జ్ఞానదీపాలు వెలిగించే సాయిబాబా
జ్ఞానదీపాలు వెలిగించే సాయిబాబా
మనం నిత్యం సత్యాన్నే వెంటపెట్టుకుని ఉండాలి. భగవంతునికి ఏదైనా సమర్పించాలనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా, భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో సహృదయంతో మెలగాలి. బాబాకు సేవ చేస్తున్నామనే ఆలోచన మనసులోకి రానివ్వకూడదు.
సాయిబాబాకు దీపాలంకరణ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ ద్వారకామాయిలో నూనె దీపాలు వెలిగించి దేదిష్యమానం చేస్తూ ఉండేవారు. అందుకు అవసరమైన నూనెను షిర్డీలోని దుకాణదారులను అడిగి తెచ్చుకునేవారు. కొద్ది రోజులకు వ్యాపారుల్లో దుర్భుద్ధి ప్రవేశించి రోజు బాబాకు ఉచితంగా నూనె ఎందుకు ఇవ్వాలి? అనుకున్నారు. బాబా యథావిధిగా వ్యాపారుల వద్దకు వెళ్లి నూనె అడిగారు. ఎవ్వరూ ఇవ్వలేదు. తమ వద్ద నూనె లేదని చెప్పారు. నూనె లేదు కాబట్టి బాబా ఏం చేస్తారో చూడాలనే కుతూహం వారిలో కలిగింది.
బాబా ప్రతిరోజు నూనె తెచ్చుకునే డబ్బాలో నీళ్లును పోసి బాగా కలియత్రిప్పి ఆనీటిని నోటిలోకి తీసుకుని పుక్కిలించి తిరిగి ఆ డబ్బాలోకి పోశారు. ఆ నీటిని ప్రమిదల్లో పోసి దీపాలు వెలిగించారు. రాత్రంతా అవి జ్ఞానప్రకాశాలను విరజిమ్మాయి. ఇదంతా చూసిన వ్యాపారుల కళ్లకు అజ్ఞానపు చీకట్లు ఆ వెలుగులో తొలగిపోయాయి. క్షమించమంటూ బాబా కాళ్ళపై పడ్డారు. అబద్దాలు ఆడవద్దని, ఎల్లప్పుడూ సత్యాన్నే పలకవలెనని చెప్పి బాబా వారిని పంపించారు.
నిజానికి సూర్యాచంద్రులనే ఆకాశ దీపాలుగా నిలిపిన మహిమాన్వితుడికి నూనె దీపాలు వెలిగించటం ఓ లెక్కా? బాబా దీపాలు వెలిగించాలంటే నూనె అక్కర్లేదు. సంకల్పం చాలు. కానీ, మానవావతారంలో నడిచిన దైవం బాబా. అందుకే మామూలు మనిషిలా నటించి ఎలా బతుకుతాడో జీవించి చూపారు.
బాబా భక్తుల్ని సన్మార్గంలో పెట్టటానికి, వారి పాపాలు, కర్మల్ని ధ్వంసం చేసి మానవజన్మను చరితార్థం చేయడానికి అవతరించిన దివ్య పురుషుడు. మనం భగవంతునికి భక్తితో పాటు ప్రేమను కూడా అర్పించాలి. నిజానికి మనం అడగదల్చుకున్నవన్నీ గ్రహించి కోరకుండానే అనుగ్రహించి భగవంతుడికి మనం అర్పించుకునేది పరిపూర్ణ భక్తిని మాత్రమే. దానిని శ్రద్ధ, విశ్వాసాలతో పాటించటం ముఖ్యం.