హిమలింగేశ్వరుడు
హిమలింగేశ్వరుడు
దేశంలోని జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అమర్‌నాథ్ పర్వతంపై ఉన్న అమర్నాథ్ గుహలు హిందువులకు చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. మహాదేవుడికి అంకితమైన ఈ క్షేత్రం 5,000 సంవత్సరాలకు పైగా ఉన్న ఆలయం. ప్రధాన అమర్‌నాథ్ గుహ లోపల శివలింగం మాదిరిగా కనిపించే ఒక మంచు ఆకృతి ఉంటుంది. ఇది మే నుంచి ఆగస్టు వరకు వృద్ధి చెంది, ఆ తరువాత కరుగుతుంది. చంద్రుడి దశలతో పాటు పెరుగుతూ, తగ్గుతూ, వేసవి పండుగ సమయంలో అత్యధిక ఎత్తుకు చేరుకుంటుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ గుహలోనే శివుడు తన దైవిక సహాధర్మచారిణి అయిన పార్వతికి జీవిత రహస్యం, సనాతనం గురించి వివరించారు. మరో రెండు మంచు ఆకారాలు పార్వతి, గణపతివని నమ్ముతారు.
స్థల పురాణం
అమరనాథుడంటే జననమరణాలు లేని వాడు అని అర్ధం. ఒకనాడు పార్వతీదేవి ఈశ్వరుడితో "నాథా! నాకు మీరు కంఠంలో వేసుకునే పుర్రెలమాల గురించి వినాలని ఉంది'' అని అడిగింది. ఈశ్వరుడు "పార్వతీ ! నీవు జన్మించినప్పుడంతా నేను ఈ పుర్రెల మాలలో అదనంగా ఒక పుర్రెను చేర్చి ధరిస్తుంటాను'' అని బదులిచ్చాడు. పార్వతీ దేవి ''నాథా ! నేను తిరిగి తిరిగి జన్మిస్తుంటాను. నీవు మాత్రం అలగే శాశ్వతుడిగా ఉంటున్నావు ఇది ఎలా సాధ్యం?'' అని అడిగింది. ఈశ్వరుడు "పార్వతీ! ఇది పరమ రహస్యమైనది కనుక ప్రాణికోటి లేని ప్రదేశంలో నీకు చెప్పాలి'' అని చెప్పి ఎవరూ లేని నిర్జన ప్రదేశం కోసం వెతకి చివరకు ఈశ్వరుడు అమరనాథ్ గుహను ఎంచుకున్నాడు. పహల్ గాం వద్ద నందిని ఉండమని వదిలి పెట్టి, చందన్ వారి వద్ద చంద్రుడిని వదిలి వెళ్లాడు. షిషాంగ్ సరోవర తీరాన తన వద్ద ఉన్న పాములను వదిలి పెట్టాడు. మహాగుణ పర్వతం వద్ద తన కుమారుడైన గణేషుడిని వదిలాడు. తరువాత పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలను వాటి స్థానాలలో వదిలి పార్వతీదేవితో అమర్‌నాథ్ గుహలోపలికి వెళ్లాడు. తరువాత కాలాగ్నిని ప్రజ్వలింపజేసి అక్కడ ఉన్న మిగిలిన ప్రాణులను దూరంగా పంపాడు. ఇక తన అమరత్వ రహస్యం చెప్పడానికి ఉపక్రమించాడు. కాని పైన ఉన్న ఒక పావురాల జంట ఈ రహస్యం విని అవి కూడా అమరం అయ్యాయట...
వేరొక కథనం
పురాతన ఇతిహాసాలలో మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. కాశ్మీరు లోయలలో ఉన్న పెద్దసరస్సును కశ్యప మహర్షి అనేక నదులుగా ఉపనదులుగా ప్రవహింపజేశాడు. ఆ రోజులలో అక్కడకు వచ్చిన భృగుమహర్షి మొదటిసారిగా ఈ గుహను దర్శించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అతడి నుండి ఈ విషయం తెలుసుకున్న అనంతరం సాక్షాత్తు శివుడు నివసిస్తున్న ఈ గుహాలయం ప్రజల యాత్రాకేంద్రంగా మారింది. ప్రస్తుతకాలంలో ఈ గుహను ప్రజలు తెలుసుకోవడానికి కారణమైన కథనం ఒకటి ప్రచారంలో ఉంది. బూటా మాలిక్ అనే గొర్రెల కాపరికి ఒక రోజు ఒక సన్యాసి ఒక సంచి నిండా బొగ్గులను ఇచ్చాడు. బూటా మాలిక్ వాటిని తీసుకుని ఇంటికి వచ్చి చూడగా సన్యాసి ఇచ్చిన బొగ్గులు బంగారు నాణేలుగా మారాయి. బూటా మాలిక్ సన్యాసికి కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వెళ్ళి చూసే సమయానికి అతడికి అక్కడ సన్యాసి కనిపించ లేదు కాని అక్కడ ఒక మంచు లింగం కనిపించింది. ఇలా ఈ గుహాలయం తిరిగి కనిపెట్టబడి మంచు లింగం ఆకారంలో ఉన్న పరమశివుడు పురాణకాలం తరువాత ప్రస్తుతకాలంలో ప్రజలకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తున్నాడు.
ఈ గుహ, జమ్మూ కాశ్మీరు రాజధాని అయిన శ్రీనగర్‌కు సుమారు 141 కిలోమీటర్ల దూరంలో, 3,888 మీటర్ల ఎత్తులో ఉంది. భద్రతా కారణాలతో, కేంద్ర రిజర్వ్ పోలీసు దళం, భారత సైన్యం, భారత పారామిలిటరీ దళాలు ఈ ప్రాంతంలో తమ బలగాలను మెహరించి ఉంటాయి. పవిత్రమైన గుహలో మంచు శివలింగం హిందువులకు ఇది ఒక ప్రసిద్ధ తీర్థయాత్ర క్షేత్రం. జూలై-ఆగస్టులో శ్రావణి మేళ పండగ సమయంలో 45రోజుల్లో సుమారు 4 లక్షలమంది ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు. ఇది హిందువుల పుణ్యమాసమైన శ్రావణ మాసంలో ఉంటుంది.
శ్రీనగర్ నుంచి...
96 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గం పట్టణం నుండి భక్తులు నడుచుకుంటూ నాలుగు లేక ఐదు రోజులు ప్రయాణం చేసి ఈ 42 కిలోమీటర్ల తీర్ధయాత్రను చేపడతారు. ఈ ఆలయానికి మరో రెండు మార్గాలు ఉన్నాయి. శ్రీనగర్ నుంచి ఎక్కువ సంప్రదాయ, ఎక్కువ దూరమైన దారి, బల్తాల్ పట్టణం నుంచి తక్కువ దూరమైన దారులు ఉన్నాయి. కొందరు భక్తులు, ముఖ్యంగా వృద్దులు, గుర్రంపై కూర్చుని కూడా ఈ ప్రయాణాన్ని చేపడతారు. ఇప్పుడు డబ్బు ఉంటే చాలు హెలికాప్టర్‌లోనూ వెళ్లే అవకాశం ఉంది.
యాత్ర చేయండిలా...
జమ్ము నుండి పహల్ గాం చేరి అమరనాథ్ చేరే మార్గం ఒకటి. జమ్ము నుండి 315 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్ గాం చేరడానికి టాక్సీ లేక బస్సులలో చేరుకోవచ్చు. ఈ ఏర్పాటు కోసం రఘునాధన్ వీధిలో ఉన్న టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్, జమ్ము కాశ్మీర్ వద్దకు వెళ్లాలి. ఈ ఏర్పాటు చేసుకోవడానికి తెల్లవారు చాలా ఉదయాన మాత్రమే వెళ్లాలి. శ్రీనగర్‌కు 96 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్ గాం ఆకాశాన్ని అంటే కొండ చరియలు నదులు ఉపనదులు ప్రవహిస్తున్న సుందర ప్రదేశం. ఇక్కడ యాత్రికులు బసచేయడానికి వసతి గృహాలు లభ్యం అవుతాయి. పహల్ గాంకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాత్రికుల శిబిరంలో ప్రభుత్వేతర సంస్థలు యాత్రికులకు ఉచిత భోజన సదుపాయం కలిగిస్తుంటాయి. చంద్రవారి ఇది పహల్ గాం నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. పహల్ గాం నుండి చంద్రవారి వరకు మినీబస్సులు లభ్యం అవుతాయి. లిడ్డర్ నదీతీరం వెంట ఈ బస్సు మార్గం ఉంటుంది కనుక ఈ మార్గంలో పయనించే సమయంలో అతి సుందరమైన ప్రదేశాలాను చూసే అవకాశం లభిస్తుంది. దారి వెంట అక్కడక్కడా యాత్రికుల కొరకు ఆహారశాలలు ఉంటాయి.
శేషాంగ్ ఏడుపర్వతశిఖరాలు కలిగిన పర్వత ప్రాంతం. ఈ ఏడు శిఖరాలు ఆదిశేషుడి ఏడు పడగలకు గుర్తుగా భావించబడుతుంది. ఇది అమరనాథ్ యాత్రలో రెండవ రోజు మజిలీ. శేషాంగ్ గురించి ప్రేమ మరియు పగతోకూడిన పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ చలి మంటలు రగిలిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నహిమాలయాల ప్రశాంత వాతావరణం మనసుకు చాలా ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇక్కడ ఘనీభవించిన మంచు మధ్య ఉన్న శేషాంగ్ సరసులో ఒక సారి స్నానం ఆచరించినట్లయితే జీవితానికి సరికొత్త అర్ధం స్పురించిన అనుభూతి స్ఫురిస్తుంది. శేషాంగ్ నుండి యాత్రీకులు మహాగుణా మార్గంలో పయనించి సముద్రమట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉన్న పాంచ్ తర్ణి చేరుకుంటారు. సముద్రమట్టానికి 12,000 ఎత్తులో ఉన్న ఇక్కడి లోయలలో పచ్చిక మైదానాలు ఉన్నాయి. యాత్రీకులకు ఇక్కడ ఉన్ని వస్త్రాలు ధరించడం తప్పనిసరి. ఇక్కడ కొందరు యత్రీకులు ఆక్సిజన్ కొరతతో బాధపడుతుంటారు. కొంత మంది వాంతి వచ్చే అనుభూతికి లోను అవుతారు. ఎండు ఫలాలు, వగరు, తీపి పదార్ధాలు వంటి వాటిని తిని ఈ సమస్యలను అధిగమించాలి. ఏది ఏమైనా సమీపంలో ఉన్న వైద్యుని సంప్రదించడం ఉత్తమం.
మహాగుణ మార్గంలో అనేక ఉపనదులు, జలపాతాలు, సెలయేళ్లు పుష్పించిన మొక్కలు ఉండడం కారణంగా ఈ మార్గంలో పయనించడం మనోహరంగా ఉంటుంది. భైరవపర్వత పాదంలో ఉన్న పాంచ్ తర్ణి వద్ద పరమ శివుడి తల మీద నుండి ప్రవహిస్తున్న ఐదు నదులు ప్రవహిస్తుంటాయి. యాత్రీకులు పాంచ్ తర్ణి వద్ద మూడవరోజు మజిలీ చేస్తారు. పంచ్ తర్ణి నుండి అమరనాథ్ గుహలు చేరుకునే మార్గంలో యాత్రీకులు అమరావతీ పంచ్ తర్ణి సంగమప్రాంతాన్ని చూడవచ్చు. గుహాలయంలో ప్రవేశించే ముందు కొంతమంది యాత్రీకులు అమరావతీ నదిలో స్నానం చేస్తారు. యాత్రీకులు పరమశుడిని, పార్వతిని, గణేషుడిని దర్శించుకుని సాయంత్రానికి పంచ్ తర్ణి చేరుకోవచ్చు. యాత్రీకులు జమ్ము నుండి రహదారి మార్గంలో శ్రీనగర్ చేరుకుని అక్కడి నుండి సోనామార్గ్ ద్వారా బాల్ తల్ చేరుకుని అక్కడ నుండి అమరనాథ్ చేరుకోవచ్చు. ఇక్కడ నుండి 14 కిలోమీటర్ల కొండమార్గం నిటారుగా ఉంటుంది కనుక శరీర దారుఢ్యం ఉన్న వారు మాత్రమే ఈ మార్గంలో పయనించగలరు. ఇక్కడి నుండి యాత్రీకుల ప్రయాణానికి పోనీస్ లేక డోలీ (పాలకీలు) లభిస్తాయి. అమరనాథ్ చేరుకోవడానికి ఇది చాలా దగ్గరి మార్గం కనుక బాలా తల్ అమరనాథ్ యాత్రకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.
మార్గాలివి....
జమ్ము - పహల్ గాం- అమరనాథ్ :- జమ్ము-చందన్ వాలి- పిస్సుటాప్-సేషాంగ్- పాంచ్ పర్ణి- అమర్ నాథ్ మార్గంలో అమర్ నాథ్ యాత్ర చేయవచ్చు.
జమ్ము -బాల్ తళ్ :- జమ్ము- బాల్ తల్- దొమలి- బరరి- అమర్ నాథ్ మార్గంలో అమర్ నాథ్ యాత్ర చేయ వచ్చు.
హెలికాఫ్టర్ బుక్ చేసి అమర్ నాథ్ చేరుకోవచ్చు. వాయు మార్గంలో చంఢీగఢ్ నుండి జమ్ముకాశ్మీరు వరకు విమాన సర్వీసులు ఉన్నాయి.
జమ్ము-కాశ్మీర్ శీతల రాజధాని అయిన జమ్ము భారతీయ ప్రధాన నగరాలతో చక్కగా అనుసంధానించబడి ఉంటుంది కనుక రైలు మార్గంలో జమ్ముకు చేరుకుని అక్కడి నుండి అమర్ నాథ్ యాత్ర కొనసాగించ వచ్చు.
రహదారి మార్గంలో జమ్ము - కాశ్మిర్ చక్కగా భారతీయ ప్రధాన నగరాలతో చక్కగా అనుసంధానించబడి ఉంటుంది కనుక బస్సులు, మరియు కార్లలో ఇక్కడకు చేరుకుని అమర్ నాథ్ యాత్ర కొనసాగించ వచ్చు.
వసతులు పొందొచ్చు....
చందన్ వాలి, శేషాంగ్, పాంచ్ తర్ణిలలో ప్రభుత్వం చేత నడుపబడుతున్న డిపార్ట్ మెంటల్ స్టోర్స్‌లలో కావలసిన వంటకు కావలసిన సామాను లభ్యం అవుతుంది. అలాగే కట్టెలు గ్యాస్ కేనులు కూడా ఈ ఊరిలో దుకాణాలలో లభ్యం అవుతాయి. మార్గమధ్యంలో అనేక టీ స్టాల్స్ మరియు హోటల్స్ ఉన్నాయి కనుక అక్కడ టీ, కాఫీలతో పాటు అల్పాహారం వంటివి లభిస్తాయి. అయినప్పటికీ యాత్రీకులు తమ వెంట అత్యవసర సమయాలలో ఉపశమనం పొందడానికి తమతో టిన్ ఫొడ్స్, టాఫీలు, బిస్కెట్స్ తీసుకు వెళ్ళడం మంచిది. యాత్రీకులు శ్రీ అమర్ నాథ్ జి సయిన్ బోర్డ్ ఫర్ ది యాత్ర వద్ద నమోదు పత్రం తీసుకున్నట్లతే ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక్ లక్షరూపాయలు నగదు లభిస్తుంది. యాత్రా సమయంలో మార్గమధ్యంలో ఏకాంతమైన గుడిసెలు, గుడారాలు యాత్రీకులకు అద్దెకు లభిస్తాయి. యాత్రీకులు ఒక మాసానికి ముందు తమ పేరును నమోదు చేసుకున్నట్లయితే యాత్ర సులువుగా సౌకర్యంగా చేయడానికి వీలు అవుతుంది.