూజించుకునేందుకు స్వామి, చించివాడలోనే వెలిశాడట. అలా వెలిసిన స్వామిని కొలుచుకుంటూ, ఆ విగ్రహం చుట్టూ ఓ ఆలయాన్ని నిర్మించాడు మోర్యా.
తనపట్ల మోర్యాకి ఉన్న అచంచల భక్తికి మెచ్చిన గణేశుడు ఆయనకు ఓ అరుదైన వరాన్ని అందించాడు. మోర్యా తర్వాత వచ్చే ఏడు తరాలవారిలో తన అంశ ఉంటుందని అనుగ్రహించాడు. అలా మోర్యా దంపతులకి చింతామణి అనే కొడుకు జన్మించాడు.
గణపతి అంశ కాబట్టి అంతా ఆ పిల్లవాడిని దేవ్ అని పిలిచేవారట. దేవ్ కాస్త పెరిగి పెద్దవాడైన తర్వాత, మోర్యా ఇక ఇహ సంసారం నుంచి తప్పుకోవాలని నిశ్చయించుకున్నాడు. తన అనునాయులకు చివరి సందేశాన్ని అందించి, 1561 మార్గశిర మాసంలో సజీవ సమాధిని పొందాడు. చించివాడలోని ఆ సమాధి ఇప్పటికీ భక్తుల కోరికలను తీరుస్తూ ఉంటుందని నమ్మకం. మోర్యా ఆ సమాధిలో ఇంకా జీవించే ఉన్నారని, ఆ సమాధి దగ్గరకు వెళ్లినవారికి ఆయన ఉనికి తెలుస్తూ ఉంటుందని అంటారు.
- నిర్జర.