షిర్డీ సాయిబాబా గురుస్థానం (Shirdi Sai Baba Gurusthan)
షిర్డీ సాయిబాబా గురుస్థానం
(Shirdi Sai Baba Gurusthan)
బాబా జీవితంలో గురుస్థానం ఓ మహత్త్వపూర్వకమైన స్థానాన్ని ఆక్రమిస్తోంది. హేమాద్రి వంత్ చెప్పిన అంశాలనుబట్టి సాయిబాబా, తన జీవితంలో ముగ్గుర్ని గురువులుగా భావించారు. బాబా తనను తాను సామాన్యుడినని చెప్పుకుంటూ ఆ ముగ్గురు మహనీయులకి గురుస్థానం ఇచ్చారు. ఆ సంగతి వివరంగా తెలుసుకుందాం.
సాయిబాబా గురువులుగా భావించిన ముగ్గురిలో ఒకరు కాశీకి చెందిన కబీరుదాసు. రెండవవారు హైదరాబాద్ కు చెందిన గోపాలరావు దేశముఖ్. మూడవవారు రహటాకు చెందిన జహావార్ అలీ బోలానాథ్.
ఖండోబా ఆలయం నుంచి గురుస్థానమైన వేపచెట్టు కిందకు వచ్చి సమాధి స్థితిలో గడిపిన బాబా పగలు ఎవరితోనూ మాట్లాడకుండా రాత్రుళ్లు నిర్భయంగా సంచరిస్తూ ఉండేవారు. ఈ వేపచెట్టు కింద బాబా కూర్చున్నవైపు కొమ్మ ఆకులు తియ్యగా ఉండేవని చెబుతారు. ఇక్కడ ఉన్న పాదుకలకు చాలా ప్రాముఖ్యం ఉంది.
షిర్డీ సాయిబాబా కథలు, చిత్రాల్లో పూర్వపు గురుస్థానం, ఇప్పటి గురుస్థానములను చూడవచ్చు.
పవిత్రమైన పాదుకలను ఉపాసనీబాబా 1912వ సంవత్సరంలో బాబా అనుమతితో శ్రావణ పౌర్ణమినాడు ప్రతిష్టించారు. అంతకుముందు సాయిబాబా వాటిని తన నుదుటికి తాకించుకుని, ''ఇవి హరిచరణాలు... వీటిని దర్శనం చేసుకోవడం చాలా మంచిది... ముఖ్యంగా గురు, శుక్రవారాల్లో సాయంత్రం పూట ధూపం చేసినవారికి హరి అనుగ్రహం లభిస్తుంది'' - అని చెప్పారు.
ఇక్కడున్న శివలింగాన్ని 1912 వ సంవత్సరంలో ప్రతిష్టించారు, శివభక్తుడైన మేఘశ్యామ్ కు బాబా శివుడి రూపంలో దర్శనమిచ్చారు. పూనా నుంచి వచ్చిన ఓ భక్తుడు బాబాకు శివలింగాన్ని సమర్పించాడు. ఆ లింగాన్ని బాబా మేఘశ్యామ్ కు ఇచ్చారు, ఆ లింగాన్ని మేఘశ్యామ్ ఇక్కడ ప్రతిష్టించాడు. గురుస్థానంలో బాబా ఎక్కువగా ధ్యానంతో గడిపేవారు. మసీదులో కూర్చోకముందు మొదట ఇక్కడే ధుని వెలిగించారు. భక్తులు ఎన్ని సార్లు అడిగినా బాబా తమ జన్మవృత్తాంతం, పుట్టుకల గురించి చెప్పేవారు కాదు.
Gurusthan, Shirdi Saibaba Padukalu, Shirdi Saibaba Gurusthan, Saibaba and Kashi Kabeerdas, Saibaba and Gopalarao Deshmukh, Saibaba and Rahata Jahavar Ali Bolnath