|
వాణి వీణగానం కన్నా మధురమైనది ఏది
వాణి వీణగానం కన్నా మధురమైనది ఏది
దీనికి బదులు తెలియాలంటే, ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.. ఒకసారి లలితా దేవి ముక్కోటి దేవతలను సమావేశ పరిచిందట. ఆ సమయంలో సంగీతానికి అధి దేవత అయిన సరస్వతి దేవిని వీణాగానం చేయమని కోరిందట. ముక్కోటి దేవతలు సమావేశమైన చోట వీణ వాయించడాన్ని అరుదైన అవకాశంగా భావించింది వాగ్దేవి. అమృత తుల్యమైన వీణాగానాన్ని వినిపించింది. దేవతలంతా ఆ సంగీతానికి తన్మయులయినారు. సరస్వతీ దేవి తన వీణగాణం గురించి లలితాంబిక ఏం చెబుతుందో అని వేచి చూడసాగింది. అప్పుడు లలితాదేవి ప్రసన్నవదనంతో 'సుష్టు' (బాగుంది) అని పలికిందట. ఆ మాట వినగానే శారదాదేవి, తలదించుకుని, తన వీణను గుడ్డతో కప్పివేసి కూర్చుందట. అది గమనించిన బ్రహ్మ, ఆమెను ఏమయిందని అడిగాడు. దానికి " స్వామీ, నేను ఎన్నో రాగాలు నా వీణాగానంతో వినిపించాను. కానీ, అవన్నీ ఆమె పలికిన ఒక్క పదం ముందు ఏ మాత్రం చాలవు అనిపించింది. అంతటి మాధుర్యం ఆమె కంఠంలో వున్నది" అని పలికిందట సరస్వతి. సాక్షాత్తు సంగీతానికి అధి దేవత అయిన సరస్వతీ దేవి తన వీణా గానం కన్నా లలితాంబిక పలుకులు సుమధురంగా వుంటాయని చెప్పటం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది లలిత సహస్రనామాల్లో ఒకటైన 'నిజసంలాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ' అనే నామానికున్న అర్థం..