పరమేశ్వరుని ప్రదోష నృత్యం గురించి మీకు తెలుసా...

 

పరమేశ్వరుని ప్రదోష నృత్యం గురించి మీకు తెలుసా...?

 

 

ఒకసారి "నటరాజ" భగవానుడైన శివుని తాండవ నృత్యంలో పాల్గొనడానికి రజతగిరి కైలాసపర్వతం మీద సమస్త దేవగణం హాజరయ్యింది. జగజ్జనని ఆదిశక్తి గౌరీమాత అక్కడి దివ్యరత్న సింహాసనం మీద ఆసీనురాలై తన అధ్యక్షతన శివతాండవాన్ని ప్రారంభింపజేయడానికి ఉపస్థితురాలై ఉంది. నారదమహర్షి కూడా ఆ నృత్య కార్యక్రమంలో పాల్గొనడానికి లోకాలన్నీ పరిభ్రమిస్తూ అక్కడికి చేరుకున్నాడు. కొద్ది క్షణాల్లోనే శివభగవానుడు భక్తి పారవశ్యంతో తాండవ నృత్యం ఆరంభించాడు. సమస్త దేవగణం, ఇంకా దేవతా స్త్రీలు కూడా ఆ నృత్యంలో సహాయకులై వివిధ వాద్యాలను వాయించసాగారు.

 

 

పద్మాసనస్థయై సరస్వతీ మాత వీణను, విష్ణుభగవానుడు మృదంగాన్ని, దేవేంద్రుడు మురళిని బ్రహ్మదేవుడు తాళాన్ని చేపట్టి వాద్య సహకారం అందిస్తూండగా లక్ష్మీదేవి గీతాలాపన చేయసాగింది. ఇంకా యక్ష, గంధర్వ, కిన్నెర, ఉరగ, పన్నగ, సిద్ధ, అప్సర, విద్యాధరాది అన్య దేవతాగణం భావ 'విహ్వలురై' శివభగవానునికి నలుదిక్కులా నిలబడి ఆయన్ని స్తుతించడంలో నిమగ్నమయ్యారు.

 

 

శివభగవానుడు ఆ ప్రదోష కాలంలో సమస్త దివ్య శక్తుల సమక్షంలో అత్యంతాద్భత లోక విస్మయకర తాండవ నృత్యాన్ని ప్రదర్శించారు. ఆయన ముద్రాలాఘవం చరణ, కటి, భుజ, గ్రీవాల కదలికతో ఉన్మత్తమైనప్పటికి సునిశ్చిమై సాగిన విలోలహిల్లోల ప్రాభవం అందరి మనస్సులను, నేత్రాలను-రెంటినీ ఒక్కసారిగా అచంచలంగా నిలబెట్టింది. అందరూ భూతభావనుడై శంకరభగవానుని నృత్యాన్ని వేనోళ్ళ కీర్తించారు. ఆదిపరాశక్తి భగవతి (మహాకాళి) ఆయనపై అత్యంత ప్రసన్నురాలైంది. ఆమె శివునితో (మహాకాలునితో) - "భగవాన్! నేటి - నీ నృత్యాన్ని చూశాక నాకు చాలా ఆనందం కలిగింది. నేను నీకు ఏదైనా వరాన్ని ప్రసాదించాలనుకుంటున్నాను." అని పలికింది.

 

 

ఆమె వచనాలను విని లోకహితంకరుడైన శంకరుడు నారద ప్రేరితుడై - " దేవీ! ఈ తాండవ నృత్యాన్ని చూసి నీవు, దేవగణం, ఇంకా అన్యదివ్యయోనిజన్య జీవులూ' విహ్వలురై పొందిన ఆనందం భూలోక జీవులకు లేకుండా పోతోంది. మన భక్తులు కూడా ఈ సుఖాన్ని పొందలేకపోతున్నారు. కాబట్టి పృథ్వీ వాసులకు కూడా ఈ నృత్యం దర్శనభాగ్యం కలిగేలా అనుగ్రహించు, అయితే నేను మాత్రం తాండవం నుండి తప్పుకుని 'లాస్యం' చేయాలని అనుకొంటున్నాను". అని విన్నవించాడు. శివభగవానుని విన్నపాన్ని మన్నించి తక్షణమే ఆదిశక్తి, భువనేశ్వరి మహాకాళీమాత సమస్త దేవతలను విభిన్న రూపాలలో భూమండలం మీద అవతరించాల్సిందిగా ఆదేశించింది.

 

 

స్వయంగా ఆమె శ్యామసుందరుడు శ్రీకృష్ణ భగవానునిగా అవతరించి బృందావన ధామానికి విచ్చేసింది శివభగవానుడు (మహాకాలుడు) మధురానగరిలో రాధగా అవతారమెత్తాడు. ఇక్కడ వారిరువురూ కలిసి దేవతలకు సైతం దుర్లభమైన అలౌకిక రాస నృత్యాన్ని ఆరంభించారు. శివభగవానుని "నటరాజ" నామం (బిరుదు) ఇక్కడ శ్రీకృష్ణ భగవానునికి లభించింది. భూమండలంలోని చరాచర జీవులన్నీ ఈ రాస నృత్యాన్ని తిలకించి పులకించిపోయాయి. పరమేశ్వరేచ్ఛ నెరవేరింది.