బ్రటిష్ అధికారి నిర్మించిన శివాలయం - బైజ్నాథ్

 

 

బ్రటిష్ అధికారి నిర్మించిన శివాలయం - బైజ్నాథ్

 

కులం, ప్రాంతం- ఇవన్నీ మనం ఏర్పరుచుకున్న పరిమితులు. కానీ భగవంతునికి ఇలాంటి పరిమితులు ఉండవు కదా! ఈ ప్రపంచంలో ఉన్న రూపాలన్నీ ఆయనవే! ఈ లోకంలోని మనుషులంతా ఆయన భక్తులే! అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఈ కథ.

 

అది 1879 సంవత్సరం. అవి బ్రటిష్వారు మన దేశాన్ని పాలిస్తున్న రోజులు. వారి సైన్యంలో కల్నల్ మార్టిన్ అనే ఉన్నతాధికారి ఉండేవాడు. ఇప్పటి మధ్యప్రదేశ్లోని ‘అగర్ మాల్వా’ అనే ప్రదేశంలో మార్టిన్ విధులు నిర్వహించేవాడు. మార్టిన్కు ఓసారి ఆఫ్ఘనిస్థాన్కు వెళ్లవలసిన పని పడింది. అక్కడి బ్రటిష్వారి మీద తిరుగుబాటు చేస్తున్న ఆఫ్ఘన్లను అణచివేయవలసిందిగా, ప్రభుత్వం ఆయన్ను ఆదేశించింది.

 

తన సైన్యంతో సహా ఆఫ్ఘనిస్తాన్ చేరుకున్న కల్నల్ మార్టిన్, అక్కడి సైనికులతో వీరోచితంగా పోరాడాడు. నిత్యం పోరులో ఎంతగా తలమునకలై ఉన్నా, అగర్ మాల్వాలో ఉన్న తన భార్యకు తన క్షేమ సమాచారాలు తెలియచేస్తూ తప్పకుండా ఉత్తరాలు రాసేవాడు. కొద్ది రోజులు గడిచేసరికి కల్నల్ భార్యకు ఉత్తరాలు రావడం ఆగిపోయాయి. అక్కడ తన భర్త ఎలాంటి ఆపదలో ఉన్నాడో, అసలు బతికున్నాడో లేదో తెలియని వేదనలో మార్టిన్ భార్య మునిగిపోయింది. ఒక రోజు లేడీ మార్టిన్ అగర్ మాల్వాలో తిరుగుతుండగా... ఓ శివాలయం నుంచి మంత్రాలు, శంఖనాదాలు వినిపించాయి. భర్త వియోగంలో ఉన్న ఆమెకి, ఆ పవిత్ర శబ్దాలు ఊరటని అందించాయి.

 

లేడీ మార్టిన్ స్థితిని గమనించిన ఆలయ పూజారులు ఆమె అంత దుఃఖంలో మునిగిపోయి ఉండటానికి కారణం ఏమిటా అని ఆరా తీశారు. దానికి ఆమె చెప్పిన సమాధానం విని, పదకొండు రోజుల పాటు ‘ఓం నమశ్శివాయ’ అనే మంత్రాన్ని కనుక జపిస్తే, మృత్యుంజయుడైన ఆ శివుడు ఆమె భర్తను కాపాడతాడని సూచించారు. అప్పటివరకూ నిరాశలో మునిగిపోయిన లేడీ మార్టిన్కు ఆ సూచన అమృతప్రాయంగా తోచింది.

 

 

లేడీ మార్టిన్ తనకు పూజారులు చెప్పినట్లుగానే శివుని ప్రార్థించసాగింది. సరిగ్గా పదకొండవ రోజున ఆమెకు తన భర్త నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ‘మా సైన్యాన్ని ఒక్కసారిగా పఠాన్లు చుట్టుముట్టారు. నలువైపులా వారి దిగ్బంధనంలో ఉన్న మేము ఇక చావే గతి అన్న నిశ్చయానికి వచ్చాము. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో కానీ... పులి చర్మం ధరించి, త్రిశూలం చేతపట్టిన ఒక భారతీయ యోగి మాకు అండగా నిలిచాడు. ఆయనను చూసిన వెంటనే శత్రువులు పరుగులు తీశారు. నేను మృత్యువుకి భయపడాల్సిన అవసరం లేదనీ, నా భార్య ప్రార్థనలను మన్నించి నన్ను రక్షించేందుకే అక్కడికి వచ్చాననీ.... ఆ యోగి నాతో చెప్పారు,’ అని ఉన్న ఆ ఉత్తరాన్ని చూసి లేడీ మార్టిన్ నోట మాట రాలేదు.

 

కల్నల్ మార్టిన్ యుద్ధభూమి నుంచి క్షేమంగా తిరిగిరాగానే ఇక్కడ జరిగిన విషయమంతా ఆయనకు చెప్పింది లేడీ మార్టిన్. అప్పటి నుంచి ఆ దంపతులు ఇద్దరూ శివభక్తులుగా మారిపోయారు. ఆ శివాలయాన్ని అభివృద్ధి చేయాలని తలపెట్టారు. బైజ్నాథ్ మహాదేవ్ పేరుతో ఉన్న ఆ శివాలయం నిజానికి ఎప్పుడో 13 శతాబ్దం నాటిదని చరిత్రకారులు చెబుతారు. కానీ స్థానికులు మాత్రం అది వేల ఏళ్లనాటిదని నమ్ముతారు. అలాంటి విశిష్టమైన దేవాలయాన్ని మార్టిన్ దంపతులు పునరుద్ధరించాలని అనుకున్నారు. అందుకోసం అప్పట్లోనే 15 వేల రూపాయలని ఆలయానికి విరాళంగా అందించారు. ఆ విరాళానికి స్థానికుల సహకారం తోడై మధ్యప్రదేశ్లోనే అద్భుతమైన శివాలయాలలో ఒకటిగా అగర్ మాల్వా బైజ్నాథ్ ఆలయం నిలిచింది. మార్టిన్ దంపతుల కథ నిజమేనని నిరూపించేందుకు ఇప్పటికీ అక్కడి ఆలయంలో వారి విరాళం గురించిన శిలాఫలకం కనిపిస్తుంది.

- నిర్జర.