మహాశివుడు ఎలా ఆవిర్భవించాడు ?
మహాశివుడు ఎలా ఆవిర్భవించాడు?
మహాశివుని మాయల గురించి తెలుసుకోవడం విష్ణుమూర్తి, ఇంద్రాది దేవతలకే సాధ్యం కాలేదు, ఇక సామాన్యుల తరమేమౌతుంది? శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని సామెతే ఉంది. కనుక శివుని ఆనతి లేకుండా ఎవరూ అడుగైనా ముందుకు కదపలేరు. శివుని కరుణాకటాక్షాలు మనపై ఉంటే ఏమైనా సాధించగలం. శివుని దయే గనుక లేకుంటే అంతా అగమ్యగోచరం అవుతుంది. శివుడు అనుగ్రహిస్తే వరం, ఆగ్రహిస్తే కలవరం. కనుక మహేశ్వరుని ధ్యానంలో గడుపుతూ జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి.
ఇంతకీ మహాశివుడు ఎలా ఆవిర్భవించాడో ఒకసారి గుర్తుచేసుకుందాం. సృష్టికి పూర్వం అంతా జలమయం. నీళ్ళే తప్ప నేల కనిపించేది కాదు. ఆ నీళ్ళలోంచి ఒక అద్భుతమైన తేజస్సు ఉద్భవించింది. ఆ దివ్య తేజస్సు ఒక మహత్తర ఆకృతిని సంతరించుకుంది. ఆ రూపమే మహాశివుడు.
సృష్టిలో ఇతర జీవజాలం కంటే మున్ముందుగా ఉదయించిన మహాశివుడు విశ్వ సృష్టి చేసేందుకు ఉద్యుక్తుడయ్యాడు. శివునికి విశ్వాన్ని సృజించాలి అనే ఆలోచన రావడం ఆలస్యం, ఆయన ఎడమభాగం నుండి ఆదిశక్తి ప్రభవించింది. ఆదిశక్తి ప్రకృతి స్వరూపిణి, జగన్మాత.
మహాశివునిలో ఎంత అద్వితీయమైన తేజోకాంతులు ప్రస్ఫుటిస్తాయో ఆది పరాశక్తిలోనూ అంతటి ఉజ్వల కాంతులు ప్రతిఫలించాయి. పరమేశ్వరుని మాదిరిగానే జగన్మాతకు కూడా మూడు కళ్ళు ఉన్నాయి. రెండు వేల చేతులతో దిగ్భ్రాంతి కలిగించేలా ఉంది. ఆదిశక్తి అవసరమైతే ప్రళయరూపం ధరించగలదు. భక్తులపై కారుణ్యం కురిపించాలి అనుకుంటే తక్షణం కరుణామూర్తిగా అవతరించగలదు.
సకల చరాచర సృష్టికీ మహేశ్వరుడు, జగన్మాతలే కారకులు. అందుకే శివపార్వతులను ఆది దంపతులు అంటారు.
మహాశివుని వామపక్షం నుండి ఆదిపరాశక్తి ఉద్భవించగానే ఇద్దరూ కలిసి విహారానికి వెళ్ళారు. ఆదిదంపతులు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. అప్పుడు శివ సంకల్పంతో మొదట విష్ణుమూర్తి, మహాలక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు, సరస్వతి ఉద్భవించారు. క్రమంగా సృష్టి ఆవిర్భవించింది.