జీవితాన్ని మార్చే సఫల ఏకాదశి.. పూజ, నియమాలు ఇవే..!
జీవితాన్ని మార్చే సఫల ఏకాదశి.. పూజ, నియమాలు ఇవే..!
ఏకాదశి చాలా పవిత్రమైన తిథి. ఇది విష్ణు భగవానుడికి చాలా ప్రీతికరమైనది. ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం, శ్రీహరిని ధ్యానించడం, ఆరాధన అందరూ చేస్తారు. అయితే ప్రతి ఏకాదశి తిథికి ఒక ప్రత్యేక పేరు, ప్రత్యేక ఫలితం ఉంటుంది. డిసెంబర్ నెలలో రెండు ఏకాదశులు వచ్చాయి. ఈ రెండు ఏకాదశులలో శుక్ల పక్ష ఏకాదశి పేరు మోక్షద ఏకాదశి, ఇక రెండవది సఫల ఏకాదశి. మోక్షద ఏకాదశి రోజు తులసిని విష్ణుమూర్తిని కలిపి పూజిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందని, అలాగే అధోగతి పొందిన పితృదేవతలు ఎవరైనా ఉంటే ఆ కుటుంబ సబ్యులు మోక్షద ఏకాదశిని పాటించడం వల్ల ఆ పితృదేవతలు ఊర్థ్వ లోకాలకు వెళతారని చెబుతారు. ఇక రెండవదైన సఫల ఏకాదశి కూడా చాలా శక్తివంతమైనది. డిసెంబర్ 15వ తేదీన సఫల ఏకాదశి తిథి వస్తోంది. ఈ రోజు ఏం చేయాలి? ఈ ఏకాదశి ని పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ? తెలుసుకుంటే..
సఫల ఏకాదశి..
మార్గశిర మాసంలో వచ్చే కృష్ణ పక్ష ఏకాదశి తిథిని సఫల ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం, విష్ణువు ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా సఫల ఏకాదశి వల్ల ఇంట్లో పిల్లల విషయంలో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు.
చిన్న పిల్లలు లేదా పెద్ద వారైనా సరే.. సరైన నడవడిక లేక, పెద్దల మాట వినకుండా, మొండిగా ఉంటూ, జీవితం పట్ల నిర్లక్ష్యంగా ఉండేవారు ఉంటారు. అలాంటి వారి కోసం సఫల ఏకాదశి ఉపవాసం, విష్ణువు ఆరాధన చేయడం వల్ల చాలా గొప్ప ఫలితం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్ఝులకు ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. విద్యార్థులు సరైన నడవడికలోకి వచ్చి వారు విద్యలో రాణిస్తారు. వృద్ధి చెందుతారని పండితులు చెబుతున్నారు.
సఫల ఏకాదశి రోజు విష్ణువుకు ప్రత్యేకంగా కొన్ని సమర్పించడం వల్ల మరిన్ని అద్బుతమైన ఫలితాలు ఉంటాయి. పంచాంగం ప్రకారం సఫల ఏకాదశి డిసెంబర్ 15వ తేదీన వచ్చింది. ఈ రోజు విష్ణువు ఆరాధనలో పసుపు దుస్తులు ధరించడం, పసుపు వస్త్రం మీద విష్ణువును ఆసీనుడిని చేయడం, గంధం, తులసి మాల సమర్పించడం చేయాలి. విష్ణువుకు తులసి అంటే చాలా ప్రీతి. అందుకే సఫల ఏకాదశి రోజు తులసితో పూజించాలి. స్వచ్చమైన నెయ్యితో దీపం వెలిగించాలి. పంచామృతాలు, వడపప్పు, బెల్లం పానకం, అరటిపండ్లు మొదలైనవి నైవేద్యంగా సమర్పించవచ్చు.
సఫల ఏకాదశి రోజు పేదలకు పసుపు రంగు వస్త్రాలు, ఆహారం దానం చేయడం, పశువులు, పక్షులకు ఆహారం పెట్టడం, దాహం తీర్చడం వంటివి చేయడం వల్ల చాలా గొప్ప ఫలితం ఉంటుంది. అలాగే ఇది మార్గశిర మాసం కనుక తప్పకుండా విష్ణుసహస్ర నామ పారాయణ చేయాలి. ఇది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.
*రూపశ్రీ.