‘సాలగ్రామం’ ఎన్ని రకాలో మీకు తెలుసా?
‘సాలగ్రామం’ ఎన్ని రకాలో మీకు తెలుసా?
'సాలగ్రామం' సాక్షత్ విష్ణుస్వరూపం. దీనిని అభిషేకించిన పుణ్యజలాన్ని ప్రోక్షించుకుంటే సర్వపాపాలు నశిస్తాయి. సర్వరోగాలు నశించి, సకల సంపదలు లభిస్తాయి. సర్వశుభాలు కలిగి మోక్షప్రాప్తి కలుగుతుందని ఋషివాక్కు. విష్ణుభగవానుడు ‘సాలగ్రామం’ అనే రాయి రుపాన్ని ధరించడం వెనుక అనేక కధలున్నాయి. అందులో ముఖ్యమైనది బృంద కథ. కాలనేమికి జన్మించిన బృంద జలంధరుడు అనే రాక్షసుడిని పెళ్ళాడుతుంది. ఆమె మహాపతివ్రత. కానీ, జలంధరుడు తన రాక్షస ప్రవృత్తిలో అందరిని పీడిస్తుంటాడు. అతను ఎంతవరకు వెళ్ళాడంటే, ఒకానొకప్పుడు శివుని రూపంలో వెళ్ళి పార్వతీదేవిని మోసగించబోతాడు. అందుకు కోపగించిన పార్వతీ దేవి విష్ణువును సమీపించి బృంద పాతివ్రత్యాన్ని భంగపరచమని కోరుతుంది. బృంద పాతివ్రత్య భంగం సకల లోకాలకు అవసరంకూడా. ఎందుకంటే ఆమెకి ఆ భంగం కలిగితేనే జలంధరుని అంతం జరుగుతుంది. సకల లోకాల క్షేమం కోరి విష్ణుభగవానుడు జలంధరుని రూపాన్ని ధరించి బృందని మోసగిస్తాడు. అనంతరం తన నిజరూపాన్ని ప్రకటిస్తాడు. జరిగిన మోసానికి నివ్వెరపోయిన బృంద విష్ణుమూర్తిని శిలగా మారతావని శపిస్తుంది. అలా శ్రీవిష్ణుభగవానుడు సాలగ్రామ రూపాన్ని ధరించాల్సి వచ్చిందని కథ.
సాలగ్రామ శిలలు గండకీనదిలో లభిస్తుంటాయి. ఇవి ఎంత చిన్నవిగా ఉంటే అంత మంచిదని అంటారు. సాలగ్రమంపై ఉన్న చక్రాలను బట్టి వాటిని వివిధ పేర్లతో పిలుస్తుంటారు.
ఒక చక్రం ఉంటే సుదర్శనమని,
రెండు చక్రాలు ఉంటే లక్ష్మీనారాయణ అని,
మూడు చక్రాలు ఉంటే అచ్యుతుడనీ,
నాలుగు చక్రాలు ఉంటే జనార్ధుడు అనీ,
ఐదు చక్రాలు ఉంటే వాసుదేవుడనీ,
ఆరు చక్రాలు ఉంటే ప్రద్యుమ్నుడనీ,
ఏడు చక్రాలు ఉంటే సంకర్షణుడు అనీ,
ఎనిమిది చక్రాలు ఉంటే పురుషోత్తముడు అనీ
తొమ్మిది చక్రలు ఉంటే నవవ్యూహమని
పది చక్రాలు ఉంటే దశావతారమనీ,
పదకొండు చక్రాలు ఉంటే అనిరుద్ధుడు అని,
పన్నెండు చక్రాలు ఉంటే ద్వాదశాత్ముడు అనీ,
పన్నెండు కంటే ఎక్కువ చక్రాలు ఉంటే అనంతమూర్తి అని పిలుస్తుంటారు.
సాలగ్రామన్ని ఆవుపాలతోగానీ, పంచామృతంతోగానీ శుద్ధి చేసి, రుద్రాక్షధారణ చేసేటప్పుడు చేసే నియమాలతో సాలగ్రామాన్ని పూజించాలి. ఇంట్లో పూజించే సాలగ్రామానికి నిత్యం నైవేద్యం సమర్పించాలి. కుటుంబసభ్యులు తప్ప, మిగతావాళ్ళకి సాలగ్రామన్ని చుపించకూడదు. సాలగ్రామన్ని స్త్రీలు తాకరాదన్న నియమం ఉంది. సాలగ్రామం ఉన్న ప్రదేశంలో స్నానం చేసినా, దానం చేసినా కాశీక్షేత్రంలో చెసిన స్నాన, దానాల కంటే నూరురెట్లు ఫలితం కలుగుతుందనేది ఋషివాక్కు. సాలగ్రామ శిలకు షోడశోపచార పూజ చెస్తే అన్ని కల్పాంతాల వరకు వైకుంఠంలో నివసించే భాగ్యం కలుగుతుంది. సాలగ్రామ పూజ చేస్తే శివకేశవులను పూజించిన ఫలితం కలుగుతుంది. మంత్రాలేమి తెలియక పోయినప్పటికీ భక్తి విశ్వాసాలతో సాలగ్రామం పూజను చెస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సర్వపాపహరం చేసేది, సర్వకష్టాలనుంచి రక్షించేది సాలగ్రామం.